77 ఏళ్లు వచ్చినా.. ఆ పని మానలేదు
పాత చెడు అలవాట్లను మానడం కొందరికి చాలా కష్టం. సూపర్ నట్వర్లాల్, ఇండియన్ చార్లెస్ శోభ్రాజ్, సూపర్ థీఫ్ పేర్లతో పోలీసుల రికార్డుల్లో నమోదైన ఢిల్లీకి చెందిన ధనరామ్ మిట్టల్ కూడా ఈ కోవకు చెందినవాడే. 77 ఏళ్ల వయసు వచ్చినా, వృద్ధాప్యం మీద పడినా దొంగతనాలు చేయడం మానుకోలేదు. పాతికేళ్ల వయసులో దొంగతనాలు చేయడం మొదలెట్టిన మిట్టల్ ఇప్పటి వరకు 25 సార్లు అరెస్టయ్యాడు. తన జీవితంలో 52 ఏళ్లు నేరవృత్తిలో కొనసాగాడు. అతనిపై కనీసం 128 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. పోలీస్ అధికారిగా, జడ్జిగా, ప్రభుత్వ అధికారిగా బోల్తా కొట్టించి ఎంతోమందిని మోసం చేశాడు. దాదాపు 500 కార్లను దొంగలించినట్టు పోలీసులు చెప్పారు.
మిట్టల్ దొంగతనం కేసులో తొలిసారి 1964లో జైలు కెళ్లాడు. అప్పటి నుంచి దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు.. పోలీసులు అరెస్ట్ చేయడం.. జైలుకు వెళ్లడం.. అక్కడ కొత్త గ్యాంగ్లు ఏర్పాటు చేయడం.. విడుదలైన తర్వాత మళ్లీ దొంగతనాలు చేయడం షరా మాములే. ఈ ఏడాది మొదట్లో కారును దొంగిలించిన కేసులో అరెస్టయిన మిట్టల్ గత నెలలో బెయిల్పై బయటకు వచ్చాడు. జూన్లో కనీసం నాలుగు కార్లను దొంగలించినట్టు మిట్టల్పై ఆరోపణలు ఉన్నాయి. గత మంగళవారం పోలీసులు మళ్లీ మిట్టల్ను అరెస్ట్ చేశారు.
నేరాలబాట పట్టిన మిట్టల్ న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్ కావడం విస్తుపోయే విషయం. 1960ల్లో రోహ్టక్ కోర్టులో క్లర్క్గా పనిచేశాడు. అప్పట్లో జడ్జి సెలవుపై వెళ్లడంతో మిట్టల్ చాలామంది నేరస్తులకు బెయిల్ మంజూరు చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. దొంగల తరపున కోర్టుల్లో కేసులు కూడా వాదించాడు. నకిలీ పత్రాలతో రోహ్టక్ రైల్వే స్టేషన్ మాస్టర్గా ఉద్యోగం సంపాదించాడు. ఏడాది తర్వాత ఈ ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. మిట్టల్ భార్య, కోడలుతో కలసి ఢిల్లీ శివారుప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని ఇద్దరు కొడుకులు మాత్రం వేరుగా ఉంటున్నారు.