'టూర్కి వెళతారా.. ఎయిడ్స్ ఉందో లేదో చెప్పండి'
న్యూఢిల్లీ: ఓ కార్యక్రమానికి సంబంధించి ప్రాణాంతక, ధీర్ఘకాలిక వ్యాధులు లేనట్లుగా మెడికల్ సర్టిఫికెట్లు జతపర్చాల్సిందిగా కేంద్రం ఆయా సీనియర్ ప్రభుత్వాధికారులను ఆదేశించింది. వచ్చే నవంబర్ 2 నుంచి అదే నెల 30వరకు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగే ఓ అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. దీనికోసం ధారాళంగా ఆంగ్లంలో మాట్లాడటంతోపాటు రాయగల అనుభవజ్ఞులు, ఆరోగ్యపుష్టి కలవారు అర్హులని పేర్కొంది. దీంతోపాటు వారంతా తమకు ఎయిడ్స్, టీబీ, ట్రకోమా, చర్మవ్యాధులు లేనట్లుగా నిర్ధారించే మెడికల్ సర్టిఫికెట్లు జత చేర్చాలని షరతుగా పెట్టింది.
ఇక మహిళలయితే ముందస్తు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న సర్టిఫికెట్లు జత చేర్చాలని స్పష్టం చేసింది. దీంతోపాటు వారు ఎందుకు ఆ సదస్సుకు హాజరుకావాలనుకుంటున్నారో, ఏ విధంగా లబ్ధి పొందాలనుకుంటున్నారో వివరంగా పేర్కొనాలని తెలిపింది. ఖర్చులతోపాటు ఈ టూర్ సమయంలో కేంద్రం ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, ఆర్థిక, సామాజిక అంశాలపై బ్యాంకాక్ సదస్సులో నెల రోజులపాటు శిక్షణా కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ శుక్రవారమే ఆఖరు తేది.