సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కేంద్రమంత్రి పల్లంరాజుపై టీ-ఎంపీలు, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిపై పల్లంరాజు, జేడీ శీలం, రేణుకా చౌదరిలపై గోవర్ధన్‌రెడ్డి సోనియాకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బుధవారం లోక్‌సభ మొదటిసారి వాయిదా పడిన తర్వాత సభలో సోనియా గాంధీతో కేంద్రమంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి మాట్లాడుతున్న సమయంలో తెలంగాణ ప్రాంత ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్‌లు అక్కడకు చేరుకున్నారు. ఆంటోనీ కమిటీ పని పూర్తయ్యేంతవరకూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోతుందని పల్లంరాజు వెల్లడించినట్లు ప్రచురించిన ఒక ఆంగ్ల దినపత్రిక కథనాన్ని అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లారు.
విభజనతో సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలను పరిశీలించి పరిష్కారాలు కనుగొనేందుకు పార్టీ ఏర్పాటు చేస్తున్న కమిటీ నివేదిక వచ్చాకే ప్రభుత్వంలో అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుందని మాత్రమే తాను విలేకరులకు చెప్పినట్లు సోనియాకు పల్లంరాజు వివరించినట్లు తెలిసింది. మంగళవారం రాజ్యసభలో కేంద్ర మంత్రులతో సహా సీమాంధ్రవాసులంతా తెలంగాణ నుండి వెళ్లిపోవాల్సిందేనని సీనియర్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన బెదిరింపు వ్యాఖ్యలు కూడా సోనియా వద్ద ప్రస్తావనకు వచ్చినట్లు కూడా తెలిసింది. పాల్వాయి అలా మాట్లాడడం తప్పేనని అభిప్రాయపడిన కాంగ్రెస్ అధ్యక్షురాలు తాను ఆయనతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రక్రియ ఆపొద్దు.. వేగం పెంచండి: టీ-ఎంపీలు
సీమాంధ్ర ప్రజల అభ్యర్థనల పరిశీలన పూర్తయ్యేవరకు రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేస్తామని కాంగ్రెస్ అధిష్టానం నుంచి తమకు స్పష్టమైన హామీ లభించిందని సీమాంధ్ర నేతలు ప్రచారం చేస్తున్న దృష్ట్యా బుధవారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత ఎంపీలంతా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదీతో 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని కోరారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీలకు మద్దతుగా వ్యవహరించిన జేడీ శీలం, రేణుకాచౌదరిలపై అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేసినట్లు ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు.
అధిష్టానానికి.. ఫిర్యాదుల పర్వం
Published Thu, Aug 8 2013 3:57 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
Advertisement
Advertisement