త్వరలోనే తెలంగాణ బిల్లు: షిండే
తెలంగాణ బిల్లు త్వరలోనే వస్తుంది అని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. దేశ శాంతి భద్రతల సమీక్షపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాలపరిమితి ముగియకముందే తెలంగాణ బిల్లును ప్రవేశపెడుతాం అని అన్నారు. హైదరాబాద్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) పరిశీలనలో ఉంది అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పరిధి ఎంత ఉండాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అన్నారు. జీవోఎం నివేదిక కేబినెట్ కు వెళ్తుంది.. ఆతర్వాత రాష్ట్రపతికి.. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి బిల్లును పంపుతామని విభజన ప్రక్రియను మరోసారి షిండే తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తమకు పోటీ కాదని అన్నారు. కాంగ్రెస్ కు మోడీ సవాల్ కాదు అని.. ఇలాంటి సవాళ్లను కాంగ్రెస్ చాలా ఎదుర్కొందని ఆయన ఓ ప్రశ్నకు జవాబిచ్చారు.