జలాశయాలు కళకళ.. అయినా నీటి కోసం విలవిల
గజ్వేల్: సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు కళకళలాడుతున్నా.. వాటిని సరైన విధంగా వినియోగించుకోలేని దుస్థితి నెలకొనడంతో గజ్వేల్ నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు తప్పడం లేదు. పూర్వకాలం నుంచి వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా ఉన్నా గొలుసు చెరువుల అభివృద్ధిపై నిర్లక్ష్యం అలుముకోవడం, వాగుల నుంచి వచ్చే వరదనీటిని చెరువులు, కుంటల వైపు మళ్లించుకోలేకపోవడం వల్ల ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా రైతులకు కష్టాలు తప్పడం లేదు.
చెరువుల అనుసంధాన ప్రక్రియ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువుల అభివృద్ధికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చేసిన ప్రకటన కొత్త ఆశలను రేపుతోంది. చెరువులను అభివృద్ధి చేస్తే భూగర్భజలాల గణనీయంగా పెరిగి వ్యవసాయరంగం సంక్షోభం నుంచి బయటపడే అవకాశముంది.
జలాశయాలు లేని గజ్వేల్ నియోజకవర్గంలో దశాబ్దాల కిందట నిర్మించిన చెరువులు, కుంటలు ప్రధానవనరులుగా ఉన్నాయి. ఈ వనరులను పరిరక్షించే విషయంలో చెప్పుకోదగ్గ కృషి జరగకపోవడం వల్ల అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. మరోపక్క కొన్ని చెరువులైతే ఏళ్లతరబడి పూడికతీతకు నోచుకోలేక పల్లంగా మారి చిన్నపాటి వర్షాలకే నిండిపోయి మిగతా నీరంతా వృథాగా పోతున్నాయి. చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోతుండగా బోరుబావుల ఆధారంగా సాగుతున్న ఇక్కడి వ్యవసాయం సహజంగానే సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెరువు, కుంటల పరిరక్షణ అత్యవసరంగా మారింది.
ప్రధానంగా గజ్వేల్ నియోజకవర్గంలోని గొ లుసు చెరువులను అభివృద్ధి చేసి వాటిని వాగులతో అనుసంధానం చేసినట్లయితే బీడు భూ ములకు నీరందించవచ్చు. నియోజకవర్గంలోని కుడ్లేరు వాగుతో చెరువులు నింపే అవకాశముంది. గజ్వేల్ మండలంలో కుడ్లేరు వాగులో ప్రవహించే నీటిని కొడకండ్ల వద్ద దారి మళ్లించి కొడకండ్ల చెరువు, కొండపాక మండలంలోని తిప్పారం, సింగారం, వేములగాట్ తదితర గ్రామాల్లోని చెరువుల్లో నీటిని నింపవచ్చు. వర్గల్ మండలంలో ప్రవహించే హల్దీవాగు ద్వారా చెరువులను నింపే అవకాశముంది.
ఈ వాగుపై అంబర్‌పేట వద్ద నిర్మించిన ఖాన్‌చెరువు నిండిన తర్వాత వాగులోని వరద నీటిని శాఖారం వద్ద ఫీడర్ ఛానెల్ నిర్మించి శాఖారం, గుంటిపల్లి, వర్గల్ చెరువుల్లో నీటిని నింపవచ్చు. మరో ఫీడర్ ఛానెల్ ద్వారా గోవిందాపూర్, గిర్మాపూర్, మాదారం, నెంటూర్, జబ్బాపూర్, మైలారం, కొమటిబండ చెరువుల్లోకి నీటిని చేర్చవచ్చు. తూప్రాన్ మండలం పా లాట, లింగారెడ్డిపేట, రావెళ్లి, బ్రహ్మణపల్లి, తూప్రాన్ గొలుసు చెరువులను అభివృద్ధి చేసినట్లయితే ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినట్లవుతుంది.
ములుగు మండలం మర్కుక్‌లో ఉ న్న పెద్ద చెరువును రంగారెడ్డి జిల్లా నారాయణపూర్ ప్రాంతం నుంచి ఉన్న పరివాహక ప్రాం తం ఫీడర్ఛానల్ను మెరుగుపరచడం ద్వారా నీళ్లతో నింపి ఈ చెరువు నుంచి పాములపర్తి, పాతూరు, ఇప్పలగూడ చెరువులకు నీళ్లను తరలించే అవకాశముంది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ప్రాంతంలో ప్రవహించే వాగు నుంచి నీళ్లను దారి మళ్లించే విధంగా ఫీడర్ఛానళ్లను నిర్మిం చడం ద్వారా ములుగు మండలం కొత్తూరు, సింగన్నగూడ, కొక్కొండ, నర్సాపూర్, తున్కిబొల్లారం, తున్కిఖాల్సా చెరువులను నింపే అవకాశముంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువుల అభివృద్ధికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామని ప్రకటించిన వేళ..ఇక్కడి రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.