
బాంబులతో దద్దరిల్లిన యెమెన్, ఇరాక్
యెమెన్/బాగ్దాద్: ఉగ్రవాదులు మరోసారి పడగవిప్పారు. ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లేలా చేశారు. ఈ దాడులతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. సౌతర్న్ యెమెన్ పట్టణంలోని మిలటరీ ఫెసిలిటీ సెంటర్ లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడుల్లో ఇప్పటి వరకు 40మంది చనిపోయినట్లు తెలుస్తోంది. పలువురు గాయాలపాలయ్యారు. ఈ బాంబు ధాటికి ప్రభుత్వ బలగాలు ఉపయోగిస్తున్న ఓ ట్రైనింగ్ క్యాంపు కూడా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.
మృతుల సంఖ్య 45 నుంచి 60 వరకు పెరిగే అవకాశం ఉందని అక్కడి మీడియా చెప్తోంది. దాడి జరిగిన ప్రాంతం రక్తసిక్తంగా భీతావాహంగా మారింది. మరోపక్క, బాగ్దాద్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకే 47 తుపాకులతో, గ్రనేడ్లతో, ఆత్మాహుతి దాడులతో తెగబడటంతో దాదాపు 18మంది ప్రాణాలుకోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడగా అందులో ఒకరు ఆత్మాహుతి దాడి చేసుకొని చనిపోగా మరొకరిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.