
కళ్లు తెరుస్తారా బాబూ!
కష్టార్జితమైన కరెన్సీని చెల్లుబాటు చేసుకోవడానికి నిరుపేద, మధ్యతరగతి జనం పడుతున్న యాతనలను మీడియా హోరెత్తిస్తుండగా...
కష్టార్జితమైన కరెన్సీని చెల్లుబాటు చేసుకోవడానికి నిరుపేద, మధ్యతరగతి జనం పడుతున్న యాతనలను మీడియా హోరెత్తిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఉదంతం మాన వతావాదులందరినీ కలవరపరుస్తుంది. తీవ్ర అనారోగ్యంపాలై, నడవలేని స్థితిలో ఉన్న శ్రీనివాసాచారి అనే వ్యక్తిని మొదటి అంతస్తులో ఉన్న వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లడానికి ఆయన భార్య పడిన ఇక్కట్లు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. శ్రీనివాసా చారిని సాధ్యమైనంత వేగంగా, క్షేమంగా వైద్యుని వద్దకు చేర్చడానికి అవసరమైన స్ట్రెచర్‌గానీ, చక్రాల కుర్చీగానీ సమకూర్చకపోవడంతో భర్తను రెక్క పట్టుకుని ఈడ్చుకెళ్లాల్సివచ్చింది. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఎక్కడో హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ హఠాత్తుగా అనారోగ్యం చుట్టు ముట్టి తప్పనిసరై స్వస్థలానికి వచ్చాడాయన. గుంతకల్లు మారుమూల గ్రామ మేమీ కాదు. ఆ ఆసుపత్రి ఎలాంటి సౌకర్యాలూ లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రమూ కాదు.
శ్రీనివాసాచారి భార్య అడిగింది గొంతెమ్మ కోర్కె అంతకన్నా కాదు. అత్యవసరంగా వైద్య సాయం అందాల్సిన రోగిని వెంటనే చేరేయమని మాత్రమే ఆమె వేడుకున్నారు. జనం కట్టే పన్నులతో నెలొచ్చేసరికి వేలాది రూపాయలు జీతాలు అందు కుంటున్నవారిలో ఒక్కరంటే ఒక్కరు అది తమ కర్తవ్యమని భావిం చలేకపోయారు. బాధ్యతలు, కర్తవ్యాల సంగతలా ఉంచి కనీసం మనుషులు గానైనా స్పందించాలనుకోలేదు. సిగ్గుతో తలొంచుకోవాల్సిన ఈ ఉదంతంపై 24 గంటలు గడుస్తున్నా... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగానీ, ఆరోగ్యమంత్రి కామినేని శ్రీని వాస్‌గానీ స్పందించిన దాఖలాలు లేవు. అధికారుల విచారణ మొదలైంది.
కానీ ఇవి కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోతాయని, చివరకు జరిగేదేమీ ఉండదని గత అనుభవాలు చెబుతున్నాయి. సరిగ్గా ఏడాదిక్రితం గుంటూరులో ఏమైంది? అక్కడి ప్రధాన ఆసుపత్రిలోని ఐసీయూలో ఒక నవజాత శిశువును ఎలుకలు కొరికి చంపేశాయి. మొన్న మే నెలలో విజయవాడ ప్రభు త్వాసుపత్రిలో మరో నవజాత శిశువు చీమలు కుట్టి చనిపోయింది. ఈ రెండు ఘటనల సమయంలోనూ విచారణలు జరిగాయి. బాధ్యులపై చర్యలు తీసుకుం టామన్నారు. తీసుకున్నామని మరి కొన్నాళ్లకు చెప్పారు. కానీ జరిగిందేమిటి? గుంటూరు ఆసుపత్రి ఘటన సమయంలో కనీసం చంద్రబాబు, కామినేని నోరు విప్పారు. బాధపడుతున్నట్టు కనబడటానికి ప్రయత్నించారు. ఇకపై ఇలాంటివి జరగనివ్వబోమని చెప్పారు. కానీ వీటిని ఆపడం తమ శక్తికి మించిన పని అను కున్నారో, ఇలాంటివాటికి అలవాటు పడ్డారో... విజయవాడ ఘటన నాటికే వారి ద్దరూ మౌనం పాటించారు. ఆ తర్వాత సైతం ప్రభుత్వాసుపత్రులు నరకాలుగా మారి నిరుపేద రోగుల్ని హింసిస్తున్న తీరును ‘సాక్షి’ దినపత్రిక ధారావాహికంగా వెలువరించింది. అయినా కదలిక లేదు.
