యూపీ సీఎం ఎంపిక ఎందుకు ఆలస్యం? | What's stopping BJP from naming next Uttar Pradesh Chief Minister? | Sakshi
Sakshi News home page

యూపీ సీఎం ఎంపిక ఎందుకు ఆలస్యం?

Published Thu, Mar 16 2017 4:42 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

యూపీ సీఎం ఎంపిక ఎందుకు ఆలస్యం? - Sakshi

యూపీ సీఎం ఎంపిక ఎందుకు ఆలస్యం?

లక్నో: దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన పంజాబ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ చక్రం తిప్పి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది రేపు (శుక్రవారం) బీజేపీ తేల్చనుంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో చరిత్రాత్మక విజయం సాధించిన కమలం పార్టీ.. ఎన్నికల ఫలితాలు వెలువడి ఆరు రోజులు కావస్తున్నా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమవుతోంది? దీనికి కారణాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.

యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి బీజేపీ పరిశీలకులు నిన్న (బుధవారం) లక్నో వెళ్లి.. ఈ రోజు (గురువారం) సమావేశం కావాల్సివుంది. అయితే చివరి నిమిషంలో లక్నో పర్యటనను రద్దు చేశారు. బీజేపీ నాయకుల సమాచారం మేరకు.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో ఆ పార్టీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. యూపీ విషయంలో చిన్న పొరపాటు కూడా చేయరాదని భావిస్తోంది. ఎమ్మెల్యేలనే ఢిల్లీకి పిలిపిస్తున్నారు. పరిశీలకులతో పాటు ఇతర సీనియర్ నేతలు వారితో మాట్లాడి, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఎన్నికలు జరిగిన ఇతర నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే యూపీకి బీజేపీ ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని కుల సమీకరణలపై, ఎన్నికల హామీలను నెరవేర్చడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఆయన బృందం దృష్టిసారిస్తోంది. అంతేగాక 2019 జరిగే లోక్‌సభ ఎన్నికల్లో యూపీపై భారీ ఆశలు పెట్టుకుంది. ఢిల్లీ పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలంటే యూపీ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడంతో పాటు పార్టీలో అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లగల సరైన నేత కోసం అన్వేషిస్తోంది. యూపీ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలిచినా.. ఏ ఎమ్మెల్యేకూ సీఎం అయ్యే అవకాశం రాకపోవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్రం నుంచే బలమైన నేతను యూపీ సీఎంగా పంపనున్నట్టు చెప్పారు. ముఖమంత్రి అభ్యర్థిని అగ్రవర్ణాల నుంచి ఎంపిక చేయలా లేక యాదవేతర బీసీలకు అవకాశం ఇవ్వాలా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. సీఎం పగ్గాలు ఓ వర్గానికి అప్పగిస్తే.. డిప్యూటి సీఎంను మరో వర్గం నుంచి ఎంపిక చేయాలని కూడా ఆలోచిస్తున్నారు.

యూపీ సీఎం పదవికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, మనోజ్ సిన్హా, బీజేపీ యూపీ చీఫ్‌ కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాజ్‌నాథ్‌ను యూపీ ముఖ్యమంత్రిగా పంపిస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని నేరుగా రాజ్‌నాథ్‌తోనే ప్రస్తావించగా.. ఆయన కొట్టిపారేశారు. యూపీ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనా?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement