
చీమా..చీమా .. ఎందుకు కుట్టావు?
(సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం)
సరిగ్గా సంవత్సరం క్రితం ఢిల్లీ విమానాశ్రయంలో ఒక దృశ్యం ఆవిష్కృతమైంది. బియాస్ నదిలో విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థులు కొందరు కొట్టుకుపోయి దుర్మరణం పాలవ్వగా, బతికి బయటపడ్డ విద్యార్థులకు అండగా నిలిచింది తామంటే తామని... మేము ఏర్పాటు చేసిన విమానంలో హైదరాబాద్ తరలిస్తామంటే ... కాదు మేమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు టీవీ కెమెరాల సాక్షిగా తోసుకున్నారు, వాదులాడుకున్నారు. అప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి ఒకటి రెండు రోజులు కాలేదు. తీవ్రమైన షాక్లో ఉన్న విద్యార్థులు బిక్కమొహం వేయగా, రాష్ట్ర ప్రజానీకం ఆశ్చర్యపోయింది.
సంవత్సరం తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాధం పూడ్చలేనంతగా పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయికి దిగజారిపోయాయి. గత సంవత్సరం రోజుల్లొ ఏ ఒక్క రోజు కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం కనిపించలేదు. కేసీఆర్, చంద్రబాబు పరస్పరం పలకరించుకోవడమే బ్యానర్ స్టోరీగా మారేంతగా సంబంధాలు దిగజారిపోయాయి.
ఆస్తులు, అప్పులు విభజన దగ్గర మొదలైన విభేదాలు దాదాపు అన్ని విభాగాలకు పాకాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపకాలు, ఉన్నత విద్యామండలి విభజన, ఎమ్సెట్ లాంటి ప్రవేశ పరీక్షలు, నీటి వినియోగం, విద్యుత్తు కేటాయింపులు, పెట్టుబడుల ఆకర్షణ ఇలా ప్రతీ రంగంలో, ప్రతీ అంశంలో మాటల తూటాలు పేలాయి. గవర్నర్ దగర్గ పంచాయితీ సర్వసాధారణమైపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేంద్రం హోంశాఖ దగ్గర కూడా పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి.
అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు నోట్ల కట్టలకు ఓటు వ్యవహారంతో పూర్తిగా దిగజారిపోయాయి. రేవంత్ రెడ్డి వ్యవహారం చంద్రబాబుకు ప్రాణ సంకటంగా పరిణమించింది. తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కదులుతోంది. చంద్రబాబు ఆడియో టేపుల వ్యవహారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. చంద్రబాబు మౌనాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తుంటే.. 'కుట్ర' అనే గొంతుకలు వినబడుతున్నాయి. మా ముఖ్యమంత్రికి నోటీసులిచ్చే దమ్ము ధైర్యం ఉందా అని రెచ్చగొడుతున్న వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా ఉన్నాయి. మీరు టేపులు విడుదల చేస్తే, మేము కేసులు పెడతామని ఆంధ్రప్రదేశ్లో చాలా పోలీస్ స్టేషన్లలో కేసీఆర్పై కుట్ర కేసులు నమోదు చేస్తున్నారు.
ఈవారం, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పడుతున్నారు. చంద్రబాబు రేపు విమానం ఎక్కుతుంటే.. ఆ తర్వాత రెండు రోజులకు కేసీఆర్ కూడా ఢిల్లీ గడప తొక్కుతున్నారు. 'నిప్పులాంటి వాడిని...' 'ఎవరికీ భయపడను..' 'బుల్లెట్లా దూసుకుపోతాను' 'నీతికీ, నిజాయితీకి ఆంధ్ర అన్నా హజారేను' అని డాంబికాలు పోయే చంద్రబాబు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. పోగా ప్రజలను తన మందీ మార్బలంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పూర్తిగా వ్యక్తిగత నైతికతకు సంబంధించిన అంశాలను ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ సామాన్య ప్రజానీకం సమస్యగా మరల్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో ఇరు రాష్ట్రాల ప్రజల ప్రమేయం ఏమిటో అర్థం కాదు చంద్రబాబు రాజకీయ ప్రయోజనం తప్ప. ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రజలు తిరగబడుతున్న సూచనలు కనపడుతూనే ఉన్నాయి. అసలు నిజం ఏమిటి? రేవంత్ వీడియోలు అబద్ధమా? నోట్ల కట్టలు అంతా ఉత్తివేనా? హలో బ్రదర్ అని వినబడిన గొంతు ఎవరిది? ఇందులోకి రెండు రాష్ట్రాల ప్రజలను ఎందుకు లాగుతున్నారు? లాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో కోకొల్లలు. ఆ ప్రశ్నల వాడి వేడీ కూడా పెరుగుతోంది.
అసలు కేసీఆర్ ఎందుకు కుట్టాడు. ''చీమా చీమా ఎందుకు కుట్టావు? .. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?'' ఇపుడు జరుగుతోంది కూడా అదే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి గాలం వేస్తే చేప దొరకలేదు కానీ.. కొక్కెం ఊడిపోయే పరిస్థితి వచ్చింది. నా కొక్కెం ఊడిపోయింది అందుకు చేపల యజమాని కుట్రపన్నాడు.. ఇది నా ప్రజలను అవమానించడమే అంటూ గగ్గోలు. అసలు గాలం ఎందుకు వేయాలనుకున్నావు. పుట్టలో వేలు ఎందుకు పెట్టాలనుకుంటున్నావు. మమ్మల్ని ఈ బురదలోకి ఎందుకు లాగుతున్నావనే ప్రశ్నలకు జవాబులు రావు. ప్రజలనే కాదు.. ఇతర పార్టీలకు కూడా మసిపూసి ఇదుగో కుమ్మక్కు అని చూపించాలనే తాపత్రయం.
అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ వ్యవహారంతో సంబంధం ఏమిటి? స్టీవెన్ సన్తో మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో నాకు సబంధం లేదు. ఏ విచారణకైనా సిద్ధం అని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు. నిన్నటివరకు సీబీఐ విచారణ కావాలి అని ఎలుగెత్తిన గొంతులు .. ఆడియో టేపులు బయటకురాగానే ఆ మాటే ఎత్తడం లేదు... ఎందుకనో?