ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2014 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేయించి ఓటు హక్కు కల్పించాలని ఓటరు నమోదు పరిశీలకుడు శశిధర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, తహశీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటర్ల నమోదులో రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని పేర్కొన్నారు. మండలాల వారీగా నమోదు చేయాల్సిన ఓటర్లు ఎంత మంది, ఇప్పటి వరకు ఎంత మందిని నమోదు చేశారనేది తహశీల్దార్లు, ఆర్డీవోలను అడిగి తెలుసుకున్నారు.
డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలో ఎక్కువగా మరాఠి ప్రజలు ఉన్నారని, ప్రతి ఫారం అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కలెక్టర్ అహ్మద్ బాబు మాట్లాడుతూ.. 1.73 లక్షల ఓటర్లు నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 70 వేల మందిని నమోదు చేశామన్నారు. ఓటర్ల నమోదుకు ప్రతి మండల కేంద్రం ఓ కంప్యూటర్ సిస్టం, ఆపరేటర్‌ను ఇవ్వాలని కోరారు. సమావేశంలో సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, డీఆర్వో ఎస్ఎస్.రాజు, ఆర్డీవోలు అరుణశ్రీ, సుధాకర్‌రెడ్డి, చక్రధర్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, తహశీల్దార్లు రమేష్, రాజేశ్వర్‌రెడ్డి, మోతీరాం, నాయకుడు బండి దత్తాత్రి పాల్గొన్నారు.