‘నంద్యాలలో ఎనిమిదిమంది మంత్రుల ముఠా’
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక కోసం ఎనిమిది మంది మంత్రుల ముఠా రంగంలోకి దిగిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...మాటల గారడి ముఖ్యమంత్రి మరోసారి నంద్యాలకు రాబోతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదని, ఇప్పుడు ఉప ఎన్నిక కోసం మరెన్ని హామీలు గుప్పిస్తారో అంటూ ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం అభివృద్ధి పేరుతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టారన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా షాపులను కూల్చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు బుద్ధి చెబుతారు...
ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... లేనిది ఉన్నట్లు చిత్రీకరించడంలో చంద్రబాబు నాయుడు ఘనుడని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో నంద్యాల ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. ఉప ఎన్నికల్లో నంద్యాల ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా నంద్యాలలో టీడీపీ పరిస్థితి బాగోలేనందునే మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా తరలి వస్తున్నారనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తం అవుతోంది.