చేయి పట్టుకుని నడిపించేదెవరు?
* టీ-కాంగ్రెస్‌లో ఎక్కడివారక్కడే గప్‌చుప్
* గట్టి పోటీదారులతో సీఎం ఆశావహులు
* అందరిలోనూ గుబులే
* గడప దాటని ముఖ్య నేతలు
* సొంత నియోజకవర్గాలకే పరిమితం
* ఇంటిని చక్కబెట్టుకోవడంపైనే టీపీసీసీ నాయకుల దృష్టి
సాక్షి, హైదరాబాద్: టీ-కాంగ్రెస్‌లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది తామేనని చెబుతున్న అధికార పార్టీకి ఇప్పుడు ప్రచార సారథులే కరువయ్యారు. తెలంగాణకు ఎన్నికలు సమీపిస్తున్నా ఆ పార్టీ నాయకుల్లో ఏ హడావుడీ కనిపించడం లేదు. ఇతర పార్టీలు ప్రచారంలో దూసుకెళుతుంటే.. టీపీసీసీ ముఖ్యనేతలు మాత్రం గడపదాటడం లేదు. గిరిగీసుకున్నట్లు ఎవరికి వారే తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలకే పరిమితమైపోతున్నారు. పార్లమెంట్‌లో విభజన బిల్లు ఆమోదం పొందిన వెంటనే.. కనీవినీ ఎరుగని రీతిలో సోనియాగాంధీకి ‘కృతజ్ఞత సభలు’ నిర్వహిస్తామని చెప్పిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఇప్పటికి 50 రోజులైనా ఇంతవరకు ఒక్కటంటే ఒక్క సభ కూడా నిర్వహించలేకపోవడం గమనార్హం.
అంతెందుకు.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడి నెల రోజులు దాటినప్పటికీ ఆ పార్టీ ప్రచారం నామమాత్రమే! కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తామే ముఖ్యమంత్రి అవుతామని కలలుకంటున్న నాయకులు, తెలంగాణలో పార్టీకి సారథ్యం వహిస్తున్న నేతలు, పార్టీ సీనియర్లమని చెప్పుకొనే వారంతా తమ సొంత గూటిని దిద్దుకోవడంపైనే దృష్టి సారించాల్సి వస్తోంది. తెలంగాణకు స్టార్ క్యాంపెయినర్ లేకపోవడం, టీ-కాంగ్రెస్ నేతలతో లాభం లేదనుకున్న అధిష్టానం కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజులను రంగంలోకి దించింది.
ఇప్పుడు వారే రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటనలు చేపట్టారు. అయినప్పటికీ ఆశించినస్థాయిలో ఫలితం లేకపోవడంతో.. అభ్యర్థులంతా ఇక తమ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాకపైనే ఆశలు పెట్టుకున్నారు. వారు తెలంగాణలో పర్యటిస్తేనే ప్రచారం ఊపందుకుంటుందని, గెలుపు అవకాశాలు మెరుగవుతాయన్న ఆశాభావంతో ఉన్నారు.
ఆందోళనలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్
తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ పక్షం రోజులుగా సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి దామోదర్ చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన బాబూమోహన్ ఈసారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. దామోదర్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. 1998(ఉపఎన్నిక), 1999లో బాబూమోహన్ చేతిలో రెండుసార్లు పరాజయం పాలైన దామోదర.. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఆయన్ను ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు.
ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని, తద్వారా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే దామోదర్‌కు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అందుకే టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను పక్కనబెట్టి సొంత నియోజకవర్గంలోనే ఆయన మకాం వేశారు.
సొంతింటిని చక్కదిద్దుకునే పనిలో టీపీసీసీ చీఫ్
అభ్యర్థుల ఎంపిక విషయంలో నిన్నటి వరకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టొచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రస్తుతం సొంత స్థానం జనగాంలో పార్టీ రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో పడ్డారు. ఒకవైపు వారిచేత నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు నానా తంటాలు పడుతూనే.. నియోజకవర్గంలో పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు శ్రమిస్తున్నారు.
గత ఎన్నికల్లో పొన్నాల తన సమీప ప్రత్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై 236 ఓట్ల తేడాతోనే గెలిచారు. గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితి కొంత మెరుగైనా.. సులభంగా బయుటపడతావునే నమ్మకం మాత్రం ఆయన మద్దతుదారుల్లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పొన్నాల తన స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తెలంగాణ అంతటా తిరిగి ప్రచారం చేయాల్సి ఉన్నప్పటికీ.. పరిస్థితు లు అనుకూలించకపోవడంతో హైదరాబాద్, జనగాంకే పరిమితమయ్యారు.
