ప్రశాంతంగా జేఈఈ
ఖమ్మం, న్యూస్‌లైన్ : జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఏఐఈఈఈ ప్రవేశ పరీక్షలు జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాల్లో మొత్తం 10 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. పేపర్-1, పేపర్-2 విభాగాల్లో మొత్తం 6,379 మందికి గాను 6,145 మంది హాజరు కాగా 234 మంది గైర్హాజరయ్యారని పరీక్షల జిల్లా సమన్వయకర్త పార్వతీరెడ్డి తెలిపారు.
ఇందులో పేపర్ -1 పరీక్షల్లో 4,659 మంది విద్యార్థులకు 4,540 మంది హాజరు కాగా, 119 మంది గైర్హాజరయ్యారని, పేపర్-2 విభాగంలో 1720 మందికి గాను 1605 మంది హాజరయ్యారని వివరించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్ సనా బృందం జిల్లాలోని అన్ని కేంద్రాలను పర్యవేక్షించి పరీక్షల తీరును గమనించారు.
ఈ సందర్బంగా పార్వతీరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు ఇన్విజిలేటర్లకు, స్క్వాడ్ బృందాలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. జిల్లాలోని అన్ని సెంటర్లలో పరీక్షలు సజావుగానే జరిగాయని తెలిపారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఆర్టీసీతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు బస్సు సౌకర్యం కల్పించారన్నారు. అయితే పరీక్ష కేంద్రాల వద్ద సరైన వసతి లేకపోవడంతో పరీక్షలు అయ్యేంత వరకు ఎండలోనే ఉండాల్సి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.