
అవినీతిలో దేశముదురు
- టీఆర్‌ఎస్‌పై ఉత్తమ్ విసుర్లు
- రైతుల ఆత్మహత్యలను ఆపడానికి డబ్బుల్లేవా?
- రుణమాఫీపై బదులివ్వకుండా ప్రభుత్వం పారిపోతోంది
సాక్షి, హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలంటే పసికూనలం అంటున్న టీఆర్‌ఎస్.. అవినీతిలో దేశముదురు అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఏ సమస్య గురించి అడిగినా 15 నెలల పసికూన ఈ ప్రభుత్వం అంటున్న వాళ్లే అవినీతిలో ఎక్కడా లేనంత ముదుర్లు అయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి, మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారని దుయ్యబట్టారు. గాంధీభవన్‌లో గురువారం ఉత్తమ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు.
అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి వాటర్‌గ్రిడ్ టెండర్లు దక్కేలా అర్హతలు నిర్దేశించారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం వంటివాటిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోతున్నదనివిమర్శించారు. రూ.లక్ష లోపు రుణాలను మాఫీచేస్తామని ఎన్నికల్లో హామీని ఇచ్చిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విడతలవారీగా చేస్తామంటూ మోసం చేస్తోందని ఆరోపిం చారు. మిగిలిన రుణమాఫీని ఒకేసారి చేస్తామని అసెంబ్లీలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 8 వేలకోట్లను ఎక్కడి నుంచి తెస్తామంటోందని ఆక్షేపించారు.
ఏవేవో పథకాలు అంటూ లక్షల కోట్ల లెక్కలు చెబుతున్న సర్కారుకు రైతుల ఆత్మహత్యలను ఆపడానికి 8 వేలకోట్లను ఇవ్వడానికి చేతులు రావడం లేదా అని నిలదీశారు. రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని జూన్ 2 నుంచి చెల్లించకుండా మోసం చేసే ప్రయత్నంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, పోలీసులు, రైతు సంఘాలు ఇస్తున్న లెక్కల ప్రకారం 1,400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వం తక్కువ మందిని చూపించి పరిహారం ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తోందని ఉత్తమ్‌కుమార్ ఆరోపించారు.