మేమిద్దరం గెలిస్తే చాలు
ఇక టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలేవీ పట్టించుకోవడం లేదు. హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్, కోదాడ నుంచి ఆయన సతీమణి పద్మావతి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ రెండు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో అక్కడే పాగా వేసి గెలుపువ్యూహాన్ని రూపొందిస్తున్నారు. కుటుంబానికి ఒక్కటే టికెట్ అని హైకమాండ్ చెప్పినా తన సతీమణికి అవకాశమిస్తే కచ్చితంగా గెలిపించుకుంటానని చెప్పి ఢిల్లీ పెద్దలను ఒప్పించారు. దీంతో ఆయన ప్రస్తుతం మిగతా విషయాలేవీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఆ రెండు నియోజకవర్గాల్లో గెలిస్తే అదే పదివేలు అనే భావనతోనే వ్యవహరిస్తున్నారు.
నిజామాబాద్ నుంచి కదిలితే ఒట్టు
రెండుసార్లు పీసీసీ చీఫ్‌గా పనిచేసిన డి. శ్రీనివాస్ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారైంది. 2009లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చినా ఆయన మాత్రం 11 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత సీఎం అయ్యే అర్హత ఉన్నప్పటికీ.. ప్రజాక్షేత్రంలో గెలవకపోయేసరికి ఆ సీటు అందని ద్రాక్షే అయ్యింది. అలాగే 2010 ఉప ఎన్నికల్లో ఆయనకు మరో అవకాశం వచ్చింది. తనను గెలిపిస్తే సీఎం అవుతానని, బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణ తెస్తానని చెప్పినా జనం పట్టించుకోలేదు.
తెలంగాణ సెంటిమెంట్ దెబ్బకు డీఎస్ 12 వేల పైచిలుకు ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఇక లాభం లేదనుకున్న డీఎస్ ఈసారి నియోజకవర్గం మారారు. గతంలో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసిన డీఎస్.. ఈసారి నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న డీఎస్.. తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అక్కడి నుంచి కదలకుండా విస్తృత ప్రచారం నిర్వహిస్తూ.. అందరినీ తనవైపునకు తిప్పుకొనే పనిలో పడ్డారు.
నిర్వేదంలో టీ-కాంగ్ పెద్ద
తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి జానారెడ్డి కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల పట్ల అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అంతకుముందు వరకు టీ కాంగ్రెస్ నేతలను సమన్వయపరుస్తూ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో హైకమాండ్ వ్యవహరించిన తీరుతో జానారెడ్డి తీవ్రంగా కలత చెందారు.
దీనికితోడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సీపీఎం నుంచి టీఆర్‌ఎస్‌కు మారిన సీనియర్ నేత నోముల నర్సింహయ్య బరిలోకి దిగారు. దీంతో జానాకంటిమీద కునుకులేకుండా పోయింది. నోముల స్థానికేతరుడైనప్పటికీ రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో ఉద్దండుడు. గత ఎన్నికల్లో జానారెడ్డికి టీడీపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి చుక్కలు చూపించడంతో సాధారణ మెజారిటీతో ఆయన బయటపడ్డారు. ఈసారి ప్రత్యర్థి నోముల కావడంతో జానారెడ్డి మరింత అప్రమత్తమయ్యారు. సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు.
వీళ్లను పిలిచే వాళ్లే లేరు
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలను ఎన్నికల ప్రచారానికి పిలిచే వారే కరువయ్యారు. ఒకవేళ వారు ప్రచారానికి వచ్చినా పెద్దగా ఫలితం ఉండదని పార్టీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. జనాన్ని అకట్టుకునే వారు ఎవరూ లేరని, వారు ప్రచారానికి వచ్చినా జనం వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు తమ సొంత ఖర్చుతో అష్టకష్టాలు పడి జనాన్ని తరలించి.. సభ నిర్వహించడమంటే సమయం, డబ్బు వృథా అని పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నందున సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపట్ల తెలంగాణ ప్రజలకు సానుభూతి ఉందని, వారు తెలంగాణలో పర్యటిస్తేనే తమకు కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.