ఇదే మా హెచ్చరిక.. కుట్ర చేస్తే సహించం: పాక్
గూఢచర్యం ఆరోపణలపై భారత జాతీయుడు కులభూషణ్ జాధవ్‌కు ఉరిశిక్ష విధించడాన్ని పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్థించుకున్నారు. తమ దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారికి ఈ ఉరిశిక్ష హెచ్చరిక లాంటిందని ఆయన పేర్కొన్నారు. దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారిని వదిలిపెట్టబోమని, వారికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైన శక్తులన్నింటినీ వాడుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. ‘పాకిస్థాన్ సైనికులు, ప్రజలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఉగ్రవాదులు, వారికి సాయం చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలని ఈ త్యాగాలు కోరుతున్నాయి’ అని అన్నారు. జాధవ్ బహిరంగంగా తన నేరాన్ని ఒప్పుకొన్నాడని, ఈ విషయాన్ని భారత్ లేవనెత్తితే.. పాకిస్థాన్ తగిన సమాధానం ఇస్తుందని ఆయన చెప్పారు.
కల్లోలిత బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో గూఢచర్యానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్‌భూషణ్ జాధవ్ (46)కు సోమవారం పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జాధవ్ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామని ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ పేర్కొంది. అయితే పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాధవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.