ఖైదీ నం 150.. చిరంజీవికి 150వ సినిమా. రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలకు దూరమైన చిరంజీవి మళ్లీ ముఖానికి రంగు వేసుకొని తెరపై తన స్టామినా చూపేందుకు సిద్ధమవుతున్న సినిమా. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరు మళ్లీ తెరపై దర్శనమివ్వబోతుండటంతో అభిమానులు ఫుల్ పండుగ చేసుకుంటున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో వారి సందడి మరింత పెరిగిపోయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికల్లో 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ కామెంట్లతో చిరు అభిమానులు హోరెత్తిస్తున్నారు. ట్రైలర్‌ను సూపర్బ్‌గా ఉందని అంటున్నారు.
తమిళంలో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 'కత్తి' సినిమాకు రీమేక్‌గా 'ఖైదీనంబర్ 150' వస్తున్న సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి అభిమానులు ఊహించినట్టుగానే దుమ్మురేపాడు. సినిమాలకు దూరమై చాలారోజులైనా ఆ నటనలో ఆ 'ఈజ్' అలాగే ఉండటం మెగా ఫ్యాన్స్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చిరు స్టెప్పులు ట్రైలర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. డ్యాన్స్‌లో తన దూకుడు ఏమాత్రం తగ్గలేదని చిరు నిరూపించుకున్నారు. ముఖ్యంగా ట్రైలర్ ముగింపులో 'పొగరు నా ఒంట్లో ఉంటది. హీరోయిజం నా ఇంట్లో ఉంటది.. వెయింటింగ్' అంటూ చిరు చెప్పిన డైలాగ్ అభిమానులకు రొమాలు నిక్కబొడిచేలా చేస్తోంది.
ఇక చిరు 'ఖైదీనంబర్ 150'కి పోటీగా వస్తున్న బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి చెప్పాల్సిన పనిలేదు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసింది. బాలకృష్ణ 'శాతకర్ణి' చారిత్రాత్మక కథ.. 'బాహుబలి'రీతిలో భారీ హంగులతో నిర్మితమైన సినిమా. చిరు 'ఖైదీనంబర్ 150' సామాజిక సందేహంతో కూడిన సాంఘిక సినిమా. రెండు సినిమాలు ఎక్కడా రాజీపడకుండా దీటుగా నిర్మితమై.. సంక్రాంతి పండుగకి పందెకోళ్లలాగా బరిలోకి దూకేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సహజంగానే రెండు సినిమాల ట్రైలర్లను పోల్చిచూసి.. వ్యాఖ్యానాలు చేస్తున్నారు నెటిజన్లు. ఇటు బాలయ్య 'శాతకర్ణి', అటు చిరు 'ఖైదీ..' వెటికవే భిన్నంగా ఉండి.. ప్రత్యేకతలు చాటుకుంటుండటంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి రంజైన పోటీ తప్పదని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎవరి అభిమానులు వారి హీరోల సినిమాలకు 'వీరతాళ్లు' వేస్తుండగా.. నెటిజన్లు మాత్రం ఈ ఇద్దరి సినిమాల ట్రైలర్లు ఆకట్టుకుంటున్నాయని, అంచనాలు పెంచేశాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి మరోసారి బాలయ్య వర్సెస్ చిరు పోరు హోరాహోరీగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఎవరి అభిమానుల మాట ఎలా ఉన్నా ఇంతకు మీకు ఏ ట్రైలర్ నచ్చిందో.. ఒక మాట చెప్పండి?