సదర్ నగరంలోని జమీలా మార్కెట్ ప్రధాన గేటు వద్ద ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 11 మంది చనిపోయారు..
- 11 మంది దుర్మరణం, 35 మందికి తీవ్రగాయాలు
- బాగ్దాద్‌లో మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ శివారు సదర్ పట్టణంలో మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. అక్కడి ప్రధాన కూరగాయ మార్కెట్‌పై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో కనీసం 11 మంది దుర్మరణం చెందారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతాదళం అధికారి చెప్పిన వివరాల ప్రకారం..
సదర్ నగరంలోని జమీలా మార్కెట్ ప్రధాన గేటు వద్ద ఈ సంఘటన జరిగింది. పేలుడు పదార్థాలు నింపిన కారును నడుపుకుంటూ ఉగ్రవాది.. మార్కెట్‌లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే అప్రమత్తమై, కారు ఆపాల్సిందిగా హెచ్చరించాడు. ఎంతకీ వినకపోవడంతో కారుకు గురిపెట్టి కాల్పులు జరిపాడు. అంతలోనే కారులో ఉన్న ఉగ్రవాది తననుతాను పేల్చేసుకున్నాడు. భారీ శబ్ధం, దుమ్ము ఎగిసిపడటంతో కొద్ది నిమిషాలపాటు అక్కడ అల్లకల్లోల పరిస్థితి తలెత్తింది.
పేలుడు ధాటికి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. షియాలు అధికంగా నివసించే సదర్ ప్రాంతంలో కొత్త సంవత్సరంలో చోటుచేసుకున్న రెండో దాడి ఇది. జనవరి 2న ఇదే పట్టణంలో ఐసిస్ జరిపిన పేలుళ్లలో 35 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నేటి ఘటనకు బాధ్యతవహిస్తున్నట్లు ఎవ్వరూ ప్రకటించనప్పటికీ, ఇది ముమ్మాటికి సున్నీ తీవ్రవాదుల పనే అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.