ఆహార భద్రత బిల్లుపై సోమవారం సుష్మా స్వరాజ్ ప్రవేశపెట్టిన సవరణపై జరిగిన ఓటింగులో గందరగోళానికి గురైన అధికారపక్షం తప్పులో కాలేసింది.
న్యూఢిల్లీ: ఆహార భద్రత బిల్లుపై సోమవారం సుష్మా స్వరాజ్ ప్రవేశపెట్టిన సవరణపై జరిగిన ఓటింగులో గందరగోళానికి గురైన అధికారపక్షం తప్పులో కాలేసింది. బిల్లులోని ఎనిమిదో అధ్యాయంలో ఒకవేళ పూర్తి కోటా తిండిగింజలను ప్రభుత్వం సరఫరా చేయలేకపోతే, తిండిగింజలకు సమానమైన నగదును లబ్ధిదారులకు చెల్లించాలనే నిబంధన ఉంది. తిండి గింజలకు బదులు నగదు చెల్లిస్తే, కుటుంబాల్లోని పురుషులు ఆ డబ్బును నేరుగా మద్యం దుకాణాల పాలు చేస్తారని, ఫలితంగా ఇళ్లలోని మహిళలు, పిల్లలు ఆకలితో అలమటిస్తారని సుష్మా స్వరాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిల్లులోని ఎనిమిదో అధ్యాయంపై స్పీకర్ మీరా కుమార్ ఓటింగు నిర్వహించారు. అయితే, అధికార పక్ష సభ్యులు సుష్మా ప్రతిపాదించిన సవరణపై ఓటింగు నిర్వహిస్తున్నారని భావించి, వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఫలితంగా ఎనిమిదో అధ్యాయానికి వ్యతిరేకంగా 261 ఓట్లు, అనుకూలంగా 101 ఓట్లు పడ్డాయి. దీంతో అధికారపక్షం సభ్యులు నాలుక కరుచుకున్నారు. జరిగిన గందరగోళాన్ని ఆర్థిక మంత్రి చిదంబరం స్పీకర్‌కు వివరించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఈ అంశంపై సెక్రటరీ జనరల్ టీకే విశ్వనాథన్‌తో చర్చలు జరిపారు. స్లిప్పులు ఉపయోగించి మరోసారి ఓట్లు వేయాల్సిందిగా చిదంబరం అధికార పక్షం సభ్యులను కోరారు. మరోసారి ఓటింగు కోసం సుష్మా స్వరాజ్, అద్వానీలకు కమల్‌నాథ్ విజ్ఞప్తి చేయడంతో వారు అంగీకరించారు. మళ్లీ నిర్వహించిన ఓటింగుతో బిల్లులోని ఎనిమిదో అధ్యాయం ఆమోదం పొందింది.