ఇలా అయితే కష్టం
అకౌంట్స్ అధికారులకు కమిషనర్ క్లాస్
స్మార్ట్‌సిటీ పై దృష్టిపెట్టాలని ఆదేశం
విజయవాడ సెంట్రల్ : రికార్డులు అప్డేట్స్ చేయరు. ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి. ఇలా అయితే కష్టం అంటూ అకౌంట్స్ విభాగం అధికారులకు కమిషనర్ జి.వీరపాండియన్ క్లాస్ తీశారు. గురువారం తన చాంబర్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమన్వయం లేకపోవడం వల్లే పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. విభేదాలను పక్కనపెట్టి పెండింగ్ ఫైళ్ళపై దృష్టి సారించాలన్నారు. పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
స్మార్ట్‌పై దృష్టిపెట్టండి
నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడంపై దృష్టిసారించాలని కమిషనర్ సూచించారు. విభాగాధిపతులతో తన చాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. సమిష్టికృషితోనే స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయడం సాధ్యమన్నారు. నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రతి అధికారి ఉదయం క్షేత్రస్థాయి పర్యటనలో ఉండాలన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయాలన్నారు. ఇందుకోసం కంప్యూటర్లపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. 103కు వచ్చే ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చే వార్లపై ప్రతి విభాగం యాక్షన్ టేకెన్ రిపోర్టను సమర్పించాలన్నారు.
కిందిసిబ్బందితో తరుచు సమీక్షలు నిర్వహించాలన్నారు. కార్యాలయంలో పనికిరాని సామాగ్రిని తొలగించాలన్నారు. విద్యుత్‌ను ఆదా చేయాలన్నారు. టూర్‌డైరీ, పర్సనల్ డైరీ ప్రతి నెలా ఒకటో తేదీలోపు సమర్పించకుంటే సంబంధిత ఉద్యోగికి జీతాన్ని నిలుపుదల చేయనున్నట్లు హెచ్చరిం చారు. నగరంలో వేడిని తగ్గించేందుకు పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. పదోతరగతి పరీక్షల్లో నూరుశాతం ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాల్సిందిగా సూచిం చారు. అదనపు కమిషనర్ జి.నాగరాజు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, చీఫ్ ఇంజనీర్ ఎం.ఏ.షుకూర్, సిటీప్లానర్ ఎస్.చక్రపాణి, అకౌంట్స్ ఎగ్జామినర్ ఎం.వీ.ప్రసాద్, డీసీఆర్ డి.వెంకటలక్ష్మి, ఎస్టేట్ అధికారి విక్టర్‌బాబు పాల్గొన్నారు.