21వ శతాబ్దంలో కూడా ఇలాంటి ఘోరమా?: వైఎస్ జగన్
అమలాపురం: దళితులపై దాడి అమానుషమని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో గోవధకు పాల్పడ్డారన్న అపోహతో ఇటీవల దళితులపై దుండగులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడిలో గాయపడి అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం వైఎస్ జగన్ పరామర్శించారు.
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. 'ఆస్పత్రిలో పేషెంట్లుగా ఉన్న దళితులను ఏం జరిగింది, ఎందుకు జరిగిందని అడిగితే వీళ్ల చెప్పిన విషాయాలు వింటే గుండె బరువెక్కుతుంది. ఇది ధర్మమేనా.. వ్యవస్థలో ఇంత దారుణం జరుగుతున్నా ప్రశ్నించకపోవడం ధర్మమేనా?. ఏం జరిగిందని అడిగినప్పుడు వాళ్లు చెప్పింది వింటే బాధ అనిపిస్తుంది. అరవింద్ అనే సామిల్ ఓనర్ తన ఆవు చనిపోతే, ఆ ఆవును తీసుకెళ్లాలని ఇక్కడున్న ఎలిషా, వెంకటేశ్వరరావులను కోరారు.
వీళ్లు జంతు చర్మం మీదే ఆధారపడి బతుకుతారు. వాళ్ల వృత్తే అది. అరవింద్ ఫోన్ చేసిన తర్వాత వాళ్లు ఆ ఆవును వ్యాన్‌లో శ్మశానం దగ్గరకు తీసుకెళ్లి, చర్మాన్ని ఒలిచి ఆవును పూడ్చిపెడుతున్నారు. అది వాళ్ల వృత్తి.. అది తప్ప వేరే ఆదాయమార్గం లేదు. దశాబ్దాలుగా అదే పని చేసుకుంటున్నారు. ముందుగా అక్కడకు ఇద్దరు వ్యక్తులు వచ్చి బండి నెంబరు నోట్ చేసుకున్నారు. వెంటనే పది - పదిహేను నిమిషాల్లో దాదాపు 15 మంది పైచిలుకు అక్కడకు వచ్చారు.
వచ్చీ రాగానే వీళ్లను నిర్దాక్షిణ్యంగా శ్మశానం నుంచి లాక్కుని బయటకు వచ్చి నడిరోడ్డు మీద చెట్టుకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. దుర్భాషలాడుతూ, చెప్పు తీసుకుని మొహాన కొట్టారు. దెబ్బలు తిన్నవాళ్లలో పదోతరగతి పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ సంగతి కూడా పక్కన పెట్టి పసివాడిని కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు.
మనం 21వ శతాబ్దంలో ఉన్నాం.. వాళ్లు చేసింది తప్పని అనిపిస్తే పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు పెట్టాలి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఆ నలుగురినీ కట్టేసి నడిరోడ్డు మీద చెప్పులతో కొట్టడం సభ్య సమాజం ఆమోదించాల్సిన విషయమేనా. పోలీసుల సమక్షంలోనే ఇంకా ఎక్కువ కొట్టారు. వీళ్లను కాపాడేందుకు పిల్లలు వస్తే వాళ్లను నడిరోడ్డు మీద మోకాళ్లపై కూర్చోబెట్టారు. వాళ్ల ముందు మళ్లీ కొట్టారు.అర్ధగంట తర్వాత పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వీళ్లు చెప్పే మాటలను కూడా పోలీసులు వినే పరిస్థితి లేదు.
ఈ ఆవు యజమాని స్వయంగా చెబితేనే వెళ్లి ఆవు మృతదేహాన్ని తీసుకెళ్లినట్లు చెప్పినా, ఆ సామిల్లు ఓనర్‌తో మాట్లాడండని చెప్పినా కనీసం పోలీసులు ఆ మాటలు కూడా వినిపించుకోలేదు. పైపెచ్చు నడిరోడ్డు మీద చెప్పులతో కొట్టడం, హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే.. ఆయన సొంత ఊరు అయినా కూడా ఇక్కడే ఈ ఘటన జరగడం బాధాకరం. మర్నాడు ఆ అరవింద్ దగ్గరకు పోవాలని దళిత సంఘాలు గొడవ చేస్తే అప్పుడు వీళ్లను తీసుకెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నారు.
బాధితులకు రు.లక్ష పరిహారం ఇవ్వడం అన్యాయం. నిబంధనల ప్రకారం రూ.8 లక్షల 20వేలు చెల్లించాలి. రాజమండ్రి వరకూ వచ్చిన సీఎం చంద్రబాబు అమలాపురం వచ్చి ఉంటే బాధితుల్లో నైతిక స్థైర్యం పెరిగేది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.