కాంగ్రెస్‌ను మోస్తూ.. బీజేపీతో పొత్తా? | TDP leaders queston Alliance with BJP, While supporting the congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను మోస్తూ.. బీజేపీతో పొత్తా?

Published Mon, Aug 12 2013 1:21 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

TDP leaders queston Alliance with BJP, While supporting the congress

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ.. తీరా ఎన్నికల సమయానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల ఎంత మేరకు లాభిస్తుందన్న అంశంపై తెలుగు తమ్ముళ్లలో చర్చలు సాగుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒకవైపు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని వ్యవహారాలు నడిపిస్తూ.. ఇప్పుడు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుని నరేంద్రమోడీ జపం చేయటం వల్ల ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
 
  ఇదే విషయాన్ని నవభారత యువభేరి సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పరోక్షంగా ఎత్తిచూపారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌కు బద్ధవ్యతిరేకిగా పనిచేసిన ఎన్‌టీఆర్ ఆశయంతో పనిచేయాలని ఆ సభలో మోడీ చెప్పటమంటే.. పరోక్షంగా చంద్రబాబు వైఖరిని ఎత్తిచూపటంతో పాటు హెచ్చరించినట్టు టీడీపీ నేతలు అంచనాకు వచ్చారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కేసుల భయం వంటి పలు కారణాలతో చంద్రబాబు నాలుగేళ్ల నుంచి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు సీడబ్ల్యూసీ సమావేశమయ్యే ముందు కూడా చంద్రబాబు ఫోన్‌లో దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్, ఆజాద్ తదితరులతో మాట్లాడిన విషయం కూడా ఇటీవలే హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో ప్రముఖంగా వచ్చింది. ఇంతగా కాంగ్రెస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న చంద్రబాబు ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్‌కు మద్దతునివ్వటానికి సైతం సిద్ధంగా ఉన్నారని ఏఐసీసీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంటుంది. కాంగ్రెస్ ఢిల్లీ నేతలతో అంతగా సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబు వ్యవహారం తమ పార్టీ అగ్రనేతలకు ఎప్పటికప్పుడు సమాచారం ఉందని బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నాయి.
 
 కాంగ్రెస్ పెద్దలతో సంబంధాలు తెంచుకోగలరా: టీడీపీ పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ఎంతమేర లాభం చేకూరుతుందని కమలనాథులు  సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం కాంగ్రెస్‌కు అండగా నిలిచి ఒక్కసారిగా రూట్ మార్చితే ప్రజలు ఎలా నమ్ముతారన్న ప్రశ్న నేతలను వేధిస్తోంది. ఎల్‌బీ స్టేడియంలో నరేంద్రమోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదంతో పనిచేసిన ఎన్‌టీఆర్‌ను ప్రశంసిస్తూ చెప్పిన మాటలు పొత్తుకు లైన్‌క్లియర్ అయినట్టుగా టీడీపీ నేతలు కొందరు అంచనాకు రాగా.. కాంగ్రెస్‌తో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరిని ఆయన పరోక్షంగా ఎత్తిచూపారని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
 
 అయితే మోడీ సంకేతాల మేరకు బీజేపీతో పొత్తుకు సిద్ధం కావటం అంత సులభం కాదని, ముందు చంద్రబాబు ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో ఉన్న సంబంధాన్ని తెంచుకోవాలని, అంతర్గతంగా తెగతెంపులు సాధ్యం కాకపోయినా.. తెంచుకున్నట్టు ప్రజల్లో నమ్మకం కలిగించాల్సి ఉందని తెలంగాణ టీడీపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. నిన్నటివరకూ కాంగ్రెస్‌కు అండగా నిలిచాం కదా?:‘దివంగత వైఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2004 నుంచి ఆయన మరణించే వరకూ అంటే 2009 సెప్టెంబర్ 2 వరకూ కాంగ్రెస్‌తో టీడీపీ బద్ధవైరం కొనసాగించింది.
 
 ఆయన మరణించిన కొద్ది నెలల నుంచే చంద్రబాబు కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు నెరపటం ప్రారంభించారు. ఐఎంజీ, ఎమ్మార్ కుంభకోణాలకు సంబంధించిన కేసుల్లో ఆరోపణలున్న చంద్రబాబు.. ఆ కేసుల నుంచి బయటపడేందుకే ఇంత కాలం కాంగ్రెస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఎప్పటి నుంచో విమర్శలున్నాయి. పైగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాసం పెట్టినా.. టీడీపీ తటస్థ వైఖరి పేరుతో ఆ ప్రభుత్వం పడిపోకుండా చంద్రబాబు కాపాడారు. యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎఫ్‌డీఐ బిల్లు వీగిపోకుండా టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలను సభకు గైర్హాజరయ్యేలా చంద్రబాబు ఆదేశించి మరీ కాంగ్రెస్‌కు సహకరించారు. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి నిన్నమొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు నమ్మబోరన్న భయం మాలో ఉంది’ అని టీడీపీ నేతలు చెప్తున్నారు.
 
 బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని ప్రకటించాం కదా?:‘1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని లబ్ధిపొందాం.. అదే పార్టీతో 2004లో పొత్తు పెట్టుకుని ఓడిపోయాం. ఆ తరువాత బీజేపీపై మతతత్వ ముద్ర వేశాం.. భవిష్యత్‌లో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టంగా ప్రకటించాం, ఇపుడు మళ్లీ ఏ కారణం చెప్పి పొత్తు పెట్టుకుంటాం?’ అని రాయలసీమకు చెందిన టీడీపీ నేత ఒకరు ప్రశ్నించారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా ఎన్‌టీఆర్ కుమారుడు బాలకృష్ణను మోడీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు.
 
 మతతత్వ ముద్రపడిన మోడీ ప్రమాణ స్వీకారానికి బాలకృష్ణ హాజరైతే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భయంతో చంద్రబాబు చివరకు అడ్డుకున్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఈ విషయాలన్నీ రేపటి రోజున మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉన్నందునే బీజేపీతో పొత్తు అంశంపై నేరుగా మాట్లాడకుండా ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఆయన నేరుగా రంగంలోకి దిగకుండా వియ్యంకుడు బాలకృష్ణను మోడీ వద్దకు పంపినట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు నరేంద్ర మోడీని కలిశానని బాలకృష్ణ చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement