టీ కాంగ్రె స్ నేతల నిర్ణయం...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆదివారం ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే వారు ఢిల్లీకి వెళుతున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే మకాంవేసి కేంద్రం, హైకమాండ్‌లోని పెద్దలందరినీ కలవాలని నిర్ణయించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు సహా దాదాపు 90 మంది వరకు హస్తినకు వెళుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు శనివారం తెలిపాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే అపాయింట్‌మెంట్ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నాయి. కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌షిండే, ఆంటోనీ, వీరప్పమొయిలీ, గులాంనబీ ఆజాద్, ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ వోరా, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌సింగ్‌తోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరినీ కలిసేందుకు నిర్ణయించారు.
ఇటీ వలి కాలంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశాలకు దూరంగా ఉంటున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీకి వెళతారా? లేదా? అనేది పార్టీ నేతల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్ పెద్దలను కోరనున్నారు. అలాగే, హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల భయాందోళనలను పారదోలేందుకు తగిన భరోసా కూడా కేంద్రం తరఫున ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు తొందరగా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా ఒత్తిడి చేయడానికే ఢిల్లీ వెళుతున్నట్లు చెప్పారు.
మూడు రోజులు హస్తినలో మకాం.. టీ కాంగ్రెస్ నేతల నిర్ణయం
Published Sun, Sep 22 2013 3:52 AM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM
Advertisement
Advertisement