ప్రసూతి మరణాలు, నవజాత శిశు మరణాలపై ప్రపంచ బ్యాంకు నిరుడు వెలువరించిన నివేదిక మన దేశంలోని ఆసుపత్రుల గురించి ఎన్నో దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలను వెల్లడించింది. ఆ రెండు అంశాల్లోనూ తెలుగు రాష్ట్రాలు వెనుకబడిన దేశాలైన కంబోడియా, డొమినికన్ రిపబ్లిక్‌లతో పోల్చినా తీసికట్టుగా ఉన్నాయని తేల్చింది. దిద్దుబాటు చర్యల్ని సూచించింది. వాటర్ ఎయిడ్ అనే మరో సంస్థ గత రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాలతోపాటు యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటకల్లోని 12 జిల్లాలను ఎంచుకుని చేసిన సర్వేలో అత్యంత అధ్వా న్నమైన స్థితిలో ప్రభుత్వాసుపత్రులు ఉన్నాయని వెల్లడించింది. మరుగుదొడ్లు, మంచినీటి సదు పాయం వంటివి చాలా చోట్ల లేవని, కనీసం వాష్ బేసిన్లు కూడా ఏర్పాటు చేయ లేదని పేర్కొంది. ఇక స్ట్రెచర్‌లు, వీల్‌చైర్ల సంగతి చెప్పేదేముంది? అవసరమైన సిబ్బందిని తీసుకోకపోవడం, చాలా సేవలను ఔట్ సోర్సింగ్‌కు అప్ప జెప్పి పేద రోగులను వారి దయాదాక్షిణ్యాలకు వదిలేయడం గత కొన్నేళ్లుగా ఎక్కువైంది.
శ్రీమంతులు, పలుకుబడి ఉన్నవారు, రాజకీయ నాయకులు జబ్బు చేస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగెడతారు. ఆర్ధిక స్తోమత లేని శ్రీనివాసాచారి వంటి నిరుపేదలు ప్రభుత్వాసుపత్రులకు వెళ్తారు. అక్కడ జరుగుతున్నదేమిటో, పేద రోగులకు నిత్యం ఎదురవుతున్న ఇబ్బందులేమిటో ఎవరూ ఆరా తీయరు. గుంతకల్లు ఆసుపత్రిలో కనీసం ర్యాంపు ఉన్నది గనుక ఆ అభాగ్యుడి భార్య ఎంత కష్టాన్నయినా ఓర్చుకుని ఆయనను ఈడ్చుకెళ్లగలిగింది. సకాలంలో వైద్యుడి చెంతకు చేర్చగలిగింది. పై అంతస్తుకు వెళ్లేందుకు మెట్లు తప్ప గత్యంతరం లేక పోతే వారి పరిస్థితేమిటి? ఊహించడానికి కూడా భయం వేస్తుంది.
ఆరోగ్య సమాజాన్ని సాధించిన దేశం అనేక విధాల అభివృద్ధి సాధిస్తుందని నిపుణులు చెబుతారు. జనాభా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉత్పాదకత పెరుగు తుందని, అక్షరాస్యత వృద్ధి చెందుతుందని... అలాంటివి దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయంటారు. కానీ ఆరోగ్య రంగాన్ని మన దేశం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరుడు వెలువరించిన గణాంకాలు వెల్ల డించాయి. ఆరోగ్యం కోసం మన దేశం వెచ్చిస్తున్నది దేశీయ ఉత్పాదకత (జీడీపీ)లో కేవలం 1.6 శాతం మాత్రమే. ఇది కనీసం 5శాతం ఉంటే తప్ప ప్రయోజనం ఉండదు. మెక్సికోలాంటి చిన్న దేశంలో కూడా తలసరి ఆరోగ్య వ్యయం 1,045 డాలర్లుంటే మన దేశంలో అది 214 డాలర్లు మించడం లేదని ఆ గణాంకాలు తెలిపాయి. దాదాపు అయిదు దశాబ్దాల క్రితం ఆరోగ్యరంగంపై జీడీపీలో 2.5 శాతాన్ని వ్యయం చేసిన చైనా ఇప్పుడు దాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేసింది. వారిని చూసైనా మన ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకోవాలి. గుంతకల్లు ఉదంతంలో సిబ్బంది నిర్లక్ష్యంతోపాటు పర్యవేక్షణ లోపం కూడా కనిపిస్తోంది. కనీసం ఇప్ప టికైనా బాబు ప్రభుత్వం మేల్కొని సర్కారీ ఆసుపత్రుల ప్రక్షాళనకు పూనుకోవాలి. ఆరోగ్యరంగంపై అవసరమైన నిధుల్ని వెచ్చించడం, సిబ్బందిలో జవాబుదారీ తనాన్ని పెంచడం తక్షణావసరాలని గుర్తించాలి. వృ«థా మాటలతో పొద్దు పుచ్చడం మానుకోవాలి.