ఎలాంటి నేతలు రావాలి? | Opinion on student leaders in politics by Devulapalli Amar | Sakshi
Sakshi News home page

ఎలాంటి నేతలు రావాలి?

Published Wed, Mar 9 2016 12:30 AM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

ఎలాంటి నేతలు రావాలి? - Sakshi

ఎలాంటి నేతలు రావాలి?

డేట్‌లైన్ హైదరాబాద్
రాజకీయాలు లేకుండా, సమాజం పట్ల ఒక సక్రమ అవగాహన లేకుండా పోతే జస్టిస్ రమణ చెపుతున్నట్టు మంచి నాయకులు తయారుకాలేరు. ఓ వైపు దేశంలో జార్జ్‌రెడ్డి నుంచి కన్హయ్య కుమార్ దాకా విద్యాలయాల నుంచి మంచి నాయకులుగా తయారై రావాలని ఎట్లా చూస్తున్నారో, మరో వైపు అందుకు పూర్తి భిన్నంగా జస్టిస్ రమణ ఆవేదనకు నిదర్శనంగా ఓ కొత్త నాయకత్వం తయారవుతున్నదీ దేశంలో. అటువంటి వారికి సమాజంతో సంబంధం లేదు, వారసత్వంగా వచ్చే అధికార అహంకారం తప్ప.
 
 కృష్ణా జిల్లా కంచికచర్లలో నాలుగు రోజుల కిందట ఒక పాఠశాల 68వ వార్షికోత్సవానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ముఖ్య అతిథిగా హాజరయినప్పుడు నేటితరం విద్యార్థులలో సామాజిక స్పృహ కోరవడుతున్న కారణంగా దేశానికి సరైన నాయకులు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మన చదువులనీ, వాటి వెనక వెర్రెత్తినట్టు పరుగులు తీస్తున్న విద్యార్థులనీ, వాళ్ల తల్లిదండ్రుల ధోరణినీ, వేకువ నాలుగు గంటల నుంచి రాత్రి ఏ 11 గంటల దాకానో పుస్తకాల్లో దూరి ఉండి పోయే విద్యార్థులనూ గమనిస్తే ఎవరికైనా జస్టిస్ రమణకు కలిగిన అభిప్రాయమే కలుగుతుంది. రమణగారు ఇంకొన్ని మంచి మాటలు కూడా చెప్పారు. తాను  చదువుకునే రోజులలో  సామాజిక అంశాలు, వర్తమాన సంఘటనల మీద పాఠశాలల్లో విద్యార్థుల మధ్య చర్చలు జరిగేవనీ, ప్రస్తుతం సామాజికాంశాల మీద విద్యార్థులకు అవగా హన కొరవడి స్పందన లేకుండా పోతున్నదనీ ఆయన బాధపడ్డారు.

డాక్టర్లూ, ఇంజనీర్లూ, శాస్త్రవేత్తలూ తయారవుతున్నారు కానీ, మంచి నాయకులు తయారు కావడం లేదన్నారు జస్టిస్ రమణ. ఇది ఆయన ఒక్కరి అభిప్రాయం కాదు. రాజకీయ వ్యవస్థతో సంబంధం లేకుండా దాని వెలుపల ఉన్న అనేకమంది కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. గడచిన రెండుమాసాలుగా భారతదేశం ఒక అవాంఛనీయ, పరస్పర విద్వేషపూరిత, వర్గ వైషమ్యాల వలలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవు తున్న సమయంలో, రాజకీయ వ్యవస్థ ఉన్నత విద్యాసంస్థలను అందుకు ఆటస్థలాలుగా ఎంచుకున్న సమయంలో ఆయన ఈ మాటలు చెప్పారు. చదువు అనేది కేవలం డాక్టర్లనూ, ఇంజనీర్లనూ తయాదుచేసేదిగా కాకుండా మనిషి మనోవికాసానికి, సమాజం పట్ల ఒక సమున్నతమయిన అవగాహన కల్పించడానికి తోడ్పడేది అయి ఉండాలని కోరుకునే వారంతా ఇవాళ జస్టిస్ రమణ లాగానే ఆలోచిస్తున్నారు. సమాజం పురోగమిస్తున్న క్రమంలో మనిషి ఆలోచనలూ, అవగాహనా మారాలి. కానీ చదువుల పట్ల, విద్యాలయాల పట్ల కొన్ని వ్యవస్థలు, సంస్థల ఆలోచన ఎన్ని తరాలు గడిచినా మారదు. వాళ్లు-జస్టిస్ రమణ లాంటి వారు విద్యాలయాలలో ఏది లేదని బాధ పడుతున్నారో అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండటానికి వీల్లేదని వాదిస్తున్న వాళ్లు.
 
