ఊరూరా సమైక్యాంధ్ర ఉద్యమం | Samaikya andhra movement raises in semmandhra regions | Sakshi
Sakshi News home page

ఊరూరా సమైక్యాంధ్ర ఉద్యమం

Published Sat, Aug 10 2013 12:37 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM

ఊరూరా సమైక్యాంధ్ర ఉద్యమం

ఊరూరా సమైక్యాంధ్ర ఉద్యమం

సాక్షి నెట్‌వర్క్: ఒకటే లక్ష్యం.. ఒకటే గమ్యం.. సమైక్యాంధ్ర కొనసాగించడం.. ఇదే శ్వాసగా, ఆశగా సీమాంధ్రలో ఊరూవాడా ఉప్పెనలా ఉద్యమం ఉరకలేస్తోంది. సమైక్యాంధ్ర సాధనలో కదం తొక్కుతున్న కోస్తా, రాయలసీమ ప్రజ పండుగరోజు కూడా విశ్రమించలేదు. రంజాన్ పర్వదినం సందర్భంగా నిరసనలకు సడలింపు ఇవ్వాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చినప్పటికీ అన్నిచోట్లా ఆందోళనలు మిన్నంటాయి. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసనప్రదర్శనలతో సీమాంధ్ర ఊళ్లు దద్దరిల్లాయి. కాంగ్రెస్ నేతలపై జనాగ్రహం ఇప్పట్లో చల్లారేలా లేదు. సోనియాగాంధీ, రాహుల్, దిగ్విజయ్, బొత్సలతో పాటు కేసీఆర్ దిష్టిబొమ్మల దహనాలు, వినూత్ననిరసనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని వీఆర్ కళాశాల కూడలిలో నిర్వహించిన నమూనా ప్రజాకోర్టులో కేసీఆర్‌కు ఉరిశిక్ష విధించారు.
 
 విజయనగరం జిల్లా నెల్లిమర్లలో పీసీసీ చీఫ్ బొత్స దిష్టిబొమ్మకు చెప్పులు వేసి  ఊరేగించారు. కర్రలతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏకలవ్య అసోసియేషన్ సభ్యులు సీమ పందిపై కేసీఆర్ పేరు రాసి పట్టణంలో డప్పుల విన్యాసాలతో ఊరేగించారు. విశాఖ జిల్లా అరకులో మార్కెట్ వ్యాపారులు కేసీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ, పెద్ద కర్మ నిర్వహించారు. తిరుపతిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన మహిళలు, యువకులు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను తాళ్లతో బంధించి లాక్కుంటూ వెళ్లి వినూత్నంగా నిరసన తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో గంగిరెద్దుకు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పేర్లతో ప్లకార్డులు కట్టి ఊరేగించారు.
 
 రోడ్డుపైనే ముస్లింల నమాజ్
 సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగింపే లక్ష్యంగా ముస్లింలు రంజాన్‌రోజు కూడా ఆందోళనలు హోరెత్తించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కర్బలా మైదానంలో రంజాన్ నమాజ్‌లను ముగించుకున్న అనంతరం ముస్లింలంతా పాత బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ప్రత్యేక నమాజ్‌లు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరులో సుమారు 10వేల మందికిపైగా ముస్లింలు మదనపల్లె రోడ్డు నుంచి ఈద్గా మైదానం వరకు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు.
 
 అనంతరం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ అల్లాను ప్రార్థించారు. సత్యవేడులో ముస్లింలు ర్యాలీ నిర్వహించి అనంతరం పండుగలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో శివయ్యస్థూపం సెంటర్‌లో ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు.  ఈద్గాలలో ప్రార్థనల అనంతరం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు సమైక్యాంధ్రను కాంక్షిస్తూ శాంతి ర్యాలీలు చేపట్టారు. ఎస్కేయూలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో  ప్రార్థనల అనంతరం భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. విజయవాడ  కృష్ణలంక పోలీసు స్టేషన్ పక్కన ఉన్న మసీదులో ప్రార్ధనలు ముగించుకున్న ముస్లింలు హైవేపై రాస్తారోకో నిర్వహించారు.
 
 విద్యుత్ ఉద్యోగుల నిరసన
 విశాఖలో విద్యుత్ ఉద్యోగులు సీతమ్మధారలోని ఈపీడీసీఎల్ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా బయలుదేరి మద్దిలపాలెం కూడలి వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. అక్కడి నుంచి ఎన్‌ఏడీ కూడలికి బయలుదేరి అక్కడా రాస్తారోకో నిర్వహించారు.
 
 ఆర్టీసీ సిబ్బంది ప్రదర్శన
 ఆర్టీసీ ఎన్‌ఎంయూ నేతలు విద్యార్థి జేఏసీతో కలిసి మద్దిలపాలెం జాతీయరహదారిపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి, బహిరంగ స్నానాలు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, విద్యార్థి, ప్రజా సంఘాల నేతృత్వంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ కర్మాగారాన్ని ముట్టడించారు. గాజువాకలోని లంకెలపాలెం వద్ద వైఎస్సార్ సీపీ పెందుర్తి సమన్వయకర్త గండి బాబ్జీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
 
 వైద్య, ఉపాధ్యాయ, న్యాయవాదుల నిరశన
 కడపలో జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల నిరాహార దీక్షలు, కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల, రిమ్స్‌లో డాక్టర్ల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.  వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి చేస్తున్న ఆమరణనిరాహారదీక్ష ఐదోరోజుకు చేరింది. రాయచోటిలో జేఏసీ నేతలు చేస్తున్న దీక్షాశిబిరాన్ని ఎమ్మెల్యేల గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు.
 
 మున్సిపల్ ఉద్యోగుల రిలేదీక్షలు
 గుంటూరు జిల్లా చిలకలూరిపేట, తెనాలి, రేపల్లె, వినుకొండల్లో మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. మున్సిపల్ టీచర్ల సమైక్య జేఏసీ అన్నిచోట్లా ర్యాలీలు నిర్వహించింది.
 
 రిక్షావాలాల రాస్తారోకో
 తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద 216 జాతీయ రహదారిపై 250 మంది రిక్షా కార్మికులు డప్పులు వాయిస్తూ రిక్షాతో భారీ ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. తన భార్య సరస్వతి(వాణి) శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్టు మంత్రి తోట నరసింహం ప్రకటించారు.
 
 అంధుల నిరాహారదీక్ష
 తిరుపతి ఎస్వీయు వద్ద అంధ విద్యార్థులు ఒకరోజు రిలే నిరాహారదీక్ష చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల రిలేదీక్షలకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మద్దతు పలికారు. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి తన కుమారుడు పీసీసీ కార్యదర్శి గల్లా జయదేవ్‌తో కలిసి తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగే ఉద్యమాల్లో పాల్గొంటానని మంత్రి గల్లా ప్రకటించారు.
 
 సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు అంధకూపం శిక్ష
 విజయనగరం సమైక్యాంధ్ర  జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు నేతృత్వంలో  సోనియా, రాహుల్‌గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను  దున్నపోతుతో తొక్కిస్తూ  అంధకూపం శిక్ష విధించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన కత్తి, కర్రసాము చేసే కళాకారులంతా కత్తులు, కర్రలతో యుద్ధ  విన్యాసాలు చేస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నెల్లిమర్లలో 200 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి విజయనగరం - పాలకొండ రహదారిని దిగ్బంధించారు. ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సమ్మెను ప్రారంభిస్తామని, రాష్టాన్ని విభజిస్తున్నట్టు ప్రకటించిన  ఏఐసీసీ అధిష్టానం సమైక్యంగా ఉంచుతున్నట్టు ప్రకటించే వరకూ కొనసాగిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఏలూరులో స్పష్టం చేశారు.
 
 కావూరి, కనుమూరిలను పట్టుకుంటే రూ.లక్ష
 ఎంపీ కనుమూరి బాపిరాజు, మంత్రి కావూరి సాంబశివరావు కనిపించడం లేదని, వారిని పట్టుకుని అప్పగిస్తే సమైక్య జేఏసీకి రూ.లక్ష ఇస్తానని  వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు భీమవరంలో ప్రకటించారు. శ్రీకాకుళంలో విద్యుత్ ఉద్యోగులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పలాస-కాశీబుగ్గలో ‘సిక్కోలు ధూమ్‌ధామ్’ కార్యక్రమం నిర్వహించారు.  ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఒంగోలులో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రభుత్వ వైద్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పర్చూరులో న్యాయవాదులు చేపట్టిన 5వ రోజు దీక్షాశిబిరాన్ని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పుటూరి మురళి సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
 
 ఒంగోలులో శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలతో అభిషేకం చేసి అమరజీవి ఆశయం కొనసాగాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి పాల్గొని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
 
 కేంద్రాన్ని ఎదిరిస్తాం: మంత్రి సారథి
 సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఉయ్యూరులో చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని సందర్శించిన మంత్రి పార్ధసారథి మాట్లాడుతూ, రాష్ట్రం సమైక్యంగా ఉండేలా కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎదిరించి కేంద్ర మంత్రులను నిలదీస్తామన్నారు. బెజవాడలో స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్‌టీఎస్‌రోడ్డుపై ప్రదర్శనలు చేశారు. వన్‌టౌన్‌లో మార్వాడీ మహిళలు ర్యాలీ నిర్వహించారు. కృష్ణాజిల్లా జి కొండూరు మండలం కట్టుబడిపాలెంలో గ్రామస్తులు ధర్నా చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నేత సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో బైక్‌ర్యాలీ నిర్వహించారు.
 
 సమ్మెకు టీటీడీ ఉద్యోగుల మద్దతు
 ఈవోకు నోటీసులు అందజేత
 సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగనున్నారు. ఈమేరకు టీటీడీ ఈవోకు నోటీసులు అందజేసిన అనంతరం ఉద్యోగుల సమాఖ్య నాయకులు విజయకుమార్, ఆంజనేయులు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులంతా ఒక తాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడినట్టు తెలిపారు. స్వామి వారి దర్శనార్థం వచ్చే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలుగజేయబోమని హామీ ఇచ్చారు. తిరుమలలో ఉద్యోగులు యథావిధిగా విధుల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారన్నారు.
 
 12 నుంచి సమ్మెలో 630 మంది ఎంపీడీవోలు
 విజయవాడ, న్యూస్‌లైన్ : 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిర్వహించతలపెట్టిన నిరవధిక సమ్మెలో 13 జిల్లాలకు చెందిన 630 మంది ఎంపీడీవోలు పాల్గొంటారని రాష్ట్ర ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.హరిహరనాథ్ చెప్పారు. విజయవాడలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీరాజ్‌శాఖ ద్వారా అందిస్తున్న సేవలను నిలిపేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. విభజన ప్రక్రియను నిలిపేసి రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రకటించేవరకు కార్యాలయాలు మూసేసి నిరసన తెలియజేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement