జయలలిత బుగ్గపై ఆ చుక్కలు ఎందుకొచ్చాయి?? | What is mistery behind four dots on Jayalalithaa cheek | Sakshi
Sakshi News home page

జయలలిత బుగ్గపై ఆ చుక్కలు ఎందుకొచ్చాయి??

Published Tue, Feb 7 2017 3:30 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

జయలలిత బుగ్గపై ఆ చుక్కలు ఎందుకొచ్చాయి??

జయలలిత బుగ్గపై ఆ చుక్కలు ఎందుకొచ్చాయి??

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. ఆమె మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు లండన్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్‌ రిచర్డ్‌ బీలే, అపోలో ఆస్పత్రి వైద్యులతో కలిసి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. తమిళనాడు సర్కారు ఏర్పాటు చేసిన ఈ ప్రెస్‌మీట్‌లో వైద్యులకు ఎదురైన ప్రధాన ప్రశ్న.. ఎందుకు జయలలిత బుగ్గులపై నాలుగు చుక్కలు ఉన్నాయి? అని..

ప్రజల సందర్శనార్థం జయలలిత భౌతికకాయాన్ని రాజాజీ హాల్‌లో ఉంచిన సందర్భంలో తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పెనుదుమారం రేపాయి. ముఖ్యంగా జయలలిత భౌతికకాయం మారిపోయిన తీరు.. ఆమె బుగ్గపై నాలుగు చుక్కలు (డాట్లు) ఉండటం.. అనేక అనుమానాలకు తావిచ్చింది. దీనికితోడు జయలలిత రెండు కాళ్లు తొలగించారని, ఆమె ముందు చనిపోయారని, ఆ విషయాన్ని దాచిపెట్టి.. ఆమె భౌతికకాయం కుళ్లిపోకుండా ఉండేందుకే తీసుకున్న చర్యల వల్లే బుగ్గపై ఉన్న ఈ నాలుగు చుక్కలు వచ్చాయని సోషల్‌ మీడియాలో వదంతులు గుప్పుమన్నాయి.

దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్‌ బీలే స్పందిస్తూ.. ’జయలలిత కాళ్లు తొలగించలేదు. ఎలాంటి ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ చేయలేదు. బుగ్గల మీద ఉన్న చుక్కలు అంటారా.. తీవ్రంగా జబ్బుపడ్డ రోగులకు బుగ్గలపై అలాంటి చుక్కలు వస్తాయి’ అని వివరణ ఇచ్చారు. ఇక మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ అనాటమీ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధా శేషియన్‌ మాట్లాడుతూ.. జయలలిత మృతదేహాన్ని భద్రపరిచే చర్యలు తీసుకున్నామని, ఈ సందర్భంగా సాధారణ పద్ధతినే పాటించామని ఆమె తెలిపారు. జయలలిత భౌతికకాయంలోకి ఎంబాల్మింగ్‌ ఫ్లూయిడ్స్‌ ఎక్కించామని, అయితే ఈ సందర్భంగా ఎలాంటి లీకులు చోటుచేసుకోలేదని వివరణ ఇచ్చారు. వెంటీలేటర్‌పై ఉంచడం వల్ల జయలలిత పెదవులు ఉబ్బి ఉంటాయని, ట్రేకియాటమీ (శ్వాసలో అడ్డంకులు తొలగించే క్రమంలో) చేసే క్రమంలో ఆమె బుగ్గపై చుక్కలు వచ్చి ఉంటాయని వివరణ ఇచ్చారు. వీఐపీలు చనిపోయినప్పుడు.. ప్రజల సందర్శనార్థం ఉంచే సమయంలో వారి భౌతికకాయాలను కుళ్లిపోకుండా భద్రపరిచే చర్యలు తీసుకోవడం సహజమేనని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే, జయలలిత బుగ్గపై చుక్కల గురించి వైద్యులు ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. జయలలిత మృతిపై అనేక అనుమానాలు వస్తున్న సమయంలో వాటిని నివృత్తి చేసేందుకు వైద్యబృందం ఎంచుకున్న సమయం కూడా వివాదాస్పదంగా మారింది. తమిళనాడు కొత్త సీఎంగా శశికళను ఎంచుకున్న మర్నాడే.. ఈ ప్రెస్‌మీట్‌ పెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుత్నునాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement