
ఒత్మాన్ అలీ (ఫైల్)
బంజారాహిల్స్: తాను పెళ్లి చేసుకోబోయే యువతి కేన్సర్‌తో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక యెమన్ దేశానికి చెందిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పారామౌంట్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యెమన్ దేశానికి చెందిన మహ్మద్ ఒత్మాన్ అలీ(24) గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. కొద్ది క్రితం అతడికి తమ దేశానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది.
త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇటీవల ఆమె కేన్సర్‌తో మృతి చెందింది. దీంతో మనస్తాపానికిలోనైన ఒత్మాన్ అలీ తరచూ బాధపడుతున్నాడు. సోమవారం అతడి స్నేహితుడు మబ్‌కోట్ హస్సన్ బయటికి వెళ్లగా గదిలో ఒంటరిగా ఉన్న ఒత్మాన్‌అలీ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వైపు వీసా గడువు ముగుస్తున్నట్లు సమాచారం అందడం, మరో వైపు కాబోయే భార్య మృతిని తట్టుకోలేకపోతున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ‘నిన్ను అమితంగా ప్రేమించాను, నువ్వులేని లోకంలో నేనుండలేను.. స్వర్గంలో నిన్ను కలుస్తానంటూ’ లేఖలో పేర్కొన్నాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment