న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రం మూడో విడత వేలానికి సంబంధించి కీలక నగరాల్లో రిజర్వ్ ధరను 60 శాతం దాకా తగ్గించాలంటూ చేసిన సిఫార్సులకు తాము కట్టుబడి ఉన్నామని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసింది. 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం వేలం సిఫార్సులపై స్పష్టత కోరిన టెలికం విభాగానికి (డాట్) ఈ మేరకు తన వివరణనిచ్చింది. సీడీఎంఏ సేవలకు ఉపయోగపడే 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌ని వేలం వేయరాదని, దీనిపై త్వరపడి నిర్ణయం తీసుకోరాదని చేసిన సిఫార్సులకు కూడా కట్టుబడి ఉన్నట్లు ట్రాయ్ తెలిపింది. ఈ స్పెక్ట్రం అసలు సామర్థ్యం, వినియోగించుకుంటున్న సామర్థ్యానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంది. స్పెక్ట్రం రిజర్వ్ ధరలను భారీగా తగ్గించాలన్న సిఫార్సులను పునఃసమీక్షించాలని ట్రాయ్‌ని డాట్ కోరడం తెలిసిందే. దీనిపై ట్రాయ్ తాజా వివరణలను అధ్యయనం చేశాక డాట్ కమి టీ తన నివేదికను కొన్ని రోజుల్లో టెలికం కమిషన్(టీసీ) ముందు ఉంచనుంది. టీసీ అభిప్రాయాన్ని బట్టి సాధికారిక మంత్రుల బృందం తుది నిర్ణయం తీసుకుంటుంది.