టూవీలర్ల అమ్మకాలు ఓకే
న్యూఢిల్లీ: టూవీలర్ల అమ్మకాలు డిసెంబర్ నెలలో ఫర్వాలేదనిపించాయి. యమహా, హోండా మోటార్ సైకిల్, టీవీఎస్ మోటార్ కంపెనీల అమ్మకాలు పెరిగాయి. హీరో మోటోకార్ప్ అమ్మకాలు తగ్గాయి. అయితే గత ఏడాది మొత్తం మీద ఈ కంపెనీ రికార్డ్‌స్థాయి అమ్మకాలు (61,83,784) సాధించింది. ఇక లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్, హోండా కార్ల కంపెనీల విక్రయాలు పెరగ్గా, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, ఎస్కార్ట్స్ అమ్మకాలు తగ్గాయి.
గత ఏడాది మొత్తం 61,83,784 టూవీలర్లను విక్రయించామని హీరో మోటో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ దువా పేర్కొన్నారు. 2012 అమ్మకాల(61,20,259)తో పోల్చితే 1% వృద్ధి సాధించామని వివరించారు. ఈ ఏడాది మరిన్ని కొత్త బైక్‌లను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. హోండా మోటార్ సైకిల్ కంపెనీ బైక్‌ల అమ్మకాలు 18%, స్కూటర్ల అమ్మకాలు 54% చొప్పున పెరిగాయి. దేశీయ అమ్మకాలు 58%, ఎగుమతులు 13% చొప్పున వృద్ధి సాధించాయని యమహా పేర్కొంది. మొత్తంమీద గతేడాది అమ్మకాలు 34% పెరిగాయని తెలిపింది. టీవీఎస్ మోటార్ స్కూటర్ల అమ్మకాలు 36%, త్రీ వీలర్ల అమ్మకాలు 37%, ఎగుమతులు 27% చొప్పున పెరిగాయి.