
యెమెన్‌లో ఆత్మాహుతి దాడులు
యెమెన్ రాజధాని సనా గురువారం ఆత్మాహుతి దాడులతో రక్తసిక్తమైంది. రెండు చోట్ల జరిగిన పేలుళ్లలో కనీసం 70 మంది ప్రాణాలు కోల్పోయారు.
సనా: యెమెన్ రాజధాని సనా గురువారం ఆత్మాహుతి దాడులతో రక్తసిక్తమైంది. రెండు చోట్ల జరిగిన పేలుళ్లలో కనీసం 70 మంది ప్రాణాలు కోల్పోయారు. సనాలోని తాహిర్ స్వ్కేర్‌లో శక్తిమంతమైన పేలుడు పదార్థాలు అమర్చుకున్న ఓ మానవ బాంబు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో కనీసం 50 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. తిరుగుబాటుదారులకు మద్దతిస్తున్న హుతీలు నిరసనలకు సిద్ధమవుతుండగా పేలుళ్లు జరిగాయి. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. దీన్ని ఆల్‌కాయిదా పనిగా అనుమానిస్తున్నారు. ఛిద్రమైన దేహాలతో సంఘటనా స్థలం భీతావహంగా మారింది. మానవబాంబు బెల్టుకు అమర్చిన మీటను నొక్కి ఆత్మాహుతికి పాల్పడటంతో ఇనుప గోళాలు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తనకు సన్నిహితుడైన అహ్మద్ అవాద్ బిన్ ముబారక్‌ను ప్రధాని ప్రకటించటంతో యెమెన్ అధ్యక్షుడిపై తిరుగుబాటుదారులు మండిపడుతున్నారు. అయితే దేశం విచ్ఛిన్నం కాకుండా నిరోధించేందుకు ప్రధాని పదవిని చేపట్టబోమని ముబారక్ ప్రకటించారు. మరో ఘటనలో ఆగ్నేయ యెమన్ ముకళ్ల శివారులోని సైనిక తనిఖీ కేంద్రం వద్ద కారుబాంబు పేలుడులో 20 మంది సైనికులు మృత్యువాత పడ్డారు. 2012 మే నెలలో సనాలో సైనిక కవాతు సందర్భంగా ఆల్‌కాయిదా జరిపిన ఆత్మాహుతి పేలుళ్లలో 100 మంది మృత్యువాత పడ్డారు. అనంతరం ఇదే అతిపెద్ద ఆత్మాహుతి దాడి.