కేక వేస్తే వచ్చేస్తుంది
ఈ మధ్యకాలంలో డ్రైవర్లు లేని కార్లు అనేకం రోడ్ల మీదకు వచ్చేస్తున్నాయి కదా.. ఒకవైపు గూగుల్, ఇంకోవైపు ఉబెర్, టెస్లాలు ఈ రకమైన కార్లను వీలైనంత వేగంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫోక్స్‌వ్యాగన్ ఇంకో అడుగు ముందుకేసి.. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కాన్సెప్ట్ కారును డిజైన్ చేసింది. పేరు సెడ్రిక్! స్టీరింగ్, డ్రైవర్ ఇద్దరూ అవసరం లేకపోతే ప్రయాణీకులు ఒక దిక్కుకు కాకుండా ఎదురుఎదురుగా కూర్చుని వెళ్లేలా ఉంటుంది ఇది.
అంతేకాదు.. ఈ కారులో వెళ్లేటప్పుడు స్వచ్ఛమైన గాలి అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయి. సెడ్రిక్‌ను కేక వేయడంతోనే అది ఎక్కడున్నా... సర్రు సర్రున మీ ముందుకు వచ్చేస్తుంది. ఆ తరువాత లోపల కూర్చున్న వెంటనే.. ‘ఆఫీసుకు వెళ్లాలి’’ అని చెబితే చాలు. అప్పటికే ఫీడ్ చేసిన ఆఫీస్ అడ్రస్‌కు నేరుగా వెళ్లిపోతుంది. అంతేకాకుండా.. దారిలో ట్రాఫిక్ ఎలా ఉంది? వాతావరణం ఎలా ఉండబోతోంది అనే విషయాలన్నింటిని మీకు వినిపిస్తుంది కూడా. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఈ కారు పూర్తిగా విద్యుత్తుతోనే నడుస్తుంది. టెస్లా కారు మాదిరిగా దీంట్లోనూ బ్యాటరీ ప్లాట్‌ఫార్మ్‌లో ఏర్పాటు చేస్తారు. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చునని అంచనా. ప్రస్తుతం జరుగుతున్న జెనీవా మోటర్ షోలో ఈ సరికొత్త కారును ప్రదర్శిస్తున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్