నేరానికి పాల్పడితే వారు 'అడల్టే'
న్యూఢిల్లీ: క్రూరమైన నేరాలకు పాల్పడే బాలనేరస్తులను ఉపేక్షించేది లేదంటూ కేంద్ర కేబినెట్ కమిటీ తేల్చి చెప్పింది. అమానుషమైన నేరాలకు పాల్పడితే వయోజనులు కాకపోయినా వారిని కఠినంగా శిక్షించే చట్ట సవరణల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్భయ కేసు ఒక ప్రత్యేకమైనదని, దీన్ని ఆధారం చేసుకుని జువైనల్ చట్టాల్లో మార్పులు చేయడాన్ని వ్యతిరేకించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులను కూడా పక్కనపెట్టి కేంద్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
16-18 ఏళ్ల వయసు కలిగిన బాలలు క్రూరమైన నేరాలకు పాల్పడితే వారిపై భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) కింద విచారణ జరుపుతారని ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. అత్యాచారం వంటి నేరానికి పాల్పడే బాలలను అడల్ట్గానే పరిగణించి చట్టప్రకారం శిక్షించాలని కమిటీ అభిప్రాయపడినట్లు ఆయన చెప్పారు.
పాటు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంతో పాటు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కాగా ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలిన బాలుడి అమానుష చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే జువైనల్ చట్టంలో మార్పులు చేయాలనే డిమాండ్లు ముందుకొచ్చాయి. 18ఏళ్ల లోపు బాలలు చేసే నేరాలను, పరిపక్వత లేని వయసులో చేసే నేరాలుగా పరిగణించే ఒక వెసులుబాటు జువైనల్ యాక్ట్‌లో ఉన్న సంగతి తెలిసిందే.