
ఆయన పాల్గొంటే చైనాకు ఎందుకు నొప్పి?
భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తాజాగా ఈశాన్య సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించి.. తవాంగ్ ఉత్సవంలో పాల్గొనడం.. చైనాను ఇరకాటంలో పడేసింది.
భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తాజాగా ఈశాన్య సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించి.. తవాంగ్ ఉత్సవంలో పాల్గొనడం.. చైనాను ఇరకాటంలో పడేసింది. మూడురోజుల పర్యటన కోసం శుక్రవారం ఇక్కడికి వచ్చిన రిచర్డ్ వర్మ అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సబర్వాల్‌తో కలిసి తవాంగ్ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేసి.. అరుణాచల్‌ప్రదేశ్ ప్రజల ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘అద్భుతమైన కొండలు.. అద్భుతమైన ప్రజలు.. తవాంగ్ ఫెస్టివల్ కోసం అరుణాచల్ ప్రదేశ్ రావడం చాలా గొప్పగా ఉంది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
సీఎం పెమాఖండూ సొంతూరు అయిన తవాంగ్ సముద్ర మట్టానికి మూడువేల మీటర్ల ఎత్తులో తూర్పు హిమాలయాల్లో చైనా సరిహద్దులకు చేరువలో ఉంటుంది. ఇక్కడ తూర్పు సరిహద్దు విషయంలో భారత్-చైనా మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ టిబేట్‌లో భాగమని మొండిగా వాదిస్తూ సరిహద్దు వివాదాలకు ఆజ్యం పోస్తున్న చైనా.. గతంలో ఈ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగమేనన్న అమెరికా కాన్సుల్ జనరల్ ప్రకటనపై మండిపడింది. తమ మధ్య ఉన్న వివాదాలను ఇరుదేశాలు చర్చలు, సంప్రదింపులు ద్వారా పరిష్కరించుకోగలవని, ఇందులో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం బాధ్యతరాహిత్యమేనంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో తవాంగ్ పట్టణాన్ని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ సందర్శించి ఆ ఫొటోలు ట్విట్టర్‌లో పెట్టారు. అంతేకాకుండా చైనా సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులైన సరబానంద్ సోనోవాల్, పెమాఖండూ కూడా తమ ట్విట్టర్ పేజీల్లో రిచర్డ్ వర్మతో దిగిన ఫొటోలు పెట్టి.. తవాంగ్ ఉత్సవం ప్రత్యేకతను వివరించారు. తవాంగ్ భారత్‌లో అంతర్భాగమన్న గట్టి సందేశాన్ని చైనాకు ఈ ట్వీట్ల ద్వారా వారు చెప్పినట్టు అయింది. తమ భూభాగంలో తాము ఉత్సవం చేసుకుంటే చైనా నొప్పేంటి అన్నరీతిలో ఈ ట్వీట్లు ఉండటం గమనార్హం. అయితే, దీనిపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా టిబేట్ బౌద్ధుల మతగురువు దలైలామాను అరుణాచల్ ప్రదేశ్‌కు ఆహ్వానించాలన్న సీఎం పెమాఖండూ నిర్ణయంపైనా చైనా నిప్పులు కక్కే అవకాశముందని భావిస్తున్నారు.