చంద్రబాబుకు బాధ్యత లేదా?
≈ సీఎంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపాటు
≈ దాడిలో గాయపడ్డ దళితులను పరామర్శించే తీరిక లేదా?
≈ మొక్కుబడిగా రూ.లక్ష ఇచ్చేస్తే సరిపోతుందా?
≈ ఒక్కొక్కరికి రూ.8.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే
≈ బాధితుల గోడు వింటే గుండె బరువెక్కుతోంది
≈ దళితులపై దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి
≈ అమలాపురం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన ప్రతిపక్ష నేత
సాక్షిప్రతినిధి, కాకినాడ: పాశవిక దాడిలో గాయపడ్డ దళితులను పరామర్శించే సమ యం, తీరిక, బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేవా? అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. గోదావరి అంత్య పుష్కరాల ముగింపు ఉత్సవాలకు రాజమహేంద్రవరానికి వచ్చి కూడా బాధితులను కనీసం పలకరించాలనే మానవతా దృక్పథం కూడా చంద్రబాబుకు లేకుండా పోయిందని మండిపడ్డారు. దళితులను పట్టించుకోకుండా వెళ్లిపోయిన చంద్రబాబును ఏమనుకోవాలని ప్ర శ్నించారు. బాధితులకు ఏదో మొక్కుబడిగా తలో రూ.లక్ష ఇచ్చేస్తే సరిపోతుందనుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ సూదాపాలెంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలుచుకుంటున్న దళితులపై కొందరు వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అమలాపురం ఏరి యా ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. మీడియాతో జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘నిన్న చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకు వచ్చారు.
దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించి, ఏం జరిగిందో అడిగి ఉంటే.. వారిలో మనోధైర్యం పెరిగేది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెబితే బాధితుల్లో నమ్మకం కలిగేది. ఆ నమ్మకం ఈవాళ చంద్రబాబు ఇవ్వగలుగుతున్నారా? ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ చట్టం ప్రకారం.. ఇలాంట దారుణమైన ఘటనలు జరిగితే ప్రభుత్వం తరుపున బాధితులకు రూ.లక్ష నుంచి రూ.8.25 లక్షల వరకు పరిహారం ఇవ్వాలి. ముఖ్యమంత్రి మాత్రం అందులో మొదటి చెప్పిన రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో చంద్రబాబే చెప్పాలి. చట్టంలో ఉన్నట్టుగా నలుగురు బాధితులకు రూ.8.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. దళితులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలి. ప్రజలకు తోడుగా ఉంటామనే భరోసాను కల్పించాలి.
హోం మంత్రి సొంత మండలంలో ఘోరం
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెప్పిన విషయాలు వింటే గుండె బరువెక్కుతోంది. వ్యవస్థలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నా ప్రశ్నించకపోవడం ధర్మమేనా? వారు దశాబ్దాలుగా చర్మాలు వలుచుకునే వృత్తిలో ఉన్నారు. బతుకు తెరువు కోసం వారికి మరో మార్గం లేదు. ఆవు చర్మం తీస్తున్నారనే ఒకే ఒక్క కారణంతో వీరిని శ్మశానం నుంచి దాదాపుగా 300 మీటర్లు చొక్కా పట్టుకొని నిర్దాక్షిణ్యంగా లాక్కొని పోయారు. శ్మశానం నుంచి బయటకు వచ్చిన తరువాత చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. దుర్భాషలాడుతూ చెప్పు తీసుకుని మరీ కొట్టారు. చిన్న పిల్లవాడిని కూడా వదిలిపెట్టలేదు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం.
వ్యక్తులను నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి, చెట్లకు కట్టేసి చెప్పులతో కొట్టడమన్నది సభ్య సమాజం అంగీకరించే విషయం కాదు. అరగంట తరువాత పోలీసులు వచ్చారు. పోలీసుల సమక్షంలోనే తమను తీవ్రంగా కొట్టారని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వీళ్లని కాపాడేందు కోసం వారి పిల్లలు కూడా వచ్చారట. పిల్లలను నడిరోడ్డు మీద మోకాళ్లపై కూర్చోబెట్టి ఇంకా ఎక్కువ కొట్టారు. రాష్ట్ర హోం మంత్రి సొంత మండలంలో ఇది జరగడం అత్యంత హేయం. ఏం జరిగిందో తెలుసుకోవాలని దళిత సంఘాలు వచ్చి గగ్గోలు పెట్టిన తరువాతే బాధితులను ఆస్పత్రిలో చేర్చారు. పోలీసు స్టేషన్‌లో వ్యాను డ్రైవర్ లక్ష్మీప్రసాద్‌ను లెంపకాయలు కొట్టారు. నిజంగా పేదవాళ్లంటే ఇంత అలుసా? చట్టాలన్నీ ఉండి కూడా ఇలా ప్రవర్తిస్తే ఇక ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుంది?
తోటి మనిషిని మనిషిగా చూడాలి
మన వ్యవస్థలో మార్పు వచ్చే దిశగా అడుగులు వేయాలి. వ్యవస్థలో మార్పు రావాలంటే మనం ముందుండి గట్టిగా అడగాలి. తోటి మనిషిని మనిషిగా చూడాలి. ఇది కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. మొన్న విశాఖ జిల్లా ఫాల్మన్‌పేటలో మత్స్యకారులకు ఇదేరమైన అన్యాయం జరిగింది. అక్కడ యనమల రామకృష్ణుడు అనే మంత్రిస్థానంలో ఉన్న వ్యక్తి తన తమ్ముడిని, మనుషులను పంపించి బీభత్సం సృష్టించాడు. మేమంతా అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలిచాం. వారికి భరోసా ఇచ్చాం.
ఇక్కడ కూడా దళితులకు అన్యాయం జరిగిందని వచ్చాను. తప్పు చేశారని భావిస్తే పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసులు పెట్టాలి. అంతేకానీ ఎవరికి వారు నడిరోడ్డు మీద చెట్టుకు కట్టేసి కొట్టకూడదు. ఇలా కొట్టేవారిని కఠినంగా శిక్షస్తేనే సమాజానికి సందేశం వెళ్తుంది’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యేలు కుడుపూడి చిట్టబ్బాయి, పెండెం దొరబాబు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరులు ఉన్నారు.