ఎవరికీ పట్టని రెండు రంగాలు | opinion on telugu states educational and medical sector by devulapalli amar | Sakshi
Sakshi News home page

ఎవరికీ పట్టని రెండు రంగాలు

Published Wed, Jul 27 2016 2:18 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

ఎవరికీ పట్టని రెండు రంగాలు - Sakshi

ఎవరికీ పట్టని రెండు రంగాలు

ప్రధానమంత్రి మోదీ మొదలు మన ముఖ్య మంత్రి దాకా అందరూ స్వచ్ఛ భారత్ గురించే మాట్లాడతారు. ఈ మధ్య దానికోసం ప్రత్యేక పన్ను కూడా వేస్తున్నారు.

 డేట్‌లైన్ హైదరాబాద్
 
ప్రధానమంత్రి మోదీ మొదలు మన ముఖ్య మంత్రి దాకా అందరూ స్వచ్ఛ భారత్ గురించే మాట్లాడతారు. ఈ మధ్య దానికోసం ప్రత్యేక పన్ను కూడా వేస్తున్నారు. రాష్ట్రాలకు నిధులు కూడా ఇస్తున్నారు. ఇళ్లూ, కార్యాలయాలూ, వీధుల మాట అలా ఉంచండి. కనీసం ఆస్పత్రులయినా శుభ్రంగా ఉండవేంటి? ఈ డబ్బంతా ఎక్కడికి పోతున్నట్టు అని ప్రశ్నించుకుంటే, మళ్లీ అవినీతి దగ్గరికే వస్తాం. మన ప్రభుత్వ ఆస్పత్రులను శుభ్రంగా ఉంచే పనిని ప్రభుత్వాలు బయటివాళ్లకు కాంట్రాక్ట్‌కు ఇస్తాయి.
 
 తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కొంతకాలంగా విద్య, వైద్యసేవలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వరంగం ఈ రెండు విషయాలలో తీవ్ర విమర్శలకు గురవుతున్నది. కార్పొరేట్ వైద్యాన్ని ప్రోత్సహించడానికే ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తు న్నాయని ఎవరికీ విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో విధంగా ప్రజలకు వైద్యం అందించే బాధ్యతను పూర్తిగా వదిలించుకుంటే బాగుంటుందనే ప్రభుత్వాల భావన. ఎందుకంటే వాళ్లు తలపెట్టిన పెద్ద పెద్ద పనుల ముందు విద్య, వైద్యం చాలా అల్పమైనవి. విద్య ఇప్పటికే పూర్తి ప్రైవేట్ పరం అయింది. ఇటీవల లోక్‌సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మేకపాటి రాజమోహనరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సంబంధిత మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

గత ఐదేళ్లకాలంలో తెలంగాణ లో 2,501 పాఠశాలలు మూతబడ్డాయనీ, ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో 879 పాఠశాలలు మూత బడ్డాయనీ దాని సారాంశం. ఎందుకంటే ప్రవేశాల నమోదు ఆధారంగా పాఠ శాలల హేతుబద్ధీకరణ వల్ల ఇన్ని పాఠశాలలు మూతబడ్డాయనీ, అయితే ఇందువల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయనీ సదరు మంత్రి చెప్పారు. పాఠశాలలు మూతబడటానికి రాష్ట్రాలు ఇచ్చిన కారణాలను పార్లమెంట్‌లో మంత్రిగారు వివరించిన తీరు పిల్లి అంటే మార్జాలం అని అర్థం చెప్పినట్టే ఉంది. మనం మామూలుగా అర్థం చేసుకునేది ఏమిటంటే తగిన లేదా నిర్ణీత సంఖ్యలో పిల్లలు చేరకపోతే ఉన్న పిల్లలను వేరే పాఠశాలకు తరలించి దీన్ని మూసేస్తారు. ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి, విద్యార్థుల సంఖ్యను బట్టి ఇటువంటి నిర్ణయాలు తీసు కుంటాయి ప్రభుత్వాలు. దీనినే బహుశా కేంద్ర మంత్రిగారు పాఠశాలల హేతుబద్ధీకరణ అని నిర్వచించి ఉంటారు. అదీ కాకుండా ఇంకో అర్థం ఏమ యినా ఉంటే తెలుగు రాష్ట్రాల విద్యాశాఖల అధికారులో, మంత్రులో వివ రణ ఇవ్వవచ్చు.
 
కేజీ నుంచి పీజీ ఏమైంది?
తెలంగాణ  రాష్ర్ట సాధన కోసం ఉద్యమం జరుగుతున్న కాలంలో చంద్రశేఖర్ రావు తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకూ మొత్తం చదువు బాధ్యత ప్రభు త్వానిదేనని ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు గడిచింది. ఇప్పటివరకు ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. పైగా నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్టు తయారయింది తెలంగాణలో ప్రభుత్వ విద్య. విద్యా శాఖలో ఏం జరుగుతున్నదో ఒకసారి ముఖ్యమంత్రి దృష్టి పెడితే చాలా విష యాలు బయటికొస్తాయి. ఆయన ప్రాధాన్యతల్లో విద్య లేని కారణంగా ఆ శాఖలో కొందరు ఆడింది ఆట అన్నట్టు తయారయింది. ఒకటి రెండు ఉదాహ రణలు చాలు ప్రభుత్వ విద్య పరిస్థితి ఏమిటో చెప్పడానికి.

తెలంగాణలో పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రహసనం మొదటిదయితే, నిన్నగాక మొన్న బయ టపడ్డ  తెలంగాణ  ఎంసెట్ -2 ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం రెండోది. అర్హత లేని ముద్రణ సంస్థకు మళ్లీ మాట్లాడితే బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థకు పాఠ్య పుస్తకాల ముద్రణ పని అప్పచెప్పడం కోసం మూడుసార్లు టెండర్‌లు రద్దు చేసి అర్హులయిన ప్రింటర్‌లకు పని దక్కకుండా చేసి, విద్యార్థ్ధులకు పుస్తకాలు చేరడంలో జాప్యానికి కారకులయిన వారిని గురించి ప్రభుత్వం పట్టించు కోదు. ఎంసెట్ -2కు సంబంధించి పరీక్ష పత్రాలు లీక్ అయిన విషయం తన దృష్టికి వస్తే విద్యాశాఖ మంత్రి ఇదంతా కట్టుకథ లేదా మీడియా సృష్టి అంటారు. నిజంగానే ఏదో జరిగిందని అర్థం అయ్యాక వైద్యవిద్యకు సంబం ధించింది కనక ఆ శాఖ  మంత్రి దీనిమీద స్పందిస్తారని తప్పుకుంటారు. ముఖ్యమంత్రి స్వయంగా కఠిన చర్యలు ఉంటాయని ప్రకటించాక కానీ సీఐడీ విచారణ మొదలుపెట్టలేదు. విద్యారంగం ఇంత గందరగోళంలో ఉంది. ప్రభుత్వం ఆ వైపు, ముఖ్యంగా పాఠశాల విద్య పైన దృష్టి పెడితే మంచిది.
 ఇక వైద్యరంగం విషయానికి వస్తే, సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో రెండువారాల క్రితం జరిగిన సంఘటన, గాంధీ ఆస్పత్రిలో మరణాలకు సంబంధించి వస్తున్న వార్తలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. బోలెడు వాస్తవాలు బయటికొస్త్తున్నాయి. దశాబ్దాలుగా పాతుకుపోయిన కొన్ని వ్యవస్థలను తక్షణం ప్రక్షాళనం చెయ్యాల్సిన అవసరం ఉందని ఈ ఉదంతాలు చె బుతున్నాయి.
 
వైద్యరంగం దుస్థితి
సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో రోగుల కళ్లు శుభ్రం చేసే ద్రావకం కారణంగా కొంతమంది చూపు కోల్పోయారు. అది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దవా ఖానా. ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికే వచ్చి తమ సమస్యలకు చికిత్స, లేదా శస్త్ర చికిత్సలు చేయించుకున్న సందర్భాలున్నాయి. నిపుణులయిన వైద్య బృందం కూడా ఉంది. మరి లోపం ఎక్కడ జరిగింది అంటే ఆ ఆస్పత్రికి సరఫరా చేసిన ఆ ద్రావకం కారణం. ప్రభుత్వ ఆస్పత్రులకు కావలసిన వైద్య సంబంధమయిన సామగ్రి, మందులు సరఫరా చెయ్యడానికి ఒక సంస్థ ఉంటుంది. దానికో అధ్యక్షుడు ఉంటారు. కార్పొరేషన్‌లు అన్నిటి వలెనే ఈ సంస్థకు కూడా రాజకీయ నియామకం ద్వారానే ప్రభుత్వాలు అధ్యక్షులను నియమిస్తుంటాయి. వాళ్లకు ైవైద్య పరికరాలు, ఔషధాలు, పరికరాలకు సంబంధించిన కనీస పరిజ్ఞానం కూడా ఉండవు. అటువంటి అధ్యక్షుల పర్య వేక్షణలో పనిచేసే సిబ్బంది పై నుంచి కింది వరకూ ఈ రంగంతో ఎటువంటి సంబంధమూ లేనివారే. ఔషధాల నాణ్యత, పరికరాల నాణ్యత తెలిసిన ప్రత్యేక అర్హతలు కలిగిన వారిని కాకుండా సాధారణంగా ప్రభుత్వాలు ఈ పని ఇంజనీర్‌లకు అప్పగిస్తుంటుంది. ఔషధ తయారీ సంస్థలతో బేరసారాలు వీరే బాగా చేయగలరన్న నమ్మకం. ఏటా కొన్నివేల మంది మన రాష్ర్టం లోని ఫార్మసీ కళాశాలలలో చదువుకుని బయటికొచ్చి నిరుద్యోగులుగా ఉండి పోతున్నారు. వాళ్లు చెయ్యాల్సిన ఈ పనిని వైద్యంతో, ఔషధాలతో ఏమీ సంబంధం లేనివారు చేస్తున్నందున ఈ అనర్థాలు జరుగుతున్నాయి. అవి నీతికి మారుపేరుగా నిలిచిన ఈ కార్పొరేషన్ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం కట్టకపోతే సరోజినీదేవి ఆస్పత్రిలో జరిగినటు వంటి ఘటనలు ఇంకా తీవ్రమై ప్రజల ప్రాణాలకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది.
 

పరిశుభ్రత పగటి కలేనా?
 మన ప్రభుత్వ ఆస్పత్రులు శుభ్రంగా ఎందుకుండవు? ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఎందుకు అంత తళతళలాడుతుంటాయి? అన్న ప్రశ్న మనం చాలాసార్లు వింటుంటాం. ప్రధానమంత్రి మోదీ మొదలు మన ముఖ్య మంత్రి దాకా అందరూ స్వచ్ఛ భారత్ గురించే మాట్లాడతారు. ఈ మధ్య దానికోసం ప్రత్యేక పన్ను కూడా వేస్తున్నారు. రాష్ట్రాలకు నిధులు కూడా ఇస్తున్నారు. ఇళ్లూ, కార్యాలయాలూ, వీధుల మాట అలా ఉంచండి. కనీసం ఆస్పత్రులయినా శుభ్రంగా ఉండవేంటి? ఈ డబ్బంతా ఎక్కడికి పోతున్నట్టు అని ప్రశ్నించుకుంటే, మళ్లీ అవినీతి దగ్గరికే వస్తాం. మన ప్రభుత్వ ఆస్ప త్రులను శుభ్రంగా ఉంచే పనిని ప్రభుత్వాలు బయటివాళ్లకు కాంట్రాక్ట్‌కు ఇస్తాయి. కాంట్రాక్టర్‌ల నుంచి కాంట్రాక్టర్‌లు, వాళ్ల చేతులలో నుంచి ఇంకా చిన్న కాంట్రాక్టర్‌ల చేతులలోకి వెళ్లి, చివరికి ఓ 150 మందితో చేయించాల్సిన ఈ శుభ్రతా కార్యక్రమం పదిమందికో పదిహేను మందికో పరిమితమై ప్రభుత్వ ఆస్పత్రులు మురికివాడలను గుర్తు చేస్తుంటాయి. ప్రజాధనం కాంట్రాక్టర్‌ల పాలైపోతున్న విషయం బహిరంగ రహస్యమే. ఆస్పత్రులలో ఎక్స్‌రేలకు ఫిల్మ్‌లు ఉండవు. సర్జరీ చేస్తుండగా కరెంట్ పోతే ఆ కొద్ది సేపయినా మొబైల్ ఫోన్‌ల  లైట్ల వెలుగు సహాయం తీసుకుంటారు వైద్యులు. ఇది హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక గాంధీ ఆస్పత్రిలో జరుగుతున్న తంతు. దీనిమీద ఇటీవల మీడియా వెలువరిస్తున్న వాస్తవాల చరిత్ర.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గరలోని గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రులలో అయితే పసికందులను చీమలు కుట్టి చంపుతాయి, ఎలుకలు కొరికి చంపుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్యం దుస్థితి గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం.
 
విద్యా, వైద్య రంగాలకు పట్టిన ఈ మురికిని వదిలించడానికి ప్రభుత్వ పెద్దలు పై నుంచి కింది దాకా ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టకపోతే బంగారు తెలంగాణ భవిష్యత్తు ప్రశ్నార్థకమే. ఇటువంటప్పుడే మన కాలపు తత్వవేత్త బాలగోపాల్ మాటలు మళ్లీ మళ్లీ జ్ఞాపకం వస్తాయి-అభివృద్ద్ధి అంటే బడుగువర్గాల సంక్షేమమే అని. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేది ఆ వర్గాలే.

(వ్యాసకర్త : దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement