ఎనిమిది మంది రైతుల ఆత్మహత్య
గుండెపోటుతో మరో ఇద్దరు..
సాక్షి నెట్వర్క్: అప్పులబాధతో తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంకు చెందిన అలేటి సర్వేష్(39), ఇదే జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి శివారు రామన్నగూడెంకు చెందిన మిట్టపల్లి రాజు (30), కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం తిరుమలాపూర్కు చెందిన రైతు కల్లెం పెద్ద నాంపెల్లి(62), ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మం డలం పడమటితండాకు చెందిన కౌలురైతు భూక్యా బిక్కు (33), మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ మండలం పర్సాపూర్కు చెందిన పెంటప్ప (35), రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన బేగరి సదానందం (35), మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం రాయపోల్ గ్రామానికి చెందిన అరికెల భిక్షపతి (50), ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మాటేగాంకు చెందిన కౌలు రైతు దిగంబర్ (40) బలవన్మరణాలకు పాల్పడ్డారు. కాగా, గుండెపోటు తో మరో ఇద్దరు రైతులు మృతి చెందారు.
వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు చెందిన సోలిపురం సోమిరెడ్డి (56) మూడెకరాల్లో వరి సాగు చేశాడు. రుణ పరిమితిని పెంచేందుకు బ్యాంకు అధికారులు అంగీకరించలేదు. పంట దిగుబడి కూడా అంతంతే వచ్చే అవకాశముంది. దీంతో రూ.5 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనతో నిద్రలోనే గుండెపోటుకు గురయ్యూడు. ఇదే మండలం కాటాపురానికి చెందిన ఎం.డి.గౌస్ అహ్మద్ (42) గత ఏడాది అప్పు చేసి కూతురు పెళ్లి చేశాడు. పంటల దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనతో గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు.