మోదీ గురువు కన్నుమూత
కోల్‌కతా: ప్రఖ్యాత రామకృష్ణ మఠం, మిషన్ అధ్యక్షుడు స్వామి ఆత్మస్థానందజీ మహరాజ్ (98) తనువు చాలించారు. గతకొద్దికాలంగా వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆత్మస్థానందజీ.. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తుదిశ్వాస విడిచారని రామకృష్ణ మఠం తెలిపింది. అంత్యక్రియలు బేలూరు మఠంలో సోమవారం నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఆత్మస్థానందజీ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మస్థానందజీ మరణం వ్యక్తిగతంగా తనకు పూడ్చలేని లోటని అన్నారు. తన జీవితంలో కీలక దశలో ఆయనతో గడిపానని గుర్తు చేసుకున్నారు. తాను ఎప్పుడు కోల్‌కతా వెళ్లినా స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు తీసుకునేవాడినని మోదీ సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆత్మస్థానందజీ ప్రోత్సాహంతోనే మోదీ రాజకీయాల్లోకి వచ్చారు. మహరాజ్ మరణం పట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.