
కాపులకు బాబు నమ్మకద్రోహం..!
కొమ్మినేని శ్రీనివాసరావుతో వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
గత 35 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పాలనాపరంగా ఇంతటి దుస్థితిని ఎన్నడూ చూడలేదని మాజీమంత్రి, వైస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అంటున్నారు. తెల్లవారితే చాలు దోపిడీ, దోపిడీ ఆంటూ సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రబాబు సకల వ్యవస్థలను తోసిరాజంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన జరగటం లేదని దోపిడీ పునాది గల సామాజిక వర్గాల పాలన కులం ప్రాతిపదికన జరుగుతోందని, సంపన్న జిల్లాల్లో కూడా అభి వృద్ధి ఆగిపోయిందని పేర్కొన్నారు. ముద్రగడ నిరసన దీక్షకు పూనుకుంటే ఆయన సామాజిక వర్గాన్నే హౌస్ అరెస్ట్ చేయడం ఎన్నడూ జరగలేదన్నారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత బలంగా ఉందంటే 2004, 2009లో వైఎస్సార్ సృష్టించిన ప్రభంజనం 2019లో మళ్లీ జరు గుతుందంటున్న బొత్స సత్యనారాయణ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
రాష్ట్ర విభజనపై పార్టీకి వ్యతిరేకంగా తీర్మానానికి కిరణ్ మిమ్మల్ని ఎలా ఒప్పించారు?
సమైక్యాంధ్రకు అనుకూలంగా చెప్పకపోతే మీ మీడియా వాళ్లు మమ్మల్నందరినీ నక్కల కింద కుక్కల కింద జమకట్టి తిడుతున్నారు కదా. అలా పార్టీకి వ్యతిరేకంగా తీర్మానం అయినా చేస్తే కాస్త వేడి తగ్గుతుందనుకున్నాము. తీర్మానానికి అనుకూలత తెలిపాం.
వైఎస్ జగన్‌కు అనుకూలంగా 145 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేస్తే రోశయ్యను ఎందుకు సీఎంని చేశారు?
సీనియర్, పెద్దమనిషి అనే అభిప్రాయంతోనే ఆయన్ని సీఎంని చేశారు. వైఎస్ జగన్‌ను కూడా ఒప్పి చేయించారు. కానీ ఆయన్నే మారుద్దామనుకున్నప్పుడు ఇంకో పెద్దమని షిని తీసుకువచ్చి ఉంటే ఈ గందరగోళాలు జరిగేవి కావు.
వైఎస్‌ఆర్ మరణం తర్వాత జగన్‌పై కేసులు పెట్టడంపై మీ అభిప్రాయం?
జగన్‌పై కేసులు ఎందుకు పెట్టారన్నది నాకు తెలీదు. కానీ కేబినెట్‌లో ఏమని నిర్ణయించుకున్నామో.. అవి సమష్టి నిర్ణయాలు. కేబినెట్ వెన కాల ఏవైనా జరిగితే వాటికి మాకు సంబంధం లేదు కానీ మంత్రి వర్గంలో ఎలాంటి నిర్ణయం జరిగినా మేమంతా కట్టుబడి ఉండాల్సిందే.
కేబినెట్లో తీసుకున్న నిర్ణయంతో మీకు సంబంధం లేదా అంటే కచ్చి తంగా ఉంది అనే అంటాను. నాకు సంబంధం లేదు. నన్ను బుల్‌డోజ్ చేశారు అనుకుంటే ఆరోజే నువ్వు మంత్రివర్గం నుంచి తప్పుకుని బయటకు రావాలి. ఆరోజు ఎందుకు మాట్లాడలేదు అన్నదే పాయింట్.
అధిష్టానం జగన్‌పై పెట్టిన కేసులు నిలవవని రమాకాంత్‌రెడ్డి ఈమధ్యే చెప్పారు కదా?
నేను మంత్రిగా ఉన్నప్పుడు నాతో ఎవరూ ఈ విషయాలు మాట్లాడలేదు. మిగతా వాళ్లతో ఏం మాట్లాడారో నాకు తెలీదు. రమాకాంత్‌రెడ్డి మాట్లాడింది నేను చదివాను. సీబీఐకి బిజనెస్ రూల్స్ గురించి తెలీదన్నారు. ఆ విషయాలపై సీబీఐ ఒకసారి మా ఇంటికి వచ్చి నన్ను విచారించింది. జేడీ లక్ష్మీనారాయణ రాలేదు కానీ తన కింద ఉన్న ఎస్పీ కేడర్ ఆఫీసర్, తదితరులు వచ్చారు. నాలుగైదు గంటలు మాట్లాడి ఫైనల్‌గా ఫైల్స్ చూపెట్టమన్నారు. చూపించాను. అప్పుడే చెప్పాను. ‘సర్.. సెక్రటేరియట్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని మీరు ముందు తెలుసుకోండి. అది తెలుసుకుంటే ఈ సమస్యే ఉండదు. సెక్రటరీ చెప్పింది విని మంత్రిగా డిఫర్ అవుతామా లేక సంతకం చేస్తే డిక్రీ అవుతామా.. కార్యదర్శి, మంత్రి.. ఇద్దరూ భిన్నాభిప్రాయం ప్రకటించాక సెక్రటరీ ఏ నిర్ణయం తీసుకోవచ్చు. దానిపై మంత్రి బాధ్యత ఏమిటి? ఆ విషయం సీఎం వరకు వెళితే ఆయన బాధ్యత ఏమిటి? కేబినెట్‌లో ఆమోదించిన తర్వాత ఎందుకు నిర్ణయం తీసుకున్నాము అని నోట్ రాస్తారా లేదా. నిర్ణయానికి కారణాలు రాస్తారా, రాయరా? అనే అంశాలను ముందుగా తెలుసుకోండి’ అని సీబీఐ వాళ్లకి చెప్పాను. రాఘవేంద్రరావు అని నాదగ్గర పర్సనల్ సెక్రటరీ ఉండేవారు. ఆయన్ని పిలిపించి సెక్రటేరియట్ రూల్స్ అన్నీ ఆయన ద్వారా సీబీఐకి చెప్పించాను కూడా.
మరి జగన్‌పై ఇలాంటి కేసులు పెట్టారు.. నిలుస్తాయంటారా?
ఇవేవీ నిలబడవు. అందరికీ తెలిసిన విషయమే ఇది. నిలబడవనే తేలుతోంది.
జగన్ తొందరపడి పార్టీ పెట్టకపోయి ఉంటే ఈ గొడవలన్నీ వచ్చి ఉండేవి కావు కదా?
నాన్న తాలూకు ప్రభావం, పలుకుబడి ఉన్నాయి. పైగా అనివార్య పరిస్థితి ముందు కొచ్చింది కాబట్టే పెట్టారు. కోఆర్డినేట్ చేసే మధ్యవర్తులు కూడా సరిగ్గా వ్యవహరిం చలేదు. జరుగుతున్న వాస్తవాలను చెప్పి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.
సీనియర్ల పట్ల జగన్ ఎలా ఉంటారు? ఈ విషయంపై ఆరోపణలు ఉన్నాయి కదా?
సీనియర్ల పట్ల ఆయన ఎలా ఉంటారు అనేది ముఖ్యం కాదు. పార్టీ పట్ల మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఆయన పార్టీ ప్రెసిడెంట్, మనం కార్యకర్తలం. ఆయన వద్దకు వెళ్లినప్పుడు మన మైండ్‌సెట్ మార్చుకోవాలి. ఎవరు కలిసినా జగన్ అన్నా అనే పిలుస్తారు. పార్టీ అధ్యక్షుడి మాటలు మనం వినాలా లేక మన మాటలు ఆయన వినాలా? మేము చెప్పాము, ఆయన వినలేదు అని సమావేశం ముగిసిన తర్వాత అంటే ఏం బాగుంటుంది? నాలాంటోళ్లు అభిప్రాయాలు చెబుతారు. పది చోట్ల నుంచి వస్తాయి. వాటిని ఆలోచించి డిసైడ్ చేయాల్సింది అధ్యక్షుడే కదా.. ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఆయన చేసింది ఇదే.
వైఎస్సార్‌సీపీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటారు?
పార్టీ పరిస్థితి ఎలా ఉందని మనం చెప్పడం కాదు. ప్రజలే చెబుతారు. చెబుతున్నారు కూడా. మొత్తం చేస్తోంది తెలుగుదేశమే కదా.. తొమ్మిదేళ్లు గతంలో సీఎంగా పనిచేసిన చంద్రబాబేనా ఈ చంద్రబాబు అని నాకే అనుమానం వస్తోంది. ఆ చంద్రబాబు మాయమై కొత్త చంద్రబాబు వచ్చాడా.. అంత తేడా వచ్చింది ఆయనలో ఇప్పుడు.
మరి శాశ్వతంగా అధికారంలో ఉంటానని బాబు చెబుతున్నారు కదా?
అంత సీన్ లేదు లెండి. చెప్పిన మాటను చేస్తేనే రాజకీయాల్లో విలువ. చెప్పినదానికన్నా ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తే, మేలు చేకూ రిస్తే ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది. అంతేగానీ తెల్లవారి లేస్తే ఒకే సింగిల్ పాయింట్ ఫార్ములా లాగా
దోపిడీ, దోపిడీ , దోపిడీ అని చేసు కుంటూపోతే విలువ ఎక్కడుంటుంది?
ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ పరిస్థితి ఎలా ఉంది?
చిన్న చిన్న విషయాల్లో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, దోపిడీ. ప్రభుత్వం నడుస్తున్న తీరు చూస్తే 2004, 2009 ఎన్నికల్లో వైఎస్‌ఆర్ ఉత్తరాంధ్రలో తీసుకొచ్చిన ప్రభంజనం 2019లో వైఎస్సార్సీపీ మళ్లీ సృష్టిస్తుంది.
పవన్ కల్యాణ్ వల్ల మీ పార్టీ అవకాశాలు దెబ్బతింటాయంటున్నారే?
రాజకీయాల్లో ఏదీ కాదనలేం. కానీ ఎవరు వచ్చినా, ఏం చేసినా.. మనం మనగలగ డానికి మనలో ఆత్మ విశ్వాసం ఉండాలి. ఎవరో వస్తారు అంటే వస్తారు. వాళ్లని ఆప డానికి మన వ్యూహాలు మనకు ఉంటాయి కదా. అలా వస్తున్న వాళ్లు ఒక వ్యూహం పన్నితే మనం ఇంకా ఎక్కువ వ్యూహాలు వేసుకోవాలి. అదే రాజకీయం అంటే.
గతంలో కాపులు పవన్‌కు సపోర్ట్ చేసినందుకే బాబుకు మేలు జరిగిందంటున్నారు?
ఆరోజు తెలుగుదేశం పార్టీ గెలవడానికి చాలా కారణాలున్నాయి. బీజేపీతో పొత్తు, సెలబ్రిటీగా పవన్ వచ్చి ప్రచారం చేస్తే టీడీపీ గెలిచింది తప్ప వ్యక్తితో కాదు. రేపు ఏం జరుగుతుంది, జరగనుంది అని ఇప్పుడే మనం ఊహించలేం. ఏది అడ్డొచ్చినా అన్ని టినీ అధిగమించే ప్రయత్నం చేయాలి తప్ప ఒకరు కలుస్తారు, కలవరు అనేది ముఖ్యం కాదు. ఎవరైనా కలిస్తే అది బోనస్.
కాపు సామాజిక వర్గం ఎలా ఆలోచిస్తోంది?
కాపు సామాజిక వర్గం పూర్తిగా మోసపోయింది. చంద్రబాబు మాటలగారడీలో పడి మోసపోయింది. మంత్రి పదవులు ఇచ్చాం. కార్పొరేషన్ పెట్టాం, వెయ్యి కోట్లు ఇచ్చాం అని చెప్పడం కాదు. కార్పొరేషన్ పెట్టి ఇంతవరకూ ఎంత ఖర్చుపెట్టావు? ఎంతమంది కాపులకు లబ్ధి చేకూరింది? ఇదీ ముఖ్యం. మీవద్ద పదవులు తీసుకున్న మంత్రులు వారి సామాజిక వర్గానికి ఏం మేలు చేశారు? పదవులు తీసుకుని అనుభవిస్తూ మీ వర్గానికి ఇబ్బంది వచ్చినప్పుడు కనిపించకుండాపోతే ఎలా?
ప్రత్యేకించి ముద్రగడ పట్ల వ్యవహరించిన తీరుపై కాపులు ఏమనుకుంటున్నారు?
అవమానం కాదా.. దీక్షకు పూనుకుంటే ముద్రగడనే కాదు ఆయన వర్గం మొత్తాన్ని హౌస్ అరెస్టు చేస్తారు. రాష్ట్రంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది.
రాష్ట్రంలో పాలన ఎలా ఉందనుకుంటున్నారు?
ఇవ్వాళ రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగం ద్వారా జరగలేదు. దోపిడీ సామాజిక వర్గ పాలన జరుగుతోంది. కులం పేరిట పాలన. గత 35 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పడూ ఇలాంటి కులం ప్రాతిపదికన జరిగే పాలనను చూడలేదు. చివరకు రాష్ట్రంలోని సంపన్న జిల్లాల్లో కూడా అభివద్ధి పూర్తిగా స్తంభించిపోయింది. గెలవగానే ఆ జిల్లాలకు ఏమి స్తానో చూడండని చంద్రబాబు జాబితాలు పట్టుకుని మరీ చెప్పారు. ఆ జాబితాలను ముందు పెట్టుకుని చూస్తే ఏ జిల్లాలో ఏం జరిగిందో తెలిసిపోతుంది.
(బొత్స సత్యనారాయణతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)