కాజీపేట రూరల్: ఓరుగల్లులో అరుణ్ జైట్లీ ఎక్స్‌ప్రెస్ ఆగకుండానే పోయింది. పార్లమెంట్‌లో గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పాతజిల్లా ప్రజలకు నిరాశ కలిగించింది. బడ్జెట్‌లో రైల్వేపరంగా రావాల్సిన ప్రాజెక్ట్‌లు, నిధులు, కొత్త రైళ్ల మంజూరు, పెండింగ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో జిల్లా ఎంపీలు రాణించలేకపోయారని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు.
కలగానే కాజీపేట డివిజన్..
అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో కాజీపేట రైల్వేడివిజన్ కేంద్రం మంజూరు ప్రస్తావన కలగానే మిగిలిపోయింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ రైల్వేజోన్ ఇస్తే కాజీపేట రైల్వేను డివిజన్ కేంద్రంగా ప్రకటించాలనే ఉంది. అటు విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన రాలేదు.. ఇటు కాజీపేట డివిజన్ ఊసే లేకుండాపోయింది.
ఫిట్‌లైన్ నిర్మాణానికి నిధులు నిల్..
కాజీపేటలో పిట్‌లైన్ పనులు నిధుల కొరతతో అర్థంతరంగా ఆగిపోయాయి. ఈ బడ్జెట్‌లో దీనికి నిధులు మంజూరు కాలేదు. అలాగే వ్యాగన్ పీఓహెచ్ షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరు ఈసారి బడ్జెట్‌లో వస్తుందని ఆశించినప్పటికీ పెరంబుదూర్‌కు కోచ్‌ల తయారీ పరిశ్రమను మంజూరు చేయడంతో ఈ ప్రాంత ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. కొత్త రైళ్ల ప్రస్తావన రాలేదు. నాన్‌స్టాప్ రైళ్లకు హాల్టింగ్ లేదు.
ఏ–1 స్టేషన్‌గా కాజీపేట జంక్షన్..
కాజీపేట జంక్షన్‌ను ఏ–1 స్టేషన్‌గా బబ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఉన్న కాజీపేట జంక్షన్‌ను మరింత అభివృద్ధి చేసి ఏ–1 స్టేషన్‌గా దక్షిణమధ్య రైల్వేలో నిలపనున్నారు.
కాజీపేట–విజయవాడ థర్డ్‌లైన్‌కు రూ.100 కోట్లు..
కాజీపేట–విజయవాడ వరకు నిర్మాణం జరిగే నూతన మూడో రైల్వేలైన్ నిర్మాణానికి రూ.100 కోట్ల నిధులు, కాజీపేట–బల్లార్షా మూడో రైల్వే లైన్ నిర్మాణానికి రూ.160 కోట్ల నిదులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆదర్శ రైల్వేస్టేషన్లుగా రఘునాథపల్లి, కేసముద్రం..
కాజీపేట సబ్‌డివిజన్ పరిధిలోగల రఘునాథపల్లి, కేసముద్రం రైల్వేస్టేషన్లను ఆదర్శ రైల్వేస్టేషన్లుగా బడ్జెట్‌లో జైట్లీ ప్రకటించారు. త్వరలో ఈ రెండు రైల్వేస్టేషన్లు ఆదర్శ రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు.
కాజీపేట, డోర్నకల్ స్టేషన్లకు పుట్‌ఓవర్ బ్రిడ్జిలు మంజూరు
కాజీపేట, డోర్నకల్ రైల్వేస్టేషన్లలో పుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. త్వరలో ఈ స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. భద్రాచలం నుంచి సత్తుపల్లి రైల్వేలైన్‌కు రూ.300 కోట్లు, కొత్తపెల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్‌కు రూ.350 కోట్లు కేటాయించినట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు.
కాజీపేట డివిజన్, వ్యాగన్‌షెడ్, కోచ్ ఫ్యాక్టరీ ఆశలపై నీళ్లు
కొత్త రైళ్లు లేవు, నాన్‌స్టాప్ రైళ్లకు హాల్టింగ్ లేదు
ఏ–1 స్టేషన్‌గా కాజీపేట జంక్షన్
కాజీపేట, డోర్నకల్‌కు ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు
మోడల్ రైల్వేస్టేషన్లుగా
రఘునాథపల్లి, కేసముద్రం
భద్రాచలం–సత్తుపల్లి రైల్వేలైన్‌కు
రూ.300 కోట్లు కేటాయింపు
కాజీపేట–విజయవాడ రైల్వే
మూడో లైన్‌కు రూ.100 కోట్లు
కాజీపేట–బల్లార్షకు రూ.160 కోట్లు మంజూరు
Comments
Please login to add a commentAdd a comment