యువత పయనం ఎటు?
 మన యువత ఎట్లా ఆలోచిస్తున్నది, ఎటువైపు నడుస్తున్నది? ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నది? సమాజం పట్ల దాని అవగాహన ఏమిటి? అన్న చర్చ జరుగుతున్న ఈ సమయంలో గత రెండు మాసాలలో దేశంలోని రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు తీవ్ర అలజడికీ, ఆందోళనకూ గురయ్యాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ అనే విద్యార్ధి ఆత్మహత్య, అంతకు ముందు, ఆ తరువాత జరిగిన సంఘటనలు, వీటి కొనసాగింపుగా ఢిల్లీలోని మరో ప్రతిష్టాత్మక విద్యాలయం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో జరిగిన ఆందోళన, తదనంతర పరిణామాలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సరిగ్గా ఇదే సమయంలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాదాపు 45 ఏళ్ల క్రితం హత్యకు గురైన యువ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితచరిత్రను ప్రచురించింది. అన్యాయాన్నీ, సమాజంలోని హెచ్చుతగ్గులనీ ఎదుర్కొనే క్రమంలో 25 ఏళ్ల  జార్జ్‌ని క్యాంపస్‌లోనే చంపేశారు.

ఆనాడు జార్జ్ హత్యకు కారకు లయిన వాళ్లూ, మొన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో ప్రతిభావంతుడైన రీసెర్చ్ స్కాలర్ రోహిత్‌ను ఆత్మహత్య వైపు బలవంతంగా నెట్టిన వాళ్లూ, దాని కొనసాగింపుగా ఢిల్లీ  జేఎన్‌యూలో విద్యార్థి సంఘ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను దేశద్రోహి అని నిందించి రాజద్రోహ నేరం కింద జైలుకు పంపించాలని పట్టుబట్టిన వాళ్లూ, ఆ పని చేయించిన వాళ్లూ అందరూ ఒకే భావజాలానికి చెందినవారు. సరిగ్గా ఈ సమయంలో జార్జ్ జీవితం మీద అంత సమగ్రం కాకపోయినా కొంత యినా వివరించే ఒక పుస్తకం రావడం కాకతాళీయమే కావచ్చు. కానీ సరైన సమయానికే వచ్చిందని అనుకోవాలి. ఆనాడు జార్జ్‌రెడ్డి అయినా, ఇప్పటి రోహిత్, కన్హయ్య కుమార్ అయినా రమణ గారు చెప్పిన ఆ సామాజిక స్పృహను కాపాడుకునే ప్రయత్నంలోనే ఇబ్బందులు పడ్డారు. వర్తమాన సమాజం స్థితిగతుల మీద విద్యార్థులకు అవగాహన ఉండాలి కనుకనే, విద్యాలయాల్లో వీటి మీద చర్చ జరగాలని కోరుతున్నారు కనుకనే హత్యలకు గురవుతున్నారు. ఆత్మహత్యల వైపు నెట్టబడుతున్నారు. రాజద్రోహం నేరారోపణ మీద కారాగారాల పాలవుతున్నారు. విద్యాసంస్థలలో ఏ వాతావరణం ఉండాలని జస్టిస్ రమణ వంటి పెద్దలు కోరుతున్నారో వీళ్లంతా అటువంటి ఆలోచనలను ముందుకు తీసుకుపోతున్నవారే.

 కొత్తతరం నేతలు ఎక్కడ?
 భారతదేశం నుంచి కాకుండా భారతదేశంలోనే తనకూ, తనలాంటి ఎంతో మందికీ స్వేచ్ఛ కావాలని కోరుతున్నవాడు కన్హయ్య కుమార్. అయితే ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరతాడో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆయనను ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు నెట్టాలని చూస్తున్న పెద్దలకు కన్హయ్య కుమార్‌కు  రాజకీయాలు ఉండడం మాత్రం ఇష్టం లేదు. రాజకీయాలు లేకుండా, సమాజం పట్ల ఒక సక్రమ అవగాహన లేకుండా పోతే జస్టిస్ రమణ చెపుతున్నట్టు మంచి నాయ కులు తయారుకాలేరు. ఓ వైపు దేశంలో జార్జ్‌రెడ్డి నుంచి కన్హయ్య కుమార్ దాకా విద్యాలయాల నుంచి మంచి నాయకులుగా తయారై ఎట్లా రావా లని చూస్తున్నారో, మరోవైపు అందుకు పూర్తి భిన్నంగా, జస్టిస్ రమణ ఆవేదనకు నిదర్శనంగా ఓ కొత్త నాయకత్వం తయారవుతున్నదీ దేశంలో. అటువంటి వారికి సమాజంతో సంబంధం లేదు, వారసత్వంగా వచ్చే అధికార అహంకారం తప్ప.  మన దేశంలో ఇప్పుడు ఎటువంటి నాయ కులు చట్ట సభలలోకి వస్తున్నారు, వారు ఎటువంటి వారసులను తయారు చేసే పనిలో పడ్డారు అనే సంగతి చెప్పడానికి బోలెడు ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

గతవారం రోజులలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు రాజకీయ నాయకుల ఉదంతాలే అందుకు తాజా ఉదాహరణ. వారిలో ఒకరు పేర్గాంచిన నట, రాజకీయ దిగ్గజానికి రెండింటా వారసుడు కాగా, మరొకరు కొత్తగా రాజకీయాల రుచి తెలిసిన నాయకుడి కాబోయే వారసుడు.  ఒకాయన నందమూరి బాలకృష్ణ అయితే, మరొక రు రావెల సుశీల్‌బాబు. నందమూరి బాలకృష్ణ ఎన్‌టీ రామారావు నట వారసుడే కాదు, బయటికి చెప్పక పోయినా ఎప్పుడో అప్పుడు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఉన్న నాయకుడు కూడా. ప్రస్తుతం శాసనసభ్యుడి పదవితో సరిపెట్టుకుని అధికార పార్టీకి పెద్ద ఆకర్షణగా నిలబడ్డవాడు. ఒక సినిమా ఫంక్షన్‌లో స్త్రీల పట్ల అతి జుగుప్సాకర వ్యాఖ్యలు చేసి అందరూ తిట్టేసరికి తప్పు ఒప్పుకుని క్షమా పణలు చెప్పారు. ఆయన వంటి వారిని ఆదర్శంగా తీసుకుని పట్టపగలు హైదరాబాద్ నడివీధిలో ఒక యువతి పట్ల అభ్యంతరకరంగా వ్యవహ రించి సుశీల్ జైలుకు వెళ్లారు. బావమరిది బాలకృష్ణ చేసిన దానికి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నోరెత్తి ఒక్కమాట కూడా అనరు. కొడుకు సుశీల్ చేసిన దాన్ని తండ్రి, మంత్రి రావెల కిశోర్‌బాబు సమర్థించుకుంటారు. మంచి నాయకులు తయారుకావడంలేదని ఆందోళన చెందడానికి ఇటు వంటి నాయకుల చేష్టలే కారణం. విశ్వవిద్యాలయాలలో రాజకీయాలు ఎందుకు అంటున్నవాళ్లు, రాజకీయాలలో ఈ కీచకపర్వం ఏమిటి అని మాత్రం ప్రశ్నించరు. కన్హయ్య కుమార్ వంటివారిని జైల్లో పెట్టాలంటారు. రావెల సుశీల్ వంటి వారిని వెనకేసుకొస్తారు, కాపాడే ప్రయత్నం కూడా చేస్తారు.
 

విద్యార్థులకు రాజకీయాలు వద్దా!
 విద్యార్థులకు రాజకీయాలు వద్దు, విశ్వవిద్యాలయాలలో చదువు తప్ప ఇంకొకటి ఉండకూడదు అనే వాళ్లు ఉన్నంతకాలం జార్జ్‌రెడ్డి లాంటి వాళ్ల హత్యలు జరుగుతాయి. రోహిత్‌లు ఆత్మహత్యలు చేసుకుంటారు. కన్హయ్యలు రాజద్రోహ నేరం కింద జైలుకు వెళుతూనే ఉంటారు. రాజకీయాలలో వారసుల ఆగడాలను ఇట్లా మనం చూస్తూనే ఉంటాం.

(వ్యాసకర్త : దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement