రద్దు ఒక్కటే సరిపోదు! | speeching is narendra modi strength | Sakshi
Sakshi News home page

రద్దు ఒక్కటే సరిపోదు!

Published Sun, Dec 4 2016 1:12 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

రద్దు ఒక్కటే సరిపోదు! - Sakshi

రద్దు ఒక్కటే సరిపోదు!

త్రికాలమ్
 
రాజకీయ నాయకులకు వాగ్ధాటి గొప్పవరం. తక్కిన అర్హతలతోపాటు ఇది అదనపు అర్హతగా రాణిస్తుంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రభావవంతమైన వక్త. రెండున్నర సంవత్సరాల కిందట సార్వత్రిక ఎన్నికలలో కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకూ అనేక సభలలో ఆయన చేసిన ప్రసంగాలూ, ఒక్కచేతి మీదిగా సాగించిన ప్రచారం జనహృదయాలను దోచుకున్నాయి. ప్రతిమాటనూ ప్రజలు ఆస్వాదించారు. ప్రతి వాగ్దానాన్నీ విశ్వసించారు. ఓట్లు వేసి గెలిపించి అధికారం అప్పగించారు. అనంతరం శ్రీవారి విన్యాసాలు బుల్లితెరమీద తిలకిస్తున్నారు.
 
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ముప్పయ్ మాసాలు గడిచినా మోదీ వాక్పటిమ సుతరామూ తగ్గలేదు. ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ పరివర్తన సభలో మోదీ  ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగించారు. సభికులను సమ్మోహితులను చేశారు. తాను భ్రష్టాచారాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయనీ, తనను పాపిగా చిత్రిస్తున్నాయనీ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయనీ ఆరోపిం చారు. సభికులు పెద్దగా హర్షామోదాలు వెలిబుచ్చారు. ప్రధానితో గొంతు కలిపి నినాదాలు చేశారు. సభ ముగిసిన వెంటనే ప్రధాని హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్ళారు. స్థానిక బీజేపీ నాయకులు సమీకరించిన సభికులు ఏటిఎంల ఎదుట క్యూలో చేరిపోయారు. ఇదే ఆఖరి క్యూ అంటూ మోదీ చేసిన వాగ్దానం గురించి మాట్లాడుకుంటున్నారు.
 
‘శక్తిమంతుల దృష్టిలో ప్రత్యర్థులు చేసినవే నేరాలు’ అంటూ నామ్ చోమ్‌స్కీ న్యూయార్క్‌లోని ట్రేడ్ సెంటర్‌పైన అల్‌ఖాయిదా అఘాయిత్యం తర్వాత సంభవించిన పరిణామాలను విశ్లేషిస్తూ వ్యాఖ్యానించారు (ఇంపీరి యల్ యాంబిషన్స్-కాన్వర్సేషన్స్ ఆన్ ది పోస్ట్ 9/11 వరల్డ్). అది అగ్ర రాజ్యాన్ని అధిక్షేపిస్తూ చేసిన వ్యాఖ్య అయినప్పటికీ శక్తిమంతులై న రాజకీయ నేతలకూ వర్తిస్తుంది. దేశాన్ని డెబ్బయ్‌ఏళ్ళుగా (ఇందులో వాజపేయి నాయ కత్వంలోని మొదటి ఎన్‌డిఏ సర్కార్ పాలించిన ఆరేళ్ళు ఉన్నాయి) పట్టి పీడిస్తున్న వ్యాధిని నిర్మూలించడంలో సహకరించండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవస్థను ప్రతిపక్షాలు మాత్రమే భ్రష్టుపట్టించినట్టూ, అధికార పక్షానికి కానీ దాని మిత్రపక్షాలకు కానీ ఏ మాత్రం ప్రమేయం లేనట్టూ ప్రధాని మాట్లాడటం విడ్డూరం. ఈ విధంగా మాట్లాడటం వెనుక ఉద్దేశం ఏమిటి? ఆర్థిక వ్యవస్థపై మెరుపుదాడి గురించి పార్లమెంటులో ప్రధాని వివరించాలంటూ రెండువారాలుగా సాగుతున్న ప్రతిపక్ష ఘోషను ఆలకించని ప్రధాని మన్‌కీ బాత్‌లో, పరివర్తన (ఎన్నికల) సభలలో మాత్రం విధాన నిర్ణయాలపైన ఏక పక్షంగా నిరాఘాటంగా, శరాఘాతంగా మాట్లాడుతున్నారు.

పార్లమెంటులో మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడు నేలను ముద్దాడి అత్యున్నత ప్రజా స్వామ్య మందిరానికి వందనం చేసిన మోదీ ఇప్పుడు దానిపైనే శీతకన్ను వేశారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడరు. టెలివిజన్ ఇంటర్వ్యూలు ఇవ్వరు. మేధావులను కానీ ఆర్థికశాస్త్రవేత్తలను కానీ సంప్రదించరు. ప్రతిపక్షాలతో సమా లోచన జరపరు. పార్లమెంటులో మాట్లాడరు. తాను పత్రికలపైనా, టెలివిజన్ చానళ్ళపైనా, పార్లమెంటుపైనా, ఇతర వేదికలపైనా ఆధారపడకుండా నేరుగా ప్రజలతో సంభాషించగలననీ, సందేశం వినిపించగలననీ, వారిని మెప్పించి ఒప్పించగలననీ మోదీ భావిస్తున్నారు. ఈ దిశగా జరిగిన ప్రయాణంలో ఆటు పోట్లు ఎదురైనా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతున్నారు.
 
మారిన వాతావరణం
సార్వత్రిక ఎన్నికల నాటి వాతావరణం ఇప్పుడు లేదు. ఇప్పటికీ దేశంలో అత్యంత ప్రజాదరణ, ప్రజామోదం కలిగిన నాయకుడు నరేంద్రమోదీ అన డంలో లవలేశమైనా సందేహం లేదు. ప్రతిపక్షాలలో ఐక్యత లేని మాటా నూటికి నూరుపాళ్ళు నిజం. మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడు బీజేపీ లోపల కానీ వెలుపల కానీ ఎవ్వరూ కానరావడం లేదనే విషయం ఎవ్వరూ కాదనలేని వాస్తవం. దేశ ప్రజల అనుభవంలో మాత్రం అప్పటికీ, ఇప్పటికీ వ్యత్యాసం ఉంది. అవినీతి కుంభకోణాల పరంపర, అవినీతిని అరికట్టడంలో మన్మోహన్ సింగ్ వైఫల్యం, కాగ్, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థల అభిశంసన కార ణంగా పదేళ్ళ యూపీఏ ప్రభుత్వంపైన మొహం మొత్తిన ప్రజలకు నరేంద్ర మోదీ ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా కనిపించారు. దైవాంశ సంభూతుడిగా కళ్ళకు కట్టారు. యూపీఏ ప్రభుత్వాన్నీ, కాంగ్రెస్ నాయకత్వాన్నీ, నెహ్రూ- గాంధీ వంశాన్నీ మోదీ తూర్పారబట్టిన తీరు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

అవినీతిని అంతం చేస్తాననీ, విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న వేలకోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ. 15లక్షల వంతున జమచేస్తాననీ, అవినీతి లేని  రామరాజ్యం నెలకొల్పుతాననీ చేసిన వాగ్దానాలు ఆకర్షించాయి. మోదీకి ఒక అవకాశం ఇవ్వవచ్చున ని ప్రజలు మూకుమ్మడిగా భావించారు. బీజేపీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం వంటి పార్టీలను సైతం విజయలక్ష్మి వరించింది. అసాధారణ పరిస్థితులలో అందివచ్చిన అపూర్వమైన విజయాన్ని మోదీ అపార్థం చేసుకున్నా రేమోనన్న అనుమానం ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కలిగింది. ఇప్పుడు అది బలపడుతోంది. సార్వత్రిక ఎన్నికలలో ఎంత ధాటిగా మాట్లా డారో ఢిల్లీలోనూ, బిహార్‌లోనూ మోదీ అంతే ఆత్మవిశ్వాసంతో, ఘంటాపథంగా మాట్లాడారు. ఢిల్లీలో, బిహార్‌లో పరాజయం తప్పలేదు. పార్లమెంటు ఎన్ని కలలో ఘనాతిఘనమైన విజయం సాధించిన రాష్ట్రాలలోనే అసెంబ్లీ ఎన్నికలలో కుదేలు కావడానికి దారితీసిన కారణాలు ఏమిటో విశ్లేషించుకున్నారో లేదో తెలియదు. ఉత్తరప్రదేశ్‌లో మరో మూడు మాసాలలోపే అసెంబ్లీ ఎన్నికలు జరగ బోతున్నాయి.

ఈ ఎన్నికలు మోదీకి అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికలలో విజయం సాధిస్తే ఆయనకు 2019లో సైతం తిరుగు ఉండకపోవచ్చు. ఒక వేళ పరాజయం ఎదురైతే సొంత పార్టీపైనే పట్టుతగ్గే ప్రమాదం ఉంది. ఆరేడు మాసాలుగా మోదీ వేస్తున్న అడుగులన్నీ యూపీ, పంజాబ్ రాష్ట్రాలలో ఎన్నికల కేంద్రాల వైపే.  పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మెరుపుదాడులు కానీ, పెద్దనోట్ల రద్దు ద్వారా నల్లధనంపైన యుద్ధం కానీ యూపీ ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధమున్న చర్యలుగా కనిపించకపోవచ్చును. పరోక్షంగా అవి నిర్ణయాత్మకమైనవి. సార్వ త్రిక ఎన్నికల ధోరణిలోనే ఇప్పుడూ దబాయిస్తూ, ప్రతిపక్షాలపైన విమర్శనా స్త్రాలు సంధిస్తూ ప్రచారం చేస్తే ప్రజలు ఆదరిస్తారా లేక తన రెండున్నర సంవ త్సరాల పాలనలో జయాపజయాలను ప్రస్తావిస్తూ వినమ్రంగా మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకొని ఆదరణ కొనసాగిస్తారా అన్నది ప్రశ్న.

ఈ ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పుకోవాలి. దబాయింపు దండగ అని ఎందుకు అంటున్నాం? కాంగ్రెస్ ఒక్కటే అవి నీతిలో కూరుకుపోయి దేశాన్ని భ్రష్టు పట్టించినట్టు ఆరోపిస్తే ప్రజలు నమ్ము తారా? కాంగ్రెస్‌ను సమర్థించవలసిన అవసరం సుతరామూ లేదు. అవినీతి బురద యావత్తూ ప్రతిపక్షాలదేననీ, అధికారపక్షం, మిత్రపక్షాలు మాత్రంపులు కడిగిన ముత్యాలవంటివనీ అనడం సత్యదూరం కాదా? ప్రధాని నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్యం సత్యపరీక్షలో నిలిచి నిగ్గు తేలాలి. అప్పుడే మోదీ  ప్రధానిగా ప్రకాశిస్తారు.
 
సీఎంఎస్ అధ్యయనం
వాస్తవాలను పరిశీలిద్దాం. డాక్టర్ ఎన్. భాస్కరరావు నేతృత్వంలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అధ్యయనం ప్రకారం 2014 లోక్‌సభ ఎన్నికలలో రూ. 35,000 కోట్ల వ్యయం జరిగింది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో వ్యయం ఏడు బిలియన్ డాలర్ల (సుమారు రూ. 47 వేలకోట్ల రూపాయలు) తర్వాత ఇదే ప్రపంచంలో ఒక దేశంలో జరిగిన అత్యధిక ఎన్నికల వ్యయం. ఇండియాలోని ఆరు పెద్ద  రాజకీయ పార్టీల అదాయంలో 75 శాతం నల్లధనమే నంటూ ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్) వెల్లడించింది. నిబంధనల ప్రకారం అయితే ఒక పార్టీ, ఆ పార్టీ అభ్యర్థి కలసి ఒక లోక్‌సభ నియోజకవర్గంలో రూ. 75 లక్షలూ, అసెంబ్లీ నియోజక వర్గంలో రూ. 28 లక్షలకు మించకుండా ఖర్చు చేయాలి.  2009 ఎన్నికలలో బీడ్ లోక్‌సభ నియోజకవర్గంలో తాను ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే అంగీకరించారు. 2014 ఎన్నికలలో సత్తెన పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తాను రూ. 11.5 కోట్లు ఖర్చు చేసినట్టు ఎన్‌టీవీ ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, శాసనసభాపతి కోడెల శివ ప్రసాద్ అన్నారు. అంతకంటే ఎక్కువ ఖర్చు చేసిన అభ్యర్థులు అనేకమంది ఉన్నారు.

అసలు ఎన్నికలలో డబ్బును అత్యధికంగా ఖర్చు చేసే జాడ్యం చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఉపఎన్నికతోనే మొదలయింది. అది పెరిగి వట వృక్షంగా వేళ్ళూనింది. 2014 లోక్‌సభ ఎన్నికలలో 464 పార్టీలు 8,000 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. మూడంచెల పంచాయతీ వ్యవస్థలో జరిగే ఎన్ని కలలో ఖర్చు చేస్తున్న డబ్బు సంగతి సరేసరి. 2014 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ సేకరించిన విరాళాల మొత్తం రూ. 588.5 కోట్లుగా చూపించి, చేసిన ఖర్చు రూ. 712.5 కోట్లుగా చూపించింది. రెండింటి మధ్య వ్యత్యాసం లెక్కలకు అందని నల్లధనం అనడంలో సందేహం లేదు. అదే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రూ. 350.4 కోట్లు విరాళాల ద్వారా సేకరించి, రూ. 486.2 కోట్లు ఖర్చు చేసినట్టు చూపింది. 543 లోక్‌సభ స్థానాలలో అభ్యర్థులు ఖర్చు చేసిన నల్లధనం మొత్తం రూ.14,661 కోట్లు. అదే సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అభ్య ర్థులంతా కలసి ఖర్చు చేసిన నల్లడబ్బు రూ. 11,886 కోట్లు. అభ్యర్థులు టికెట్లు సంపాదించడానికి తమ పార్టీకి విరాళంగానూ, నేతలకు ముడుపులుగానూ ఇచ్చిన డబ్బు ఎప్పటికీ లెక్కతేలదు. సీఎంఎస్ తేల్చిన లెక్కల సారం ఏమిటంటే నల్లధనం ఖర్చు చేయడంలో (2014 ఎన్నికలలో) కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ చాలా ముందు ఉన్నది.
 
చేతలలో లేని పరిశుభ్రత
వాస్తవం ఈ విధంగా ఉంటే బీజేపీ పరిశుభ్రమైన పార్టీ అనీ, బీజేపీ నాయకులు నీతికి ప్రతీకలనీ మోదీ ఎంత ధీమాగా చెప్పుకున్నా, వెంకయ్యనాయుడు అనేక భాషలలో ప్రతిభావంతంగా చెప్పగలిగినా ప్రయోజనం ఉండదు. ప్రజలు వాజ మ్మలు కాదు. నల్లధనం రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యాన్ని సూత్రబద్ధంగా తప్పుపట్టడం లేదు. దానిని అమలు చేసిన విధానం ఆత్మహత్యాసదృశంగా ఉన్నదని పాల్‌క్రుగ్‌మన్, అమర్త్యసేన్, తదితర ప్రపంచ ప్రఖ్యాతి చెందిన, నోబెల్ బహూమతి పొందిన ఆర్థికవేత్తలు స్పష్టంగా చెబు తున్నారు. అయినప్పటికీ తాము చెప్పిందే వేదమనీ, ఇతరులు చేసేది దుష్ర్ప చారమనీ వాదిస్తే చేయగలిగింది ఏమీలేదు.

నల్లధనం, దొంగనోట్లు లేకుండా ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళనం చేయాలంటే పెద్ద కుదుపు అవసరమే. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అటువంటి కుదుపే. ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తప్పుపట్టి ప్రతిఘ టించవలసిన పని లేదు. అమలులో లోపాలు లేకుండా జాగ్రత్తపడవలసిందిగా హెచ్చరించవలసిందే. పెద్దనోట్ల రద్దుతోనే అన్నీ చక్కపడవు. ఎన్నికల సంస్కరణ లను కపటం లేకుండా నిజాయతీగా అమలు చేయాలి. పార్టీలు నిధులు సేక రించే విధానాన్ని పారదర్శకం చేయాలి. ఇప్పుడైతే రాజకీయ పార్టీల ఆదాయం పైన వందశాతం ఆదాయంపన్ను మినహాయింపు (ఆదాయంపన్ను చట్టం, 13-ఎ) ఉంది. రూ. 20,000లలోపు నగదు వసూళ్ళకు పార్టీలు దాతల వివరాలు ప్రకటించవలసిన పని లేదు. రాజకీయ పార్టీలు సమాచారచట్టం పరిధిలోకి రావు (ఎందుకో?). ఈ రక్షణలు తొలగించి రాజకీయ పార్టీలను జమాఖర్చులకు జవా బుదారీ చేసినప్పుడే పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల తాత్కాలికంగా కష్టాలు ఎదు రైనా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయనే నమ్మకం కలుగుతుంది. లేకపోతే పరిస్థితి అధోగతే.
 

కె. రామచంద్రమూర్తి,
సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement