'ఏం కొంపలు మునిగిపోయాయని అర్థరాత్రి వేళ..'
హైదరాబాద్: ప్యాకేజీ అనేది సహాయంలాంటిదని.. ప్రత్యేక హోదా ఉద్యోగం ఇవ్వడంలాంటిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వస్తే తమ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరూ ఎదురు చూశారని, అలాంటి వారిని దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా నేటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగారని, అధికారంలోకి వచ్చాక ఆ విషయం వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాలే ఇచ్చారు తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదని అన్నారు. ప్రత్యేక హోదాపై చర్చ జరగాలని తాము పట్టుబట్టామని, వాయిదా తీర్మానం కూడా ఇచ్చామని, అయితే, కేవలం ప్రకటన ఇచ్చి వెళ్లిపోవాలని చంద్రబాబు అనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై చర్చకు చంద్రబాబు భయపడ్డారని అన్నారు. ఏవో కొంపలు మునిగిపోయినట్లు ప్యాకేజీపై అర్ధరాత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేస్తే రాత్రి 12.30కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వాగతించారని మండిపడ్డారు. అసలు అర్థరాత్రి ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా అనేది రాజ్యంగపరంగా జరిగే విధానం కాదని, కార్యనిర్వాహక శాఖ కేంద్రమంత్రి మండలి నిర్ణయం తీసుకుంటే అయిపోతుందని గుర్తు చేశారు. రాష్ట్రం విడిగొట్టి ప్రత్యేక హోదా చేర్చిన తర్వాతే 14వ ఫైనాన్స్ కమిషన్ వచ్చిందని, ముందే ప్రకటించిన దానికి తర్వాత వచ్చిన 14వ కమిషన్ అడ్డుచెప్పిందని చెప్పడం సరైన చర్య కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సుదీర్ఘ అనుభవం ఉందని యనమల రామకృష్ణుడు అంటున్నారని, అలాంటప్పుడు ఆయన వయసు, అనుభవానికి తగినట్లు మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. అనుభవం ఉన్న వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఆ మాటను అందరూ ఆమోదించాలని, తమలాంటి జూనియర్లమే ఎలాంటి వివాదాల్లేకుండా మాట్లాడుతున్నామని చెప్పారు.