హైదరాబాద్ : టీఆర్ఎస్ పరిపాలనపై టీ కాంగ్రెస్ నేతలు బుధవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసిందనడం టీఆర్ఎస్ నేతల అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లడం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంలో చేసిందేమిటో బహిరంగ చర్చకు మంత్రుల సిద్ధమేనా అని టీఆర్ఎస్కు పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. అలాగే మాజీ మంత్రి శ్రీధర్ బాబు, కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కె మృత్యుంజయం మాట్లాడుతూ... కరీంనగర్ డైయిరీ ప్రైవేట్ కంపెనీగా మారడంతో 50 వేల మంది పాడి రైతులకు పెరిగిన పాలసేకరణ ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దాంతో 10 నెలలుగా జిల్లా పాడి రైతులకు రోజుకు రూ. 8 లక్షల నష్టం వస్తుందన్నారు. విజయ డైయిరీ ద్వారా పాలను సేకరించి కరీంనగర్ పాడి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో కరీంనగర్ డెయిరీ సహకార సంఘంగా ప్రారంభమై ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులను పెంచుకుందని చెప్పారు. రూ.400 కోట్ల విలువైన కరీంనగర్ డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని శ్రీధర్ బాబు, మృత్యుంజయంలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.