ఛిద్రమైన దేహాలు | Two Maoists killed in Warangal encounter | Sakshi
Sakshi News home page

ఛిద్రమైన దేహాలు

Published Thu, Sep 17 2015 4:02 AM | Last Updated on Tue, Oct 9 2018 2:40 PM

ఛిద్రమైన దేహాలు - Sakshi

ఛిద్రమైన దేహాలు

శ్రుతి దేహంలో 6..విద్యాసాగర్ శరీరంలో 8 బుల్లెట్లు
* శ్రుతి దేహంపై తీవ్రంగా  కాలిన గాయాలు
* పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
* విద్యాసాగర్ మర్మాయవాలపై గాయాలు ఉన్నాయన్న కుటుంబసభ్యులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టులు శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల మృతదేహాలకు బుధవారం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. శ్రుతి దేహంలోకి ఆరు బుల్లెట్లు దిగాయి.

వాటిలో ఛాతీలో రెండు, ఎడమ కాలుకు రెండు, చేతికి రెండు తూటాలు తగిలినట్లుగా గాయాలున్నాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఆరు తూటాలు శరీరాన్ని చీల్చుకుంటూ బయటకు వెళ్లాయని, మృతదేహంలో తూటాలు లభ్యం కాలేదని చెప్పారు. ఇక విద్యాసాగర్‌రెడ్డి మృతదేహంపై ఎనిమిది తూటా గాయాలున్నట్లు పౌరసంఘాల నేతలు, కుటుంబ సభ్యులు వెల్లడించారు. పోస్టుమార్టం సందర్భంగా విద్యాసాగర్ దేహం నుంచి నాలుగు తూటాలు బయటకు తీసినట్లు తెలుస్తోంది.

మిగతా నాలుగు తూటాలు శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లాయి. ‘‘చనిపోయినవారు నిజంగా అడవుల్లోనే ఎదురుపడితే వారి కాళ్లకు కచ్చితంగా బూట్లు ఉండాలి. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల కాళ్లకు బూట్లు లేవు. మహిళా నక్సలైట్లు తప్పనిసరిగా నెక్ టీషర్టులు వేసుకుంటారు. శ్రుతి శరీరంపై నెక్ టీషర్టు లేదు. శ్రుతి దేహంపై కాలిన గాయాలు ఉన్నాయి. యాసిడ్ పోయడం వల్లే ఇలా ఉన్నాయి..’’ అని పోస్టుమార్టం వద్దకు వచ్చిన ప్రజా సంఘాల నేతలు, ఇతరులు ఆరోపించారు.
 
కోర్టు ఆర్డర్ తెచ్చేలోపే..
పోలీసులు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించారని, కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఆగలేదని విరసం నేతలు, మృతుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు, జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డి మృతదేహాలకు వీడియో రికార్డింగ్‌తో పోస్టుమార్టం నిర్వహించాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులతోపాటు విరసం నేతల సమక్షంలో పోస్టుమార్టం చేయాలని కోరారు.

ఈ మేరకు న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు తెచ్చుకునేందుకు విరసం నేతలు, మృతుల కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల ఆందోళనను పోలీసులు పరిగణనలోకి తీసుకోకుండానే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయించారు.
 
కిరాతకంగా చంపారు..!
పోలీసులు అమానవీయంగా వ్యవహరించి శ్రుతి, విద్యాసాగర్‌లను పొట్టన పెట్టుకున్నారని విరసం నేతలు, మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం పూర్తరుున తర్వాత మృతదేహాలను వారి ఇళ్లకు తరలించారు. శ్రుతి శరీరంపై కాళ్లు, పొట్ట తదితర చోట్ల కాలిన గుర్తులున్నాయి. కుటుంబ సభ్యులు ఈ గాయాలను చూపిస్తూ... ‘‘యాసిడ్ పోసి అత్యంత కిరాతకంగా చిత్రహింసలకు గురిచే శారు.

ఆమెపై అత్యాచారం చేసి హతమార్చారు..’’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. విద్యాసాగర్ మర్మావయవాలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, ఎవరు చూడకుండా పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ఎన్నో అనుమానాలున్నాయని చెప్పారు.
 
ముగిసిన విద్యాసాగర్ అంత్యక్రియలు
ధర్మసాగర్: విద్యాసాగర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో బుధవారం ముగిశాయి. విద్యాసాగర్ తల్లిదండ్రులు సుధాకర్ లలిత, సోదరి శ్వేత గుండెలవిసేలా రోదించారు. అంత్యక్రియలో గ్రామస్తులు, బంధువులు, వరవరరావు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 
మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను పాటించండి
వరంగల్ లీగల్: ఎన్‌కౌంటర్ మృతదేహాలకు శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహణపై జాతీయ మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టుల మార్గదర్శకాలను అమలు పర్చాలని వరంగల్ జిల్లా మానవ హక్కుల కోర్టు మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.బి.నర్సింహులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మావోయిస్టు శ్రుతి బంధువు దుర్గాప్రసాద్ ఈ కోర్టును ఆశ్రయించారు.

శవపంచనామా, పోస్టుమార్టం నిర్వహించే సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని, ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి నిపుణుడి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. దీనిని పరిశీలించిన కోర్టు.. ఆ మార్గదర్శకాలను పాటించాలని, వీడియో రికార్డింగులను ఈనెల 25లోగా నివేదికగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement