దేశాలు గాలించి.. భర్తను పట్టుకుని..
కేరళకు చెందిన ఓ వ్యక్తి.. పాకిస్థాన్‌కు చెందిన ఓ బ్రిటిష్ యువతిని పెళ్లి చేసుకుని, తర్వాత ఆమెను వదిలేశాడు. అక్కడినుంచి పారిపోయి తన సొంత రాష్ట్రమైన కేరళలోని మలప్పురం జిల్లాకు వచ్చేశాడు. అయితే తన మాజీ భర్త ఎక్కడున్నాడో వెతికి వెతికి పట్టుకున్న సదరు మహిళ.. అతగాడితో సుదీర్ఘ న్యాయపోరాటం చేసి, భారీమొత్తంలో భరణం పొందింది. మలప్పురం జిల్లాలోని చవక్కడ్ ప్రాంతానికి చెందిన నౌషద్ హుస్సేన్ లండన్‌లో ఎంబీయే చదివేవాడు. అప్పట్లో పాకిస్థాన్‌కు చెందిన బ్రిటిష్ మహిళ మరియం ఖాలిక్ అక్కడ సేల్స్ ఆఫీసర్‌గా పనిచేసేది. ఆమెతో స్నేహం పెంచుకుని, 2013 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు నచ్చజెప్పి కేరళలో మళ్లీ పెళ్లి చేసుకుందామని, తీసుకెళ్తానని చెప్పి నౌషాద్ యూకే వదిలి వెళ్లిపోయాడు. మొదట్లో కొన్నాళ్ల పాటు ఆమెకు ఫోన్ చేసేవాడు గానీ, తర్వాత ఫోన్లు ఆగిపోయాయి. కొంతకాలం తర్వాత తన తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదని, తాను యూకే తిరిగి రావట్లేదని ఓ లేఖ రాశాడు.
అతడి గురించిన ఆధరాలేమీ పెద్దగా లేకపోవడంతో, ఆమె 2015లో తన పెళ్లి ఆల్బం తీసుకుని మలప్పురం వచ్చింది. ఆమె పాకిస్థాన్‌కు చెందినది కావడంతో పోలీసులు కూడా పెద్దగా సహకరించలేదు. ఆమె కష్టాలు తెలుసుకున్న స్నేహిత అనే స్వచ్ఛంద సంస్థ ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చింది. రెండు నెలల తర్వాత నౌషాద్ మరో పెళ్లికి సిద్ధమవుతూ దొరికేశాడు. తనను భార్యగా అంగీకరించకపోవడంతో ఆమె అతడిపై కోర్టులో కేసు దాఖలు చేసింది. కోర్టు ఆమెను అతడి ఇంట్లోనే ఉండొచ్చని చెప్పినా, హుస్సేన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అత్తింటివాళ్లు తన వీసాను రద్దుచేయించడానికి, తనను భయపెట్టడానికి ప్రయత్నించినా ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు.
పలువురు న్యాయవాదులు ఆమెకు దన్నుగా వచ్చారు. చివరకు ఇంగ్లండ్‌లో ఉండేందుకు సరిపోయేలా ఒకేసారి ఆమెకు పెద్దమొత్తంలో భరణం ఇచ్చేందుకు నౌషాద్ అంగీకరించాడు. తన పోరాటం కేవలం డబ్బు కోసం కాదని, తన జీవితంతో ఆడుకున్నందుకు అతడికి గుణపాఠం చెప్పేందుకేనని ఆమె తెలిపింది. మహిళలను తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదని, యూకే వెళ్లేముందు ఒకసారి భారతదేశం అంతా చూస్తానని చెప్పింది. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారని కృతజ్ఞతలు కూడా తెలిపింది.