
ఏడాదిలో ఎన్నెన్ని బాగోతాలో!
ఓటుకు నోటు వ్యవహారంలో బయటపడ్డ ఆడియో సంభాషణలు వింటే అసలు సూత్రధారి చంద్రబాబనే విషయం రూఢీ అవుతోంది. ఇంత భారీ డబ్బు ఓట్లు కొనుగోలు చేసేందుకు వాడుతున్నారంటే అదంతా ఎక్కడి నుంచి వస్తోందనే అనుమానం ప్రతీ ఒక్కరిలో కలుగుతోంది. ఏపీలో అక్రమంగా సంపాదించిన సొమ్మును తెలంగాణలో ఓట్లు కొనేందుకు వినియోగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏడాది చంద్రబాబు పాలనలో సాగిన అవినీతి బాగోతాలు దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
చంద్రబాబు అవినీతికి పరాకాష్ఠ - జీ.ఓ.నెంబర్ 1. దీన్ని 2015 జనవరి ఒకటిన జారీ చేశారు. గోదావరి జలాల తరలింపునకు సంబంధించిన జీఓ ఇది. ఎన్నికలకు ముందు పట్టిసీమ ఎత్తిపోతల అనే పదం చంద్రబాబు మదిలో లేదు. పార్టీ మ్యానిఫెస్టోలోనూ దాని ప్రస్తావన కనిపించదు. మరి హఠాత్తుగా ఈ జీఓ ఎందుకు విడుదల చేశారు? పట్టిసీమ దగ్గర ఎత్తిపోతల పథకం కట్టాలని గోదావరి జిల్లాలకు చెందిన ఏ రైతూ ఏనాడూ అడిగిన పాపాన పోలేదు. పట్టిసీమకు రాయలసీమకు లింకు ఎలా కుదిరింది? కాంట్రాక్టర్ల నుంచి భారీగా లంచాలు తీసుకోడానికి జీ.ఓ.నెంబర్ ఒకటి జారీ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రమే పూర్తి చేయాలి. మరీ పట్టిసీమ ప్రాజెక్టుపై ఎందుకు హడావుడి చేస్తున్నట్టు? పట్టిసీమ ఎత్తిపోతల పథకం టెండర్ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా 21.9 శాతం ఎక్సెస్‌కు అనుమతి ఇవ్వడం, గడువులోపు పూర్తి చేస్తే కాంట్రాక్టర్‌కు అదనంగా 16.9 శాతం చెల్లిస్తామని చెప్పడం దేనికి సంకేతం? ఇందులో వందల కోట్ల రూపాయలు దోచుకున్నది వాస్తవం కాదా?
ఇక చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి నిలువెత్తు సాక్ష్యం జీ.ఓ. నెంబర్ 22. జలయజ్ఞం ప్రాజెక్టులకు విడుదల చేస్తున్న నిధులన్నీ దోపిడీ అని, జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందన్న చంద్రబాబు మరీ తాను సీఎం అయిన తర్వాత ఆ ప్రాజెక్టులకయ్యే ఖర్చును తగ్గించారా? పెంచారా? జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తోంది చంద్రబాబేనని చెప్పేందుకు జీఓ నెంబర్ 22 చాలు. కాంట్రాక్టర్లు అడగకుండానే వరాలిచ్చేశారు. 2013 నుంచి ఇనుము, సిమెంట్ ధరల్లో పెరుగుదల తీసుకోండని కాంట్రాక్టర్లపై అపార కరుణ చూపారు చంద్రబాబు. ఈ ఆలోచన చేసింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. అప్పట్లో టీడీపీ ఇది భారీ కుంభకోణమని దోచిపెడుతున్నారని గగ్గోలు పెట్టింది. మరి అధికారంలోకి వచ్చాక ఆగమేఘాలపై ఎందుకు ఈ జీ.ఓ. విడుదల చేసినట్టు? ఇంత భారీ కుంభకోణానికి సంబంధించిన ప్రణాళిక రచన చాలా వేగంగా సాగింది. డిసెంబర్ 31, 2014న నీటిపారుదల శాఖ ఫైల్ పుటప్ చేస్తే జనవరి 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దానిపై సంతకం చేశారు. జనవరి రెండున జరిగిన కేబినెట్ సమావేశంలో ఇది అజెండా అయిపోయింది. అదేరోజు చంద్రబాబు దానిపై సంతకం పెట్టేశారు. ఆరోజే మధ్యాహ్నం కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి కోటయ్య కమిటీలు, సవాలక్ష మెలికలు, మరీ కాంట్రాక్టర్లు అడగక ముందే ఇవ్వడానికి ఆగమేఘాలపై సంతకాలు. కోట్ల రూపాయలు దండుకోడానికి కాదా ఈ జీ.ఓ. నెంబర్ 22? శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు పనుల అంచనాలు ఈ జీ.ఓ కారణంగా ఏకంగా 300 కోట్ల రూపాయలు పెరిగాయి. ఇలా ఎన్ని ప్రాజెక్టులో. మరీ వీటిలో బాబు గారి వాటా ఎంతో?
ఇక చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో కానుకలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లోని పేద ప్రజలకు కాదు. సంక్రాంతి పండగకు కానుకంటూ ఊరువాడా చంద్రబాబు ప్రభుత్వం ఊదరగొట్టింది. చంద్రన్న కానుకకు ప్రభుత్వం కేటాయించిన మొత్తం 314 కోట్ల రూపాయలు. పథకంలో తన పేరు మాత్రమే కాదు, పథకం వల్ల లాభం కూడా తనకే కలిగేలా చంద్రన్న కానుకను డిజైన్ చేశారు. అరకిలో కందిపప్పు, అర కిలో బెల్లం, అరలీటరు పామోలిన్, కిలో శనగలు, 100 గ్రాముల నెయ్యి, కేజీ గోధుమ పిండి ఇస్తామని గొప్పగా ప్రచారం చేసిన ప్రజలకు మాత్రం అరకొరగా అందజేశారు. తెలుగు తమ్ముళ్లకు అధిక రేట్లకు కాంట్రాక్టులిచ్చి భారీ కుంభకోణానికి తెరదీశారు. చంద్రన్న కానుల వల్ల ప్రభుత్వ ఖజానాకు 27 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని చంద్రబాబు భజన చేసే పత్రికే రాసింది. మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర 69 రూపాయలుంటే 79 రూపాయల 60 పైసలకు కోట్ చేసి దక్కించుకున్నారు. ఇక బహిరంగ మార్కెట్‌లో కిలో నెయ్యి 320 నుంచి 375 వరకూ ఉంటే, చంద్రన్న కానుక కోసం దాదాపు 200 రూపాయలు ఎక్కువ చెల్లించి కొనుగోలు చేశారు. కొన్నది ఎక్కడి నుంచో అందరికీ తెలిసిందే. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌కు చెందిన హెరిటేజ్ డెయిరీ నుంచే. హెరిటేజ్ డెయిరీ నుంచి వ్యాట్‌తో కలిపి కేజీకి 575 రూపాయలు చెల్లించి మరీ నెయ్యి కొన్నారు. ఒక్క హెరిటేజ్‌కే అప్పనంగా కోటీ 5 లక్షల రూపాయలు అప్పగించారు. సంక్రాంతి సరుకులు జనాలకు ఏ మాత్రం సంతోషం కలిగించకపోయినా, టీడీపీ మంత్రులు, నాయకులకు మాత్రం సరిపడ మేత దొరికింది. హెరిటేజ్ పంట పండింది.
ల్యాండ్ పూలింగ్ - మరో అవినీతి బాగోతం. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో భూమి సేకరిస్తున్నామని చెప్పి రైతు నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో సింగపూర్‌కు భూములు కట్టబెడుతూ బాబు గారు రొక్కం వెనకేసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని భూసేకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రైతులపై బలవంతంగా ప్రయోగిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ వివాదాస్పదమై, ఆమోదం లభించక త్రిశంకు స్వర్గంలో ఉంటే దాన్ని ప్రయోగించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపుల వల్ల ల్యాండ్ పూలింగ్‌కు అనుమతించిన రైతులంతా ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు. రాజధాని పేరుతో లక్ష కోట్ల విలువైన భూదోపిడీకి రంగం సిద్ధమైంది. రాజధాని కోసం తీసుకుంటున్న 40 వేల ఎకరాల్లో వాటి యజమానులైన రైతులకు దక్కేది పావు వంతు కంటే తక్కువే. ప్రభుత్వం చేజిక్కుంచుకునే భూమి 22,500 ఎకరాలు. సమగ్రంగా అభివృద్ధి చేసే 10 వేల ఎకరాల భూమంటే మొత్తంగా 4.84 కోట్ల గజాల భూమిని ప్రభుత్వం పైసా పెట్టుబడి లేకుండా అమాయక రైతుల నుంచి కబ్జా చేయబోతోంది. కనిష్టంగా గజానికి 25 వేలు చొప్పున లెక్కించినా ఆ భూమి విలువ లక్ష కోట్ల రూపాయలు దాటుతుంది.
చేస్తామన్న రుణమాఫీ చేయకుండా రకరకాల మెలికలు పెడుతున్న చంద్రబాబు - పారిశ్రామికవేత్తలపై మాత్రం అడగకుండానే వరాల జల్లు కురిపించారు. మహిళా సంఘాలకు డ్వాక్రా బకాయిలు మాఫీ చేసేందుకు డబ్బుల్లేవంటున్న బాబుగారు పారిశ్రామికవేత్తలకు మాత్రం వారు అడగకుండానే రాయితీలు అందిస్తున్నారు. అది కూడా రూ. 2వేల కోట్లు. అంగన్‌వాడీల జీతాలు పెంచడానికి డబ్బుల్లేవు, వ్యవసాయ రుణాల మాఫీకి డబ్బుల్లేవు, మరీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వడానికి మాత్రం నోట్లు జలజలా రాలాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సింపుల్ లాజిక్. పారిశ్రామికవేత్తలకు రాయితీలు విడుదల చేస్తే 30 శాతం కమీషన్లు నేరుగా చినబాబుకు దక్కేలా డీల్ కుదిరందని జోరుగా ప్రచారం సాగుతోంది. పారిశ్రామికవేత్తలకు అందాల్సిన రాయితీ సొమ్ములో 30 శాతమంటే అక్షరాలా 700 కోట్ల రూపాయలు. ఈ డీల్ కుదిరిన తర్వాతే పరిశ్రమల శాఖ 100, 399, 225 జీఓలు జారీ చేసిందనే ప్రచారం సాగుతోంది. మరీ ఇంత రాయితీ ఇచ్చాక ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఏమైనా పరిశ్రమలు వచ్చాయా అంటే అదేమీ లేదు. నాలుగేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న రాయితీలను చంద్రబాబు గారు ఉదారంగా విడుదల చేశారు. ఖజానాలో డబ్బు లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లి మరీ ఈ కోట్ల రూపాయల రాయితీలు చెల్లించారు.
బెరైటీస్ లీజు వ్యవహారమంతా గలీజే. పాత బెరైటీస్ లీజులు రద్దుచేసిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేట్‌పరం చేయడానికి, అయినవారికి కట్టబెట్టేందుకు వ్యూహం రచించింది. జీఓ నెంబర్ 163 చంద్రబాబు లొసుగులకు నిదర్శనం. రాష్ట్ర ఖనిజావృద్ధి సంస్థ ఆదాయానికి గండికొడుతూ మైనింగ్ లీజులు కేటాయించారు. అంతర్జాతీయ మార్కెట్ రేటులో 70 నుంచి 75 శాతానికి కేటాయింపులు జరగాలన్నది నిబంధన. ఈ మేరకు తొలుత టెండర్లు పిలిచారు. సీఎం సొంత మనుషులు ఎంటరై టెండర్లు ఖరారు కాకుండా రింగయ్యారు. అంతే నిబంధన మారిపోయింది. పెద్దలకు చేరాల్సింది చేరిపోయింది. 70 నుంచి 75 శాతంగా ఉండాల్సిన బేసిక్ రేటు 65 నుంచి 70 కి తగ్గిపోయింది. దీనివల్ల ఏపీఎండీసీకి అధికారికంగా రూ. 28 కోట్ల నష్టం వాటిల్లింది. మరీ ఏ సంస్థలకు కోట్లు కట్టబెట్టడానికి ఈ నిబంధనలు సడలించారో ఏలినవారికే తెలియాలి.
గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మినీ పవర్ ప్లాంట్ల పేరుతో చంద్రబాబు చేసిన ఘనకార్యాలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు 2300 కోట్ల రూపాయల లబ్ది చేకూర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం పావులు కదిపింది. వారికి లబ్ధి చేకూర్చితే రాష్ట్ర ప్రజలకూ ఎలాంటి మేలు జరగదు. కానీ చంద్రబాబుకు మాత్రం కావాల్సినంత, రావాల్సినంత ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి విద్యుత్ అందుతుంది కాబ్టటి కరెంట్ కొరత లేదు. ప్రస్తుతం గ్యాస్ ఆధారిత ప్లాంట్ల ద్వారా 1.2 మిలియన్ యూనిట్లకు అదనంగా మరో 1.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించడం, తద్వారా గ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వ్యాట్‌ను వదులుకొని ఆ సంస్థల జేబు నింపడం ఈ పథకంలో భాగం. ప్రజాధనాన్ని నష్టపరిచి ఆ కంపెనీలకు వ్యాట్ రాయితీలు ఇస్తే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఖజానాకు వాటిల్లే నష్టం 2300 కోట్లు. డబ్బుల్లేవని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రజలపై పన్నులు, ఛార్జీలు బాదుతున్న చంద్రబాబు మరో వైపు కార్పొరేట్ కంపెనీలకు జనం సొమ్మును ధారాళంగా ధారపోస్తున్నారు.
ఇక బాబుగారి దుబారా ఖర్చులకు లెక్కే లేదు. చెట్ల కిందా ఉంటా, మీ దగ్గరే ఉంటా, షెడ్లు వేసి సెక్రటేరియట్ నడిపిస్తానన్న చంద్రబాబు ఎప్పుడూ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు విలాసవంతమైన భవనాలకు, విమాన ప్రయాణాలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరించారు. విజయవాడ క్యాంప్ ఆఫీస్ కోసం ఇప్పటి వరకూ విడుదల చేసిన మొత్తం 16 కోట్లు. ఇక హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌లో ఆయన కార్యాలయంలో హంగు, ఆర్భాటాలకు చేసిన ఖర్చు 25 కోట్లు. అలాగే సీఎం క్యాంప్ ఆఫీసు లేక్ వ్యూ మరమ్మతులకు ఐదు కోట్లు ఖర్చుచేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో సీఎం కొత్త ఇల్లు, ఆఫీసు అద్దె లక్షల్లోనే ఉంది. ఇక ఢిల్లీ ఏపీ భవన్‌లో సీఎం కాటేజ్ రిపేర్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఢిల్లీలో చంద్రబాబు ఉండేది నెలకు మహా అయితే ఒకటి లేదా రెండు రోజులు. దానికే ఇంత ఖర్చుపెట్టడం, అదికూడా రాష్ట్రం కష్టాల్లో ఉందంటూ.. ఎంతవరకు భావ్యమో!