అందరినీ సంతృప్తి పరచాలనే తాపత్రయం అతి తరచుగా ఎవరినీ సంతృప్తి పరచకుండా ముగుస్తుంటుంది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రెండవ రైల్వే బడ్జెట్ సరిగ్గా అలాంటిదే. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్ల ఆశలు చూపని ఈ బడ్జెట్‌లోని ప్రధాన ఆకర్షణ ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలను పెంచకపోవడమే. 2015-16 రైల్వే బడ్జెట్ రూ. 1.83 కోట్ల రాబడిని లక్ష్యంగా పెట్టుకున్నా, సవరించిన అంచనాల ప్రకారం అది రూ. 1.67 కోట్లకు మించకపోవచ్చు. ఈ రాబడి లోటుకు తోడు ఏడవ పే కమిషన్ సిఫారసుల ప్రకారం వేతనాల పెరుగుదల రూ. 32.000 కోట్ల అదనపు భారాన్ని కూడా మోయాల్సి ఉంటుంది.
అయితే ఆర్థిక వ్యవస్థ మంద గమనం వల్ల రవాణా చార్జీలను, ప్రయాణికుల చార్జీలను స్వల్పంగా పెంచినా రాబడిలో చెప్పుకోదగిన మార్పేమీ ఉండబోదనీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం శాసనసభ ఎన్నికలు ఈ ఏడాదే జరగాల్సి ఉండగా భారీ చార్జీల పెంపుదల రాజకీయంగా మంచిది కాదనీ ఆ జోలికి పోలేదనిపిస్తుంది. తర్వాత వడ్డింపులకు ఎలాగూ అవకాశం ఉంటుంది. చార్జీలు పెంచకుండానే రైల్వే మంత్రి ఈ ఏడాది కంటే 10 శాతం ఎక్కువ రాబడిని, రూ.1,84,820 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాదిలోనే రాబడి లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైన ైరైల్వేలు వచ్చే ఏడాది రాబడిని ఎలా పెంచుకోగలవో అర్థం కాదు. ఆపరేటింగ్ వ్యయాల నిష్పత్తిని... ప్రతి రూ. 100 రాబడి కోసం ఖర్చు చేయాల్సివచ్చే వ్యయాన్ని... ప్రస్తుత రూ.97.8 నుంచి రూ.92కు తగ్గిస్తా మన్నారు. మన రైల్వేలను పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక రుగ్మతలైన అనవసర, వృథా వ్యయాలు, అసమర్థత, అలసత్వాలను ఒక్క ఏడాదిలో మటుమాయం చేయగల చిట్కా ఏమిటో అంతుపట్టదు.
గత ఏడాది దాదాపు లక్ష కోట్లుగా ఉన్న వ్యయాన్ని ఈ బడ్జెట్లో రూ. 1,21,000 కోట్లకు అంటే 21 శాతం పెంచారు. నిధులను జీవిత బీమా సంస్థ వచ్చే ఐదేళ్లలో అందజేయనున్న 1.5 లక్షల కోట్ల సులభ షరతుల రుణం నుంచి, విదేశాలలో బాండ్ల అమ్మకం ద్వారా సమీకరిస్తామన్నారు. భారత రైల్వేల ఆత్మ ప్రజలే అంటూ ప్రభు రైల్వేలను ప్రయాణికులకు అనుకూలమైనవిగా మార్చడానికి పలు చర్యలను ప్రతిపాదించారు. టెలిఫోన్ ద్వారా టికెట్ల రద్దు, ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా క్యాటరింగ్, ఉచిత వైఫై సర్వీసులు, పిల్లలున్న తల్లుల కోసం ప్రత్యేక సదుపాయాలు వంటి పలు మెరుపులు మెరిపించారు. ప్రయాణికులకు సదుపాయాలను, స్టేషన్లు, రైళ్లలో పారిశుద్ధ్యం, సమాచార వ్యవస్థలను మెరుగుపర్చడం అవసరమనడం నిస్సం దేహం.
తద్వారా ప్రయాణికులను ఆకట్టుకోగలమని భావించడంలోని సహేతుకత అంతుబట్టదు. సరుకుల, ప్రయాణికుల రవాణా రాబడులు పడిపోవడానికి ప్రధాన కారణం పారిశ్రామిక క్షీణత, రెండేళ్లుగా వ్యవసాయ రంగం దె బ్బ మీద దెబ్బతినడం. వినూత్నమైన, సృజనాత్మకమైన ఆలోచనలకు తావిచ్చిందంటున్న ఈ బడ్జెట్ మన సంప్రదాయక ఆలోచనల పరిధి నుంచి బయటపడ లేకపోయింది. స్వల్ప దూరాలకు ప్రయాణ సాధనాలుగా రైల్వేలు అట్టడుగు స్థాయిల్లో ఉండ టంలోని అర్థరాహిత్యాన్ని ఎందుకు గ్రహించలేరో అర్థం కాదు. చిన్న పట్టణాలను, నగరాలను గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానించడానికి తక్కువ దూరపు లైన్ల నిర్మాణం, గ్రామీణ, సబర్బన్ రైళ్ల నిర్వహణ చేపట్టడం లాభదాయకమే కాదు, రాబడిని పెద్ద ఎత్తున పెంచుకునే మార్గం కూడా. పాత బాటనే నడిచిన ప్రభు బడ్జెట్ కూడా అటు దృష్టి సారించలేదు.
దేశంలోని రైల్వే క్రాసింగులలో 35 శాతం, అంటే 10 వేలకు పైగా కావలి లేనివి. ప్రతి రైల్వే మంత్రీ, ప్రతి రైల్వే బడ్జెట్లోనూ ఈ సమస్యను పరిష్కరిస్తామంటూనే ఉన్నారు. గత ఏడాది ప్రభు కూడా వాగ్దానం చేశారు. గత ఆరు నెలల్లో 156 లెవెల్ క్రాసింగ్‌ల వద్ద మాత్రమే సిబ్బందిని నియమించ గలిగారు. ఈ లెక్కన ఈ సమస్య పరిష్కారానికి మూడు దశాబ్దాలు పడుతుంది. రాబోయే 3-4 ఏళ్లలోనే ఆ పని పూర్తి చేసేస్తామని మంత్రి ఎలా హామీ ఇచ్చారో తెలియదు. ప్రస్తుత సగటు వేగం 30 కిలోమీటర్లను రెట్టింపు చేస్తామనడం, మిషన్ జీరో యాక్సిడెంట్ వంటి ఆశలన్నీ దీర్ఘకాలిక ప్రణాళికలే తప్ప ఏడాది బడ్జెట్లో సాధ్యం కానివి. దేశంలోని 40 శాతానికి పైగా లైన్లు ఇప్పటికే 100 శాతానికిపైగా సామర్థ్యంతో పనిచేయాల్సి వస్తోంది. 2011-12 నుంచి కొత్తలైన్ల నిర్మాణం క్షీణిస్తూ వస్తోంది. ఇప్పుడున్న లైన్ల మీదే రిజర్వేషన్‌లేని ప్రయాణికులకు అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లను, హమ్‌సఫర్, తేజస్ ఉదయ్, ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెడతామన్నారు. వీటిలో తేజస్ 130 కిలోమీటర్ల లగ్జరీ ఎక్స్‌ప్రెస్. ఇవన్నీ విపరీతమైన రద్దీ భారాన్ని మోస్తున్న లైన్లపై మరింత భారాన్ని మోపుతాయి.
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు సహా ప్రభు 44 భాగస్వామ్య ప్రాజెక్టులను, రెండు రైలింజన్ల ఫ్యాక్టరీలను ప్రకటించారు. ఈశాన్యం తదితర ప్రాంతాలలో ఇప్పటికే ఉన్న లైన్లను బ్రాడ్‌గేజీకి మార్చడం, ఆధునీకరించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం సమంజసమే. అయితే ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులను పరిపూర్తి చేయడం వల్ల ఒక్క ఏడాది కాలంలో తక్కువ వ్యయాలతో ఎక్కువ ఫలితాలను రాబట్టవచ్చని విస్మరించడం విచారకరం. ఆనవాయితీ అన్నట్టుగా ఈ బడ్జెట్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల పట్లా సమాన నిర్లక్ష్యాన్ని చూపింది.
తెలంగాణలో కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఊసే ఎత్తలేదు. మనోహరాబాద్-కొత్తపల్లి-భద్రాచలం-సత్తుపల్లి లైన్, దశాబ్దిన్నర క్రితమే సగం పూర్తయిన పెద్దపల్లి-కరీంనగ ర్-నిజామాబాద్ మార్గం సహా ఏదీ పూర్తి అయ్యే అవకాశమే లేకుండా అన్ని ప్రాజెక్టులకూ చిల్లర డబ్బులు విదిల్చినట్టు నిధులను కేటాయించడంలోని సహేతుకత ఏమిటో అంతుబట్టదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే వైఖరి చూపిన బడ్జెట్... విశాఖపట్నం రైల్వే జోన్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన సమయంలో చేసిన వాగ్దానాన్ని సైతం విస్మరించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీరని అన్యాయంగా భావించడం అసహజం కాదు. జాతీయ ప్రయోజనాల రీత్యానే అత్యంత కీలకమైన శ్రీకాళహస్తి -నడికుడి రైల్వే లైన్‌ను పూర్తి చేయడానికి సిద్ధపడకపోవడంలోని ఔచిత్యం ఏమిటో అర్థం కాదు. పలు ఆకర్షణల మెరుపులతో ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పాత పట్టాల మీద పరుగే.
పాత పట్టాల పరుగే
Published Fri, Feb 26 2016 12:28 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement