కాంగ్రెస్‌ను వీడే ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నారు: బొత్స సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి వలస వెళ్లే ఎమ్మెల్యేలు ఇంకొందరు ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున సొంత పనులు చక్కదిద్దుకునేందుకే వారు పార్టీలో కొనసాగుతున్నారని తెలిపారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలంతా గతంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వెళ్లొచ్చిన వాళ్లేనని, స్వార్థ ప్రయోజనాల కోసమో, ఆత్మస్థైర్యం లేకనో కాంగ్రెస్‌ను వీడి వెళుతున్నారని చెప్పారు.
ఒక వ్యక్తి పార్టీని వీడితే కొంత నష్టం ఉంటుందని, అదే సమయంలో మంచి లాభం కూడా జరుగుతుందని, అదేమిటనేది వేచి చూడాల్సిందేనని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేస్తున్నారో లేదో తెలియదన్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర భవన్‌లో తెలంగాణ లాయర్లు వెళ్లి అలజడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరినట్లు తెలిపారు.
విడిపోతే తప్పులేదు.. కానీ సమైక్యంగానే ఉండాలి: తెలుగు మాట్లాడేవారు రెండు రాష్ట్రాలుగా విడిపోతే తప్పులేదని తాను గతంలో చెప్పిన మాట వాస్తవమేనని, ఇప్పటికీ యూ టర్న్ తీసుకోలేదని బొత్స చెప్పారు. అయితే తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సమైక్యంగా ఉండాలని కోరుకోవడం పార్టీ ధిక్కారం కాదని, అభ్యర్థన మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని పునఃపరిశీలించాల్సిందిగా హైకమాండ్ పెద్దలను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.