adiguppa village
-
కట్టుబాట్లలో.. కరోనా కట్టడిలో
గుమ్మఘట్ట: ఆ గ్రామం పేరు చెబితే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఆదర్శవంతమైన ఆ ఊరి కట్టుబాట్లు. ఊరిలో ఎక్కువ శాతం మంది నిర్లక్ష్యరాస్యులే. అయితేనేం.. కరోనా విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొంటూ తమ ఊరిని చుట్టుపక్కల గ్రామాలకు మార్గదర్శకంగా నిలిపారు. కట్టుబాట్లలోనే కాదు.. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలోనూ ఆదర్శంగా నిలుస్తోన్న ఆ గ్రామం పేరు అడిగుప్ప. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో గుమ్మఘట్ట మండల పరిధిలో అడిగుప్ప గ్రామం ఉంది. 150 కుటుంబాలు, 500 మందికిపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. పట్టణానికి వివిధ అవసరాల నిమిత్తం నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయినా ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం విశేషం. జాగ్రత్తలే శ్రీరామరక్ష.. గ్రామంలో కొందరు యువత కరోనా పట్ల చెప్పిన జాగ్రత్తలే వారికి శ్రీరామరక్షగా నిలిచాయి. గ్రామంలో మాసు్కలేకుండా ఏ ఒక్కరూ బయట కనిపించరు. ఇప్పుడు ఆలయాలు, రచ్చకట్టల వద్ద గుంపులుగా కూర్చోవడం లేదు. పని ఉంటే తప్ప బయటకు రావటం మానేశారు. కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు కోడి మాంసం, కోడి గుడ్లు తరచూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నప్పటికీ ఈ గ్రామంలో ఆ రెండూ ముట్టుకోరు. పూర్వీకుల కాలం నుంచి ఉన్న గ్రామ దేవుడి ఆచారాలకు కట్టుబడి కోడి మాంసం, కోడి గుడ్డులకు దూరంగా ఉంటూనే కరోనాపై విజయం సాధించారు. ధైర్యంగా ఉంటున్నాం.. మా పక్క గ్రామాల్లో కరోనా విలయతాండవం చేస్తున్నా, భయపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. గ్రామంలోని విద్యావంతులు ఎప్పటికప్పుడు కరోనా పట్ల గ్రామస్తులను అప్రమత్తం చేస్తూ జాగ్రత్త పడేలా చూస్తున్నారు. – రాజేష్, గ్రామస్తుడు సమిష్టి కృషి.. కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలిచిన అడిగుప్ప గ్రామం మా పంచాయతీ పరిధిలో ఉండడం గర్వంగా ఉంది. మద్యం విక్రయాలు, కోడి, కోడి గుడ్డు లాంటి వాటికి దూరంగా ఉండడం, ఎవ్వరూ నేరం చేసి పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కకూడదు వంటివి ఈ గ్రామంలో ఆదర్శాలు. ఇప్పుడు గ్రామస్తుల సమష్టి కృషితో కరోనా కట్టడిలోనూ ఆదర్శంగా నిలిచింది. – ఎన్ రమేష్, సర్పంచ్,కేపీదొడ్డి పంచాయతీ -
కోడి‘కూసిన’ బావి..
గుమ్మఘట్ట: సాంకేతికత నానాటికీ పెరిగిపోతున్నా..కట్టుబాట్లకు అడిగుప్ప గ్రామంలో కొదవలేదు.వాల్మీకి సామాజిక వర్గం నివసిస్తున్న గ్రామంలో పూరీ్వకులు ఇచ్చిన మాటతో నేటికీ మద్యం తాగరు..మాంసం ముట్టడంలేదు. గ్రామ సమీపంలోని ‘కోడికూసిన బావి’ వద్ద ఏడాదికోసారి జాతర నిర్వహిస్తారు. గ్రామస్తులేకాక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే జనం బావి వద్దకు వెళ్లి ఆసక్తిగా తిలకిస్తుంటారు. రాయదుర్గం నియోజకవర్గానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో గుమ్మఘట్ట మండలంలో అడిగుప్ప గ్రామం ఉంది. ఇక్కడ 120 కుటుంబాలు, సుమారు 550 మంది జనాభా ఉంది. అంతా వాలీ్మకి సామాజిక వర్గానికి చెందిన వారే. మద్యం, కోడిమాంసం, కల్లు లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. పూర్వం కులదేవర రాజులయ్యకు పూరీ్వకులు ఇచ్చిన మాటకు కట్టుబడి, నేటికీ ఆచార కట్టుబాట్లను అనుసరిస్తున్నారు. ‘గుమ్మబావి’లో ఉబికివచ్చే నీరు.. పూర్వీకులంతా రాజులదేవర ఆలయం చుట్టూ ప్రస్తుతం ఉన్న గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో నివాసిస్తుండేవారు. పశువులు, మేకలు, గొర్రెల దాహార్తిని దృష్టిలో ఉంచుకుని రాయదుర్గం పట్టణానికెళ్లే రహదారిలో బావి తవ్వకానికి శ్రీకారం చుట్టారు. అందులో సమృద్ధిగా నీరు పడింది. దీంతో ఆబావిని గుమ్మబావిగా పిలుస్తారు. నీరు అన్నివేళలా ఉబికి వస్తుండడంతో చుట్టుపక్కల ఉన్న రాజులయ్య ఆలయం వద్ద పంటలు సాగుచేసేవారు. అక్కడి నుంచి నీటిని తెచ్చుకోవడం కష్టంగా ఉండడంతో ఆలయం పక్కనున్న దేవరగుడ్డం వద్ద మరో బావి తవ్వకం చేపట్టారు. సుమారు 30 అడుగుల లోతు తవ్వగానే కోడి ప్రత్యక్షమై కూత వేసింది. దీంతో బావి తవ్వకం అర్ధంతరంగా ఆపేశారు. అందులో నీటిని వాడుకోలేకపోయారు. బావి వద్దకు వెళ్లేందుకు కూడా ఇష్టపడలేకపోయారు. నాటి నుంచి నేటి వరకూ కోడికూసిన బావిగా పిలుస్తున్నారు. ఈ కారణంతో అక్కడ నివాసం ఖాళీచేసి పొలాల మధ్య స్థిరపడిపోయారు. ఇటీవల ఆ బావి పూడిక చేరిందని, దానికో ప్రత్యేకత ఉందని గ్రామస్తులు నేటికీ చర్చించుకుంటుంటారు. ఏడాదికోసారి జాతర సందర్భంగా ఆ బావివద్దకు చాలమంది వెళ్లి తిలకిస్తుంటారని గ్రామస్తులు తెలిపారు. -
కోడి కూయని పల్లె!
ఏ గ్రామమైనా కోడికూతతో మేల్కొంటుంది. అయితే అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం అడిగుప్ప గ్రామంలో మాత్రం ఆ కూత వినిపించదు. చూద్దామంటే కోడీ.. కోడిగుడ్డూ కనిపించదు. రాయదుర్గానికి సరిగ్గా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 95 ఇళ్లు ఉన్నాయి. 470 మంది నివసిస్తున్నారు. ఎవరూ కూడా మద్యం, కోడి మాంసం ముట్టరు. ఇది పూర్వం నుంచీ కొనసాగుతున్న సంప్రదాయమని గ్రామస్తులు చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. ‘వందేళ్ల క్రితం ఈ ప్రాంతం సామంత రాజుల పాలనలో ఉండేది. చిత్రదుర్గం రాజులు తరచూ ఈ గ్రామంపై దాడి చేసి అందినకాడికి దోచుకుపోయేవారు. తమను దాడుల నుంచి రక్షించాలంటూ ప్రజలందరూ సమీపంలోని కొండపై ఉన్న రాజుల దేవర గుడి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఓ వ్యక్తికి దేవుడు పూని.. మీ గ్రామ కాపలాదారులకు కోడి మాంసం, మద్యం ఎరగా చూపి దాడులు చేస్తున్నారని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ గ్రామంలో ఎవరూ కోడి మాంసం, మద్యం ముట్టరాదని నియమం. కోళ్లు అసలే పెంచరు. ఇప్పటికీ గ్రామంలోని పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో గుడ్డుకు బదులు పండ్లు ఇస్తున్నారు. ఎవరైనా మద్యం తాగివస్తే గ్రామ బహిష్కరణ చేస్తున్నాం’ అని వివరించారు. ఈ దేవుడిపై గ్రామస్తులకు చాలా నమ్మకం. ప్రతి ఇంట్లో ఒకరికైనా ఈ దేవుడి పేరు పెట్టుకుంటారు. ఓటర్ల జాబితా పరిశీలిస్తే ఈ గ్రామంలో 102 మంది.. రాజమ్మ, రాజయ్య, రాజులయ్యలు ఉన్నారు. - న్యూస్లైన్, గుమ్మఘట్ట (అనంతపురం)