
చిన్న రాష్ట్రంలో చిక్కనైన పోటీ
ఉత్తరాఖండ్ నాలుగో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ లేనంత వాడి, వేడి ఈసారి కనిపిస్తున్నాయి.
- రెండు చోట్ల ‘నిలిచిన’ సీఎం రావత్
- ఉత్తరాఖండ్ పోరులో ఉత్కంఠ
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
ఉత్తరాఖండ్ నాలుగో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ లేనంత వాడి, వేడి ఈసారి కనిపిస్తున్నాయి. ప్రతి ఐదేళ్లకు ఎన్నికల్లో పాలకపక్షాన్ని మార్చే ఆనవాయితీ ఉన్న ఈ హిమాలయ రాష్ట్రంలోని 70 సీట్లకు మంగళవారం పోలింగ్ జరుగుతుంది. దాదాపు 76 లక్షల ఓటర్లు ముఖ్యమంత్రి హరీశ్ రావత్(కాంగ్రెస్)మరో అవకాశం ఇవ్వకపోతే ప్రతిపక్షం బీజేపీకి అధికారం దక్కుతుంది.
2014 ఎన్నికల్లో మొత్తం నాలుగు లోక్‌సభ సీట్లనూ బీజేపీ కైవసం చేసుకోవడంతోపాటు, అయిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. సైన్యంలో, బీఎస్‌ఎఫ్ వంటి పారా మిలిటరీ దళాల్లో ఉత్తరాఖండీల వాటా వారి జనాభా నిష్పత్తి కంటే చాలా ఎక్కువ. రాష్ట్రానికి చెందిన జవాన్లు, మాజీ జవాన్లు కలపితే రెండున్నర లక్షల మంది ఉన్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా ఉత్తరాఖండీయే. ఈ వర్గం మొగ్గు బీజేపీ వైపే ఉందని తెలుస్తోంది. బీజేపీ సీఎం పదవికి అభ్యర్థిని ప్రకటించలేదు.
రెండు జిల్లాల నుంచి సీఎం పోటీ
కాంగ్రెస్ సీఎం రావత్ రెండు స్థానాల నుంచి పోటీచేస్తున్నారు. 16 ఏళ్ల ఉత్తరాఖండ్ చరిత్రలో రెండు అసెంబ్లీ సీట్లకు ఒకరు పోటీచేయడం ఇదే మొదటిసారి. ఆయన పోటీచేస్తున్న కిచ్చా బెంగ్ నియోజకవర్గం పర్వత పాద ప్రాంతమైన ఉధమ్‌సింగ్‌నగర్ జిల్లాలో ఉంది. మైదాన ప్రాంత జిల్లా హరిద్వార్‌లోని హరిద్వార్ (రూరల్) నుంచి కూడా పోటీచేస్తున్నారు. కొండ ప్రాంత జిల్లాలతో పోల్చితే బాగా అభివృద్ధి చెందిన ఈ రెండు జిల్లాల్లో 20 స్థానాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ విజయావకాశాలపై ధీమా లేకనే ముఖ్యమంత్రి రెండు చోట్ల నుంచి నిలబడ్డారు. ఈ రెండు జిల్లాల సీట్లు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఈ రెండు జాతీయ పార్టీల మధ్యే హోరాహోరీ పోరుసాగుతోంది. ఈ రెండు జిల్లాల్లో బీఎస్పీ చెప్పుకోదగ్గ బలం ఉన్నబీఎస్పీ త్రిముఖ పోటీలకు కారణమైంది . ఫిరాయింపులు బాగా జరగడంతో రెండు కాంగ్రెస్, బీజేపీలు రెండూ బలమైన తిరుగుబాటు అభ్యర్థులను దాదాపు 18 స్థానాల్లో ఎదుర్కొంటున్నాయి. రెండు పక్షాలూ ఎన్నికల సమయంలో తలుపుతట్టిన ఫిరాయింపుదారులకు టికెట్లిచ్చి తిరుగబాట్లకు అవకాశమిచ్చాయి.
11 మంది కాంగ్రెస్ మాజీలకు బీజేపీ టికెట్లు
కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికైన మాజీ కాంగ్రెస్ సీఎం విజయ్ బహుగుణ సహా 12 మంది బీజేపీలో చేరడంతో వారిలో బహుగుణ మినహా అందరికీ బీజేపీ టికెట్లిచ్చింది. బహుగుణకు బదులు ఆయన కొడుకు సౌరభ్ తండ్రి సీటు సితార్‌గంజ్ నుంచి కమలం గుర్తుపై పోటీచేస్తున్నారు. ముగ్గురు మాజీ బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరఫున పోటీచేస్తుండగా మరో ముగ్గురు ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. అన్ని సీట్లకు రెండు పక్షాలు పోటీచేస్తున్నాయి. అయితే, ధనౌల్తీ స్థానంలో హస్తం గుర్తుపై తన అభ్యర్థి మన్మోహన్ మాల్‌ను నిలిపినప్పటకికీ, అక్కడి ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రీతంసింగ్ పన్వర్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.