రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
అచ్చం సినిమా షూటింగ్‌ను తలపించిన ప్రమాదం
నెల్లూరు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ ప్రమాదం ఆద్యంతం సినిమా షూటింగ్‌ను తలపించింది. వివరాలు.. మరమ్మతుకు గురైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను బెంగళూరులోని బెల్ కంపెనీలో అప్పగించేందుకు బీహార్ నుంచి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ షకీల్ అహ్మద్‌ఖాన్, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ మంజిగార్సింగ్, కానిస్టేబుళ్లు కమల్ అక్మల్ఖాన్, సంజిత్‌కుమార్ పాశ్వాన్, అజిత్‌కుమార్, అశోక్కుమార్సింగ్, డ్రైవర్ సంతోష్‌కుమార్ ఇన్నోవా కారులో వచ్చారు.
తిరుగు ప్రయాణంలో వీరి వాహనం నెల్లూరుకు సమీపంలోని సుందరయ్య కాలనీ వద్ద గల జాతీయ రహదారిపై పంక్చర్ కావడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో గాయపడిన అక్మల్ఖాన్ను ఆస్పత్రికి తరలించేందుకు నెల్లూరుకు చెందిన 108 వాహనం వచ్చి ఇన్నోవా ముందు ఆగింది. వీరికి సాయం చేసేందుకు సుందరయ్యకాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థి మధుప్రభాకర్, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి నాగేశ్వరరావు వచ్చారు. అక్మల్ఖాన్ను అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న సమయంలో చెన్నై నుంచి హర్యానా వెళుతున్న కంటైనర్ ట్రాలీ వేగంగా వచ్చి ఇన్నోవాను ఢీకొట్టడంతో పాటు అక్కడున్న వారిపై దూసుకుపోయింది.
ఇన్నోవా వెళ్లి అంబులెన్స్‌ను ఢీకొనడంతో అది డివైడర్‌ను దాటి చెన్నై మార్గంలో వెళుతున్న మరోట్రాలీని ఢీకొంది. దీంతో మంజిగార్సింగ్, అక్మల్ఖాన్, సంజిత్కుమార్పాశ్వాన్, నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన మధుప్రభాకర్ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.