వణికిస్తున్న 'గెలాక్సీ నోట్ 7' బాంబు
స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో రారాజులా వెలిగిన శాంసంగ్ కు 'గెలాక్సీ నోట్ 7' రూపంలో కోలుకోలేని దెబ్బతగిలింది. అటు ప్రధాన ప్రత్యర్థి ఆపిల్ మార్కెట్లోకి శరవేగంగా దూసుకొస్తోంటే.. అనూహ్యపరిణామాలు సంస్థకు అశనిపాతంలా చుట్టుకున్నాయి. ఒక్కసారిగా పేలుడు వార్తలు రావడం, కొన్ని అంతర్జాతీయ విమానాల్లో నిషేధం తదితర పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అమెరికా కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ తాజాగా జారీ చేసిన ఆదేశాలు సంస్థను కృంగదీసేలా ఉన్నాయి. వినియోగదారులు గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని లేదా స్విచ్ ఆఫ్ చేయాలని తెలిపింది. దీని వినియోగా చాలా ప్రమాదకరమైనదని ప్రకటించింది. ఈ వ్యవహారంలో శాంసంగ్ సంస్థతో అధికారిక రీకాల్ కోసం పనిచేస్తున్నట్టు సంస్థ శుక్రవారం వెల్లడించింది. అలాగే సంస్థ ప్రకటించిన రీప్లేస్ మెంట్ ఆఫర్ సరియైనదా కాదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపింది.
ఇటీవలే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా లాంచ్ చేసిన ఈ తాజా ఫోన్ బ్యాటరీలు పేలుతున్న సంఘటనలు సంస్థను వణికించాయి. మరోవైపు యూజర్లకు చెమటలు పట్టించాయి. ఈ నేపథ్యంలో భారత విమానాల్లో ఈ ఫోన్లు వాడొద్దంటూ అధికార డిజీసీఏ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. భారత ఎయిర్ లైన్స్, ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ అలాగే అమెరికాకు చెందిన అమెరికన్ ఎయిర్ లైన్ రెగ్యులేటర్ ,ది ఫెడరల్ ఏవియేషన్ అధారిటీ ( ఎఫ్ఎఎ)లు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. దీంతోపాటు తాజాగా గురువారం అమెరికా విమానయాన భద్రతా అధికారులు కూడా ప్రయాణికులకు నిషేధాజ్ఞలు జారీ చేశారు.
లాంచ్ అయిన కొద్ది రోజులకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఈఫోన్లను దాదాపు 2.5మిలియన్ ఫోన్లను రీకాల్ చేయాలని శాంసంగ్ నిర్ణయించింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 35ప్రమాదాలు సంభవించినట్టు ధృవీకరించింది. నష్టపోయిన కష్టమర్లకు ప్రత్యామ్నాయంగా గెలాక్సీ ఎస్7, ఎస్7ఎడ్జ్ ఫోన్లను రీప్లేస